Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఎసిల వాడకంపై నియంత్రణ

edit

ఇటీవల ట్విట్టరులో కేంద్ర ప్రభుత్వంపై కొత్త జోకులొచ్చాయి. “మన ప్రభుత్వం ఇప్పుడు మన ఎ.సి.టెంపరేచర్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఎంత హాస్యాస్పదం” మనక్ గుప్తా అనే ట్విట్టరు యూజర్ అన్నాడు. జయవీర్ షెర్గిల్ ట్వీట్ చేస్తూ “బిజెపి ప్రభుత్వం మన ఎ.సి. ఏ టెంపరేచరులో ఉండాలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడిక ఎ.సి. విజిలేంటిజమ్, ఎ.సి.రక్షక్ దళాలు వస్తాయి జాగ్రత్త. దేశభక్తి ఇప్పుడు ఎ.సి.టెంపరేచరుతో కొలిచి నేషనలిజం సర్టిఫికేట్లు ఇవ్వడానికి కొత్త కొలమానం “24 డిగ్రీల ఎ.సి” అన్నాడు. నిధి రాజ్దాన్ ట్వీట్ చేస్తూ “మన ఎ.సి.లు ఏ టెంపరేచరులో ఉండాలో ప్రభుత్వం చెప్పాలా? మేం ఎంత అన్నం తినాలో కూడా చెబుతారా? ఎన్ని నీళ్ళు తాగాలో కూడా చెబుతారా?” అంటూ విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయం అనుకోవడం చాలా తప్పు. ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ విమర్శించాలన్న ధోరణి కూడా మంచిది కాదు. ఈ విమర్శలన్నీ ఎందుకు వచ్చాయంటే, ఇంధన వనరుల శాఖ ఇటీవల ఎయిర్ కండీషనర్ల తయారీదార్లకు ఉత్తర్వులు జారీ చేస్తూ డిఫాల్ట్ టెంపరేచర్ 24 డిగ్రీలు ఉండాలని చెప్పింది. కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ 18 డిగ్రీలకు బదులు 24 డిగ్రీల వద్ద ఎ.సి.పని చేస్తే 36 శాతం విద్యుచ్ఛక్తి ఆదా చేయవచ్చని చెప్పారు. ఇది ఆరోగ్యానికి, బడ్జెటుకు రెండింటికి మంచిది. కాని చాలా ఎ.సి.లు ఇండ్లలో కాని, ఆఫీసుల్లో కాని 18 నుంచి 21 డిగ్రీల వద్ద పనిచేస్తుంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆయన చెప్పారు. ఈ మాటల్లో తప్పేమీ లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవికాలంలో మన శరీరాలు పెరిగిన ఉష్ణోగ్రతలకు అలవాటు పడతాయి. నిపుణుల ప్రకారం వేసవికాలంలో 24 డిగ్రీలు కాదు, 28 డిగ్రీల వద్ద ఎ.సి.పనిచేయడం మంచిది. చలికాలంలో 23 డిగ్రీల వద్ద పనిచేసేలా సెట్ చేసుకోవడం మంచిదంటారు. గమనించవలసిన మరో విషయమేమంటే ప్రభుత్వ ఉత్తర్వులో డిఫాల్ట్ టెంపరేచర్ 24 డిగ్రీలుగా ఎ.సి.లు తయారు చేయాలని చెప్పారు. అంతేకాని, 24 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ లేని విధంగా ఎ.సి.లు తయారు చేయాలని చెప్పలేదు. సాధారణంగా ఎ.సి. ఆన్ చేసినప్పుడు అంతకు ముందు ఏ టెంపరేచర్ వద్ద ఆఫ్ అయ్యిందో అదే టెంపరేచర్ వద్ద ఆన్ అవుతుంది.డిఫాల్ట్ 24 డిగ్రీలుగా సెట్ చేస్తే ఎ.సి. ఎప్పుడు ఆన్ చేసినా 24 డిగ్రీల టెంపరేచర్‌తో ఆన్ అవుతుంది. కావాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఈ విషయాన్ని విమర్శకులు గమనించినట్లు లేరు.
గమనించవలసిన మరో విషయమేమంటే, ఎ.సి. టెంపరేచర్ 16 డిగ్రీలు సెట్ చేసినంత మాత్రాన రూములో టెంపరేచర్ 16 డిగ్రీలకు పడిపోదు. రూమ్ టెంపరేచర్ 16 డిగ్రీలకు వచ్చేవరకు ఎ.సి. మోటార్ పనిచేస్తుంది. కాని ఆ తర్వాత టెంపరేచర్ కొద్దిగా పెరిగినా వెంటనే ఎ.సి. ఆన్ అవుతుంది. దానివల్ల జరిగేదేమంటే ఎ.సి. ఎక్కువ సేపు పనిచేయవలసి వస్తుంది. అదే 24 డిగ్రీల వద్ద సెట్ చేస్తే రూమ్ టెంపరేచర్ 24 డిగ్రీలకు రావడం త్వరగా జరుగుతుంది కాబట్టి ఎ.సి.కి పని తగ్గుతుంది. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల మధ్య ఉంటుంది కాబట్టి 24 డిగ్రీల వద్ద సెట్ చేయడమే మంచిది. సాధారణంగా భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఎ.సి.లు 1.5 టన్నుల సామర్థ్యం ఉన్నవి. ఈ ఎ.సి. సాధారణంగా గంటకు ఒక యూనిట్ తీసుకుంటుంది. 0.98 కిలోల కార్బన్ డయాక్సయిడ్ విడుదల చేస్తుంది. సాధారణంగా 8 నుంచి 10 గంటల వరకు ఎ.సి. పనిచేస్తుంది. అంటే దాదాపు 10 కిలోల కార్బన్ డయాక్సయిడ్ రోజుకు విడుదల చేస్తుంది. పర్యావరణ మార్పులకు ముఖ్యమైన కారణం ఈ కార్బన్ డయాక్సయిడ్. ఎ.సి. 24 డిగ్రీల వద్ద పనిచేస్తే రోజుకు కనీసం సగం యూనిట్ ఆదా చేయవచ్చు. దీనివల్ల ఆర్థికభారం తగ్గుతుంది. కార్బన్ డయాక్సయిడ్ కూడా తగ్గుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వే ప్రకారం దేశంలో మొత్తం ఎనిమిది కోట్ల టన్నుల ఎ.సి.లున్నాయి. 2030 నాటికి ఇది 25 కోట్ల టన్నులకు పెరగవచ్చు. ప్రజలు కనుక తోడ్పాటు అందిస్తే ఏటా 2000 కోట్ల యూనిట్ల విద్యుచ్ఛక్తి ఆదాచేయవచ్చు. అయితే ఎయిర్ పోర్టులు, హోటళ్ళు, రైళ్ళ వంటి జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో 24 డిగ్రీలకు ఎ.సి. తగ్గించడం మంచిది కాదని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతల వల్ల మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎ.సి. పనిచేయడం అవసరమని నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లు కనబడదు. విచిత్రమేమంటే ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి రైళ్ళలో ఎ.సి.లు ఎలా పనిచేస్తాయంటే చలేస్తుంది. కప్పుకోడానికి బ్లాంకెటు కూడా రైల్వే శాఖ ఇస్తుంది. ఇదో విచిత్రం. ఇళ్లల్లో కూడా ఇలాగే చేస్తుంటారు. ఎ.సి. 16 డిగ్రీల వద్ద పనిచేస్తుంటుంది. ఉన్నిరగ్గులు కప్పుకుని పడుకుంటాం.
ప్రపంచంలో కార్బన్ వాయువులు విడుదల చేసే దేశాల్లో భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది. పారిస్ ఒప్పందంపై సంతకం చేశాం. ఆ లక్ష్యాలను సాధించాలంటే చాలా కష్టపడవలసి ఉంది. ఆ ఒప్పందం ప్రకారం 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువులను 33 నుంచి 35 శాతానికి తగ్గించాలి. కాని ఇండియా వంటి వేడి దేశాల్లో ఎ.సి.లేకుండా పని జరగదు. ప్రస్తుతం దేశంలో కేవలం 5 శాతం ఇండ్లలోనే ఎ.సి.లున్నాయి, కాని త్వరలోనే ఎ.సి.ల సంఖ్య చాలా పెరుగుతుందని, ఇప్పుడు ఎ.సి.లగ్జరీ కాదు అవసరంగా మారిపోయిందని తెలుస్తోంది. కాబట్టి గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం కాదు కనీసం పెరక్కుండా చూడడం కష్టమయ్యే పరిస్థితి. అందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచనల మేరకు 24 డిగ్రీలు డిఫాల్ట్‌గా పెట్టింది. కాని ప్రభుత్వంపై విమర్శలు, జోకులు పెల్లుబికాయి. ఈ విమర్శలు సముచితం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రీన్ హౌస్ వాయువులను అదుపు చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోకతప్పదు.కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మంచిదే కాని దీనివల్ల అనుకున్న ఫలితాలు లభిస్తాయా అన్నది అనుమానమే. ఎయిర్ కండీషనింగ్ అనేది కొందరికి సదుపాయం, చాలా మందికి దౌర్భాగ్యం. ఒక ఇంట్లో ఎ.సి. ఉంటే ఆ ఇంట్లో వారికి చల్లదనం లభిస్తుంది. కాని వాతావరణంలో కార్బన్ డై ఆక్సయిడ్ పెరుగుతుంది. అంతేకాదు ఆ గదిని చల్లబరచడానికి ఎ.సి. బయటకు విడుదల చేసే వేడిగాలులతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా ఇతరులకు వేడి ఎక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎ.సి. తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎ.సి.లు ఒక ప్రాంతంలో పెరిగిన కొద్దీ అక్కడ బయటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదొక విషవలయం. లోపలున్న వారికి చల్లగా ఉంటుంది. బయటి వారికి వేడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎ.సి. ఉష్ణోగ్రతను 24 డిగ్రీల కన్నా తక్కువ కాకుండా చూడడంవల్ల కొంతపరిస్థితి మెరుగు పడవచ్చు.కాని ఈ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాల పేరుతో నోట్లరద్దు, జియస్టీతో చేసిన ప్రయోగాలు ఇప్పటికే ప్రజలను నానా కష్టాల పాలుచేశాయి. మరోవైపు గోరక్షణ పేరుతో గోగూండాల దాష్టికాలు, పశుమాంసం పేరుతో దాడులు ఇవన్నీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పట్ల వ్యతిరేకత వస్తోంది. జపానులోను 2005లో కూల్ బిజ్ పాలసీ ప్రారంభమైంది. ఆఫీసుల్లో, మాల్స్‌లో టెంపరేచర్ 28 డిగ్రీల కన్నా తక్కువఉండరాదని నిర్దేశించింది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దీనివల్ల 2010నాటికి 16 కోట్ల 90 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సయి డ్ విడుదల తగ్గిందని తెలిసింది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలన్నింటిని గుడ్డిగా వ్యతిరేకించడమూ మంచిది కాదు. ఇది ఒక మంచి నిర్ణయం.

  *  ఎస్.రామానుజులు 

Comments

comments