Search
Friday 21 September 2018
  • :
  • :

కుక్ అరుదైన రికార్డు

cook

లీడ్స్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా 154 మ్యాచులు ఆడి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. 2006లో ఇంగ్లాండ్ తరపున తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడిన కుక్ ప్రస్తుతం అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో విరామం లేకుండా అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పేరిట ఉండేది. బోర్డర్ వరుసగా 153 టెస్టు మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించాడు. తాజాగా కుక్ బోర్డర్ రికార్డును బద్దలు కొట్టాడు. కుక్ వరుసగా 154 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన కొత్త రికార్డును నెలకొల్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా కుక్ ఈ రికార్డును తన పేరిట నమోదు చేశాడు.
ఇంగ్లాండ్‌కు ఆధిక్యం…
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఇంగ్లాండ్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తాజా సమాచారం లభించే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లాండ్‌ను టాప్ ఆర్డర్ ఆదుకుంది. ఓపెనర్లు అలిస్టర్ కుక్ (46), కిటన్ జెన్నింగ్స్ (29) తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించి శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన కెప్టెన్ జో రూట్ ఆరు ఫోర్లతో 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు యువ ఆటగాడు డొమినిక్ బేస్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బేస్ ఏడు ఫోర్లతో 49 పరుగులు సాధించాడు. డేవిడ్ మలాన్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్‌కు ఇప్పటి వరకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమేర్ రెండు వికెట్లు తీశాడు.

Comments

comments