Home ఎడిటోరియల్ ‘చూసిరాత’ పరీక్షలు

‘చూసిరాత’ పరీక్షలు

ఇంటర్నల్ పరీక్షలలో కాపీయింగ్ జరుగకుండా పటిష్టమైన విధానం రూపొందించాలి. విద్యార్థులం దరూ నిజాయితీ పరులు కారనే సత్యాన్ని గుర్తించి టీచర్లు పరీక్ష సమయంలో ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ల కూడదు.  ఎఫ్‌ఎ పరీక్షల నోట్స్ , ప్రాజెక్టు పనులలో గత సం॥ విద్యార్థులవే మార్చి  ఈ సం॥ చూప కుండా నిరోధించాలి. ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలలో ఒకరిని ఎసిబి, విజిలెన్స్‌ల నుండి నియమించాలి. ప్రబల సమస్యగా మారిన మాల్ ప్రాక్టీస్‌ను  నిరోధించకపోతే పరీక్షా కేంద్రాలు భవిష్యత్తులో అక్ర మార్కులను తీర్చిదిద్దే కేంద్రాలుగా మారుతాయి.

copy-writes“పరీక్షలలో ఉత్తీర్ణులవుతున్న వారిపైనే దృష్టి పెట్టడం విద్యావ్యవస్థ అతిపెద్ద వైఫల్యాలలో ఒకటి” అన్న బ్రిటీష్ కవి మైఖేల్ మోర్పురో మాటలు మన రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అద్దం పడుతున్నాయి. పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసి, మూల్యాంకనం కూడా పూర్తయిన తరుణంలో నలు గురు కూడిన చోట ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ‘ఇంత ఘోరమైన చూచిరాత పరీక్షలు ఎప్పుడూ చూడలేదని’. ఇక పది పరీక్షలు అవసరమా? 11 పేపర్లతో 15 రోజులపాటు విద్యార్థుల ఆరోగ్యానికి, సహనానికిపరీక్ష పెట్టాలా? అన్ని కేంద్రాలలో ఒకేసారి సిసి కెమెరాలను ఏర్పాటు చేయకుండా కొన్ని కేంద్రా లలో రాసే విద్యార్థులనే ఎందుకు పరీక్షించారు? ఇలాగే పరీక్షలు నిర్వహిస్తే విద్యాప్రమాణాల మాటేమిటి?
గత కొన్ని సం॥లుగా కెజి నుండి పిజి వరకు విద్యార్థులు అంతర్గత మరియు పబ్లిక్ పరీక్షలలో ‘చూసి రాసే’ సంస్కృతి బాగా పెరిగింది. ప్రక్కవారి పేపర్లో చూసి రాయడం, స్లిప్స్ తెచ్చుకొని రాయడం, యాజ మాన్యాలు, తల్లిదండ్రులు, స్నేహితులు పంపిన జిరాక్స్ పేపర్లలోని ఆన్సర్స్ రాయడం, పరస్పరం సమాధాన పత్రాలు మార్చుకొని రాయడం, ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాయడం వంటి అనుచిత పద్ధతులు సాగుతున్నాయనే అభిప్రాయం బలపడిఉంది. మాల్ ప్రాక్టీస్ నిరోధానికి నియమితులైన స్కాడ్‌లు, చీఫ్‌సూప రింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌లు, ఇన్విజి లేటర్లను పాఠశాల యాజమాన్యాలు, పేరెంట్స్, సబ్జెక్ట్ టీచర్లు ‘ప్రభావితం’ చేసి పక్కాగా కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. పరీక్షల నిర్వహణ ‘కంచే చేను మేసిన చందం’లా తయారైంది.
ఈ విధంగా విద్యార్థులు చూసి రాయటం అన్ని స్థాయిల్లో జరుగుతుంది. 1 నుండి 10వ తరగతి వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహణ చాలా పాఠశాలల్లో ‘ఫార్సు’ గా మారింది. రోజుల తరబడి పరీక్షలు, గుంపు లుగా చూసి రాయటం, విద్యార్థులే మదింపు చేయటం, విద్యార్థులే మార్కులు వేయటం, కొన్ని పాఠశాలల్లో సం॥నికి ఒక్కసారి కూడా ప్రగతిని వివరించకపోవటం వంటివి జరుగుతున్నాయి. కాపీయింగ్ కారణంగా ప్రతిభ గల విద్యార్థులకు గుర్తింపు లభించడం లేదు. చాలా పాఠశాలల్లో రు.120/- ఫీజుకు బదులు రూ. 1000/-కి పైగా వసూలు చేసి ఇన్విజిలేట ర్లను, అధి కారులను సంతోషపరు స్తున్నారు. ఇక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంతా ఓపెనే? పక్కాగా డబ్బు వసూళ్ళు బహి రంగంగా జరుగుతున్నా యి.
పరీక్షలు ఇంత అధ్వాన్నంగా జరుగు తున్నా పత్రి కలు, ఛానల్లు గుర్తించడం లేదు. చాలా చోట్ల మీడి యా ను మేనేజ్ చేస్తు న్నారా? అన్న సందేహం నిజమనిపి స్తున్నది. ఫ్లైయింగ్ స్వాడ్లరాకను సెల్‌ఫోన్ల ద్వారా ముందే ఆయా కేంద్రాలకు కొందరు చేరవేస్తున్నారు. దాంతో 5,10 నిముషాల్లో అంతా గప్‌చుప్, చాలా సమ యాల్లో ఈ బృందాలు కూడా‘ఉదారంగా’ ఉంటు న్నాయి.
10/10 జిపిఎ గ్రేడింగ్ సాధనకొరకు కొన్ని పాఠ శాల యాజమాన్యాలు ఇటువంటి తప్పుడు విధానా లను ప్రోత్సహిస్తున్నాయి. తనిఖీ బృందాలు ‘డిబార్’ చేసిన సమయంలో డబ్బులు, పరపతితో విద్యార్థులను తప్పిస్తున్నారు. ఇలాంటి చూచిరాత పరీక్షలలో విద్యా ప్రమాణాలు నానాటికి పతనమవుతున్నాయి. తెలివైన విద్యార్థుల కృషి నిష్ఫలం కాగా, కాపీయింగ్ ద్వారా ఎక్కువ గ్రేడింగ్ పొందిన వారు ట్రిపుల్ ఐటీ, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ కాలేజీలలో సీట్లు సంపాదిస్తు న్నారు. ఫలితంగా ఈ విద్యాసంస్థలు నాసిరకం విద్యా ర్థులతో నిండిపోతున్నాయి. “నాకు టి.సి. ముట్టినది” అని రాయలేని విద్యార్థి కూడా ఎస్‌ఎస్‌సి పరీక్షలలో పాసవుతున్నాడు. ఇది చూసి కొత్తగా పదికి వచ్చే విద్యార్థులు కష్టపడటం లేదు. 10 నుండి 20 శాతం మంది ఏనాడూ బడిముఖం చూడటం లేదు. 30 నుండి 40 శాతం ఎఫ్‌ఎ పరీక్షలు, ప్రాజెక్టు పనులు చేయటం లేదు. అయినా వీరికి ఇంటర్నల్ మార్కులు వేయటం అన్ని పాఠశాలల్లో జరుగుతుంది. ఆయాచితంగా వస్తున్న ఫలితాల వల్ల ఉపాధ్యాయుల్లో అలసత్వం పెరి గింది. వారు తమ బోధనా మెలకువలను మెరుగు పరుచు కోవడం లేదు. సిలబస్ పూర్తి చేయడం లేదు. చాలా మంది ఉపాధ్యా యులకు కొత్త పుస్తకాలపై ‘సాధి కారత’ లేదు. తెలివిగల విద్యా ర్థులు కూడా 20 మార్కులకే ఎక్కువ సమయం కేటా యిస్తూ 80 మార్కు లకు ఎలాగైనా ‘సాయం’ అందు తుందనే నమ్మకంతో చదువు నిర్లక్షం చేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని స్థాయిల పరీక్షల నిర్వహణా ప్రభుత్వం సంస్కరించాలి. లేకపోతే విద్యా ప్రమాణాలు పడిపోయి మొత్తం విద్యావ్యవస్థ ‘డొల్ల’ అన్న చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ssc 11 పేపర్లును 6కు కుదించాలి. తక్కువ సమయంలో పరీక్ష లు పూర్తయ్యేలా షెడ్యూల్ ఉండాలి. బయోమెట్రిక్ హాజరు . సిసి కెమెరాలను 10, ఆపైన అన్ని తరగతుల పరీక్షలకు తప్పనిసరి చేసి ఆన్‌లైన్ మానిటరింగ్ చేయాలి. ssc విద్యార్థులకు సింగిల్ బుక్‌లెట్ ఇవ్వాలి. ఒక్కసెట్ ప్రశ్నాపత్రాలనే ముద్రించి ఖర్చు తగ్గించాలి. ప్రక్కవాని పేపర్లో చూసి రాయడం దొంగతనంతో సమానమని బాల్యం నుండే విద్యార్థులకు బోధించాలి.