Home హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కార్డన్ సెర్చ్

ఉస్మానియా ఆసుపత్రిలో కార్డన్ సెర్చ్

Cordon search in Osmania hospital

పోలీసుల అదుపులో 25 మంది యాచకులు,

మంది అనుమానితులు

ఉస్మానియా ఆసుపత్రి ప్రవేశ మార్గాలు తగ్గించాలి : డిసిపి రమేష్

మన తెలంగాణ/గోషామహల్: మొట్టమొదటిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో ఈస్ట్ జోన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. శని వారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈస్ట్‌జోన్ డిసిపి రమేష్ ఆధ్వర్యంలో అదనపు డిసిపి గోవింద్‌రెడ్డి, సు ల్తాన్‌బజార్ ఎసిపి డాక్టర్ చేతన, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ పి.జిరెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలతో పాటు సుమారు 150 మంది సిబ్బంది ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ఓపీ, ఐపి, కులీ కుతుబ్‌షా భవనాల్లోని క్యాజువాల్టీ, రోగి సహాయకుల విశ్రాంతి గదులతో పాటు పలు ల్యాబ్‌లు, వార్డుల్లో సందర్శించి అనుమానా స్పదంగా తచ్చాడుతున్న వారిని, రోగి సహాయకుల విశ్రాంతి గదిలో నిరీక్షిస్తున్న ఇద్దరు వృద్ధులను విచారించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిసిపి రమేష్ మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు… మీ వాళ్లెవరు చికిత్సలు పొందుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో డిసిపి రమేష్, అదనపు డిసిపి గోవింద్‌రెడ్డి, ఎసిపి డాక్టర్ చేతన, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌లతో కలిసి మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులు, వారి సహాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కార్డన్‌సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. మొట్టమొదటి సారిగా ఆసుపత్రిలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఆసుపత్రి మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండే విధంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆసుపత్రి లోపలికి, వెలుపలకు రాకపోకలు సాగించేందుకు 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయని, వాటిని వీలైనంత వరకు తగ్గించడం వల్లనే నేరాలను నియంత్రించడంతో పాటు జేబు దొంగలు, సెల్ ఫోన్ దొంగలు, అసాంఘిక శక్తుల ఆట కట్టించవచ్చన్నారు. ఆసుపత్రిలో అ వసరమైన చోట్ల గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి భద్రత, భద్రతా చర్యలపై శిక్షణతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. త్వరలో ఉస్మానియా సెక్యూ రిటీ సిబ్బందికి భద్రత చర్య లపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఆనుమానాస్పదంగా తచ్చాడుతున్న 25 మంది యాచకులను అదుపులోకి తీసుకుని చంచల్‌గూడలోని ఆనంద ఆశ్రమానికి తరలించారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ఆరుగురు వ్యక్తులు తమ ఆధార్ కార్డులతో పాటు ఇతర గుర్తింపు కార్డులు చూపించడంతో వారి వివరాలను సేకరించి వదిలిపెట్టారు. అదుపులో ఉన్న ఇద్దరిలో ఫెరో జ్ అనే యువకుడి వేలిముద్రల ఆధారంగా గతంలో సుల్తాన్‌బజార్, వేములవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఫెరోజ్‌తో పాటు అతనితో ఉన్న ఇర్ఫాన్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గంజ్ ఎస్‌ఐలు నాగరాజ్, సైదులు, కరుణకుమార్, రామాంజనేయులు, లచ్చిరెడ్డిలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.