Home అంతర్జాతీయ వార్తలు మీ వలస విధానంతో అమెరికాకు హాని

మీ వలస విధానంతో అమెరికాకు హాని

ట్రంప్‌కు 59 యుఎస్ కంపెనీ నిర్వాహకుల ఘాటైన లేఖాస్త్రం

trump

న్యూయార్క్ : ట్రంప్ అధికార యంత్రాంగం అనుసరిస్తోన్న ఇమ్మిగ్రేషన్ విధానంపై పలు ప్రముఖ అమెరికా కంపెనీలు నిరసన వ్యక్తం చేశాయి. తమ ఆందోళనను ఒక లేఖలో వ్యక్తపర్చాయి. టెక్ దిగ్గజం యాపిల్ , అమెరికన్ ఎయిర్‌లైన్స్, జెపి మోర్గాన్ ఛేజ్ అండ్ కో వంటి మొత్తం 59 కంపెనీల ప్రధాన నిర్వాహణాధికారులు (సిఇఒ) ట్రంప్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ప్రత్యేకించి దేశానికి ఉద్యోగాల కోసం వలస వస్తున్న వారి పట్ల అధికార యంత్రాంగం అవలంభిస్తోన్న విధానాన్ని ఎండగట్టారు. ఇప్పుడు అనుసరిస్తున్న పాలసీతో దేశానికి హానీ జరుగుతుందని హెచ్చరించారు. అమెరికాలోని అతి పెద్ద కంపెనీలు ఇప్పటి పాలసీపై ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి.

కొత్తగా అమలు చేస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు , పాటిస్తున్న నిబంధనలు దేశ వ్యవస్థలో అనిశ్చితికి దారితీస్తాయని, ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తాయని ఈ ప్రముఖ సంస్థల నిర్వాహకులు భయాందోళనలు వ్యక్తం చేశారు. యాపిల్ ఐఎన్‌సి నిర్వాహకులు టిమ్ కుక్, జెపి మోర్గాన్‌కు చెందిన జేమీ డైమన్, అమెరికా ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు డౌగ్ పార్కర్ వంటి వారు ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పాలసీపై తీవ్రస్థాయి విశ్లేషణల తరువాత తమ ఆందోళనను ఒక లేఖలో పొందుపర్చారు. తమ కంపెనీలు ఉద్యోగులపై ఆధారపడి పనిచేస్తాయని, ప్రస్తుత విధానాలతో తీవ్రస్థాయిలో అనిశ్చిత స్థితిని ఎదుర్కోవడం జరుగుతోందని, పలువురు డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఈ ప్రముఖులు తెలిపారు. నిలకడలేని నిర్ణయాలు, ఉద్యోగులపై ప్రభావం పడుతున్నాయి. మారుతూ వస్తున్న విధానాలతో నైపుణ్య ఉద్యోగుల జీవిత భాగస్వాముల వర్క్‌పర్మిట్ల అవకాశాలు దెబ్బతింటున్నాయి.

 దీనితో సంస్థలలో కుదురుగా పనిచేసే ఉద్యోగులలో తీవ్రస్థాయి గందరగోళం నెలకొందని సంస్థల నిర్వాహకులు తెలిపారు. ఘాటైన పదజాలంతో అంతకు మించి సంస్థలు ఎదుర్కొంటున్న చిక్కులను ప్రస్తావించుకుంటూ ఈ లేఖ ఉద్వేగభరితంగా సాగింది. ‘ దేశంలోని ఫెడరల్ ప్రభుత్వం అన్ని విధానాలతో పాటు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కూడా సమీక్షించే చట్టబద్ధ అధికారాన్ని పొంది ఉంది. అయితే ఇదే క్రమంలో అనివార్యంగా కొన్ని కీలక సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. చట్టా న్ని పాటిస్తూ ఉండే నిబద్థతతో వ్యవహరించే వేలాది మంది నైపుణ్య ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే రీతిలో నిబంధనలలో మార్పులు తీసుకురావడం అనుచితం. దీని వల్ల ఏర్పడే గందరగోళం తద్వారా కంపెనీలకు ఏర్పడే చిక్కుల గురించి ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంపెనీలు నైపుణ్య ఉద్యోగుల వనరుతో సమర్థవంతమైన పోటీని ఇస్తున్నారు. దీనిని కించిపరిచే రీతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులు చేపట్టరాదు. సాధ్యమైనంత వరకూ ఇటువంటి వాటిని దరికి రానివ్వకూడదు’ అని ఈ లేఖలో స్పష్టం చేశారు.

యుఎస్‌సిఐఎస్‌తోనే అనర్థం

దేశానికి సరైన రీతిలో వలసల విధానాన్ని రూపొందించి, దేశ సమగ్రతను కాపాడాల్సిన పౌరసత్వ, వలసల సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్)విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని లేఖలో విమర్శించారు. నియల్సెన్ ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ఈ సంస్థ తరచూ అస్పష్ట నిర్ణయాలకు దిగుతోందని,దీనితో తరచూ సంస్థలలో ఏళ్ల తరబడి పనిచేసే పలు కేడర్ల ఉద్యోగులపై వేటు పడుతోంది. కంపెనీలను నమ్ముకుని చిత్తశుద్ధితో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఇక ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఈ విభాగం ఇటీవలి కాలంలో వర్క్‌పర్మిట్లను నిరాకరిస్తోంది. ఉన్న వాటిని రద్దు చేసింది. చట్టబద్ధంగా ఉండే వేలాది మంది ఉద్యోగుల విషయంలో ఈ విధంగా జరగడంతో పలు చిక్కులు ఏర్పడుతున్నాయని అమెరికా కంపెనీల ప్రముఖులు తమ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. హెచ్1 బి వీసా పరిధిలో పనిచేసేందుకు అనుమతి పొందిన ఉద్యోగులకు వీసా నిరాకరణ జరగడంతో కంపెనీలు తలపట్టుకోవల్సి వస్తోంది.