Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

రిమ్స్‌లో కార్పోరేట్ వైద్యంకు కృషి

నాణ్యమైన వైద్యం అందిస్తాం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్

rimsమనతెలంగాణ / ఆదిలాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ అసుపత్రిలో పేద రోగులకు కార్పొ రేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తానని రిమ్స్ డైరెక్టర్ డా. అశోక్ అన్నారు. నూతనంగా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇంటర్వూలో రిమ్స్ అభివృద్ధి గురించి చెప్పారు. ఇప్పటికే రిమ్స్ అవరణలో పరిశుభ్ర చర్యలు తీసుకున్నట్లు, రాత్రి 8గంటల తరువాత మెడికో విద్యార్థీనిలకు బయటకు అనుమతిని లేదని, హాస్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని,త్వరలో హాస్టల్‌చుట్టూ ప్రహారి గోడ నిర్మాణం చేడతామని ‘మనతెలంగాణ’తో చెప్పారు.
ప్రశ్న: డెరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు?
డా. ఆశోక్: రిమ్స్‌లో కాలేజ్, హాస్పిట్ వైపు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దశల వారీగా వాటిని పరిష్కరిస్తాం. విద్యార్థులకు మంచి భోజనం కోసం మెస్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా రీడింగ్ రూమ్ అందులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
ప్రశ్న: విద్యా బోధనపై..?
డా.అశోక్: మెడికోలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి నెల ఒకసారి క్లినికల్ సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహలు చేస్తున్నాం. అందులో రిమ్స్‌కు వచ్చే అరుదైన కేసుల వివరాలను విద్యార్థులకు వైద్యులు వివరిస్తారు. సబ్జెక్టుల వారీగా సెమినార్లు నిర్వహించనున్నాం. విద్యార్థుల ప్రతిభ ఏ విధంగా ఉందో దీని ద్వారా తెలుస్తుంది.
ప్రశ్న: ప్రైవేట్‌గా ప్రాక్టిస్ చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుంటారా?
డా. అశోక్: తప్పకుండా తీసుకుంటాం. ప్రస్తుతం రిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. త్వరలో వైద్యుల నియామకాలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి చివరి కల్లా నియామకాలు జరిగే అవకాశాలున్నాయి. దానికి ముందు ప్రతి ఒక్క వైద్యుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిమ్స్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: రోగులను రిఫర్ చేస్తున్నారా?
డా. అశోక్: గతంలో కంటే ఇప్పుడు రిమ్స్ వైద్యులు రోగులను రిఫర్ చేయడం లేదు. ఇది నా మాట కాదు రోగుల బంధువుల మాట. గతంలో ప్రతి చిన్న కేసును రిఫర్ చేసిన వైద్యులు ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. రిఫర్ చేయడానికి వైద్యులు బాధపడుతున్నట్లు తెలిసింది. సేవే లక్షంగా విధులు నిర్వహిస్తున్నారు. సంవత్సరంలోపు నాకు తెలిసి కేసులు రిఫర్ కాలేదు.
ప్రశ్న: రిమ్స్‌లో మందుల కొరత ఉంది.. దాన్ని ఎలా అధిగమిస్తారు..?
డా.అశోక్: రిమ్స్‌లో మందుల కొరత ఉన్న మాట వాస్తమే. దాన్ని అధిగమించేందుకు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించేందుకు ఇండెంట్ పెట్టాం. త్వరలో మందులు అందుబాటులో ఉంటాయి. మానసిక రోగులకు సంబంధించిన మందులు సైతం రిమ్స్‌లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: రిమ్స్ అభివృద్ధిపై మీ కామెంట్..?
డా. అశోక్: వైద్యులు, సిబ్బంది సహకారంతో ఇప్పటికే పేద ప్రజల కు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ఇటీవలే రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పని తీరు బాగుందని మంత్రి రామన్న, కమిటీ చైర్‌పర్సన్ శోభారాణి అభినందించిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. వాటిని అందరి సహకారంతో పూర్తి చేసి కార్పొరేట్ అసుపత్రి రీతిలో అభివృద్ధి చేస్తాం.

Comments

comments