Home మహబూబాబాద్ అవినీతిమయంగా మిషన్ కాకతీయ

అవినీతిమయంగా మిషన్ కాకతీయ

sand2*ప్రజాప్రతినిధులకు తెలియకుండానే ప్రారంభం
*మౌనం వహిస్తున్న అధికారులు

మన తెలంగాణ/గూడూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన కాకతీయుల కాలం నాటి చెరువులను మరమ్మత్తులు చేసి చెరువులను నిండుకుండలా చేసి పల్లె సీమలను పచ్చదనంగా చూడాలని మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో వేలకోట్లు చెరువులకు మంజూరు చేయగా వాటి నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు నీరుగారుస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. మొదటి మూడు విడతల్లో హడావుడి సృష్టించిన అధికారులు, ప్రజాప్రతినిధులు 4వ విడత మిషన్ కాకతీయ పనులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియకుండానే గుట్టుచప్పుడుగా పనులు ప్రారంభించడం గమనార్హం. మండలంలోని 21 గ్రామపంచాయితీల పరిధిలో 120 చెరువులుండగా 85 చెరువులు మంజూరు అయ్యాయి. మొదటి విడత 34, రెండవ విడత 29, మూడవ విడత 13, నాలుగవ విడతలో 9 చెరువులు మంజూరు అయ్యాయి. మొదటి మూడు విడతల్లో పనిచేసిన బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అంతేకాకుండా ఏఈలకు ఐదు శాతం, డిఈలకు రెండు శాతం పర్సెంటీజ్‌లు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. మూడు విడతల్లో జరిగిన పనుల్లో ఏఒక్క చెరువు కూడా నాణ్యతతో పనులు చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలకేంద్రంలోని కోడి చెరువు మిషన్‌కాకతీయ పనుల్లో చెరువు పనులు చేసినా చెరువు నిండా గుర్రపు డెక్కలు పెరిగాయి. కట్టపనులు అస్తవ్యస్థంగా నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో కట్ట పగులు చూపింది. తూములోనికి నీరు రానివిధంగా ఉన్నాయని పనులు తూతూ మంత్రంగా చేసి బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. చెరువులో కాంట్రాక్టు పనులు చేసేటప్పుడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన పర్సంటేజీలకు అధికారులు ఆశపడడం వలన పనుల్లో నాణ్యత లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో విడతలో 9 చెరువులు మంజూరు కాగా మచ్చర్ల గ్రామంలోని ఎర్ర రంగాయ చెరువు పనులు ప్రారంభించారు. చెరువులో పనులు ప్రారంభించిన విషయం స్థానిక ఎంపిపి చెల్పూరు వెంకన్నకు తెలియకుండానే అధికారులు ప్రారంభించారని అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ రైతులకు,  ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని వెంకన్న ఆరోపించారు. ఇప్పటికైనా నాలుగో విడతలో జరిగే పనులు నాణ్యతగా జరిగేలా అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించాలని రైతు లు, గ్రామస్థులు కోరుతున్నారు.