Home ఎడిటోరియల్ జూ. అమిత్ షా అవినీతి!

జూ. అమిత్ షా అవినీతి!

Jay-Shah

నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా వ్యాపార సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించింది. జయ్ సొంతంగా నడుపుతున్న కంపెనీ టర్నోవర్ ఒక్క ఏడాదిలోనే 16వేల రెట్లు పెరిగింది. అది మోడీ ప్రధాని పదవి చేపట్టిన తరువాతి ఏడాది కాలం. కంపెనీల రిజిష్ట్రార్(ఆర్‌ఒసి) రికార్డుల నుండి ఇది వెల్లడైంది. ఆ సంస్థనుంచి కంపెనీ బ్యాలెన్స్ షీట్లను, వార్షిక నివేదికలను తెప్పించి చూడగా 2013 మార్చి నుంచి 2014 మార్చి దాకా ఒక్క ఆర్థిక సంవత్సరంలో జయ్ షా వ్యాపార సంస్థ ‘టెంపుల్ ఎంటర్ ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్’ చెప్పుకోదగ్గ వ్యాపార కార్యకలాపాలు లేవంటూ వరుసగారూ.6,230, రూ.1,724 నష్టాలను చూపించింది. అలాగే 2014-15లో రూ.18,728 లాభం చూపించింది. ముందు ఏడాది రూ.50,000లు మాత్రమే ఆదాయం గల ఆ కంపెనీ టర్నోవర్ 2015-16లో మొత్తం రూ.80.5కోట్లకు పెరిగింది. రాజేష్ ఖండ్వాలా అనే వ్యక్తి ఆర్థిక సహాయ సర్వీసుల సంస్థ (కెఐఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్) నుంచి రూ.15.78కోట్ల ‘అన్‌సెక్యూర్‌డ్’ (హామీలేని)రుణం ఆ సంస్థకు లభించిన కాలంలోనే దాని ఆదాయాలు ఆశ్చర్యకరంగా పెరిగాయి. రాజ్యసభ ఎంపి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నతస్థాయి అధికారి అయిన పరిమళ్ నాధ్వానీ కి ఖండ్వాలా దగ్గర చుట్టం. ఏడాది తర్వాత 2016 అక్టోబర్‌లో జయ్‌షా కంపెనీ హఠాత్తుగా తన వ్యాపారాన్ని మూసివేసింది. డైరెక్టర్ నివేదికలో టెంపుల్ సంస్థ స్థూల విలువ పూర్తిగా తరిగిపోయింది. ఆ ఏడాది వచ్చిన రూ.1.4కోట్ల నష్టానికి అంతకుముందు ఏళ్లలో వచ్చిన నష్టాలు కలిసి ఆ సంస్థ విలువ హరించుకుపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాలను ఆరా తీయదలచి జయ్ షాకు ప్రశ్నాపత్రం పంపిన న్యూస్ పోర్టల్‌కు జవాబులు బదులు హెచ్చరిక వచ్చింది. జయ్ షాను దోషిగా చూపుతూ కథనాలురాస్తే క్రిమినల్, సివిల్ పరువునష్టం దావా వేస్తామనే సారాంశంతో ఆయనతరఫు లాయర్ నుంచి ఆ బెదిరింపు వచ్చింది.

హఠాత్తుగా పెరిగిన ఆస్తులు
జయ్ షా, జితేంద్ర షా డైరెక్టర్లుగా 2004లో టెంపుల్ ఎంటర్ ప్రైజస్ సంస్థ రిజిస్టర్ అయింది. ఆ కంపెనీలో అమిత్ షా భార్య సోనాల్ షా కు కూడా వాటా ఉంది. 2013-14లో ఆ సంస్థకు ఎటువంటి స్థిరాస్థులు లేవు. దానికి నిల్వలు కూడా లేవు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దానికి (రూ.5,795లు) దానికి ఆదాయం పన్ను రిఫండ్ వచ్చింది. ఆ సంవత్సరం అది గడించిన ఆదాయం మొత్తం రూ.50,000లు. అయితే 2015-16లో ఆ సంస్థ ఆదాయం రూ.80.5కోట్లకు పెరిగింది. ఇది 16వేల రెట్లు పెరుగుదల. అంతకుముందు ఏడాది సంస్థ నిక్షేపాలు, మిగులు తిరోగమనంలో ఉన్నాయి. 2015-16లో ట్రేడ్ పేయబుల్స్ రూ.2.5కోట్లు. ఇది అంతకుముందు ఏడాది కేవలం రూ.5,618 మాత్రమే. అలాగే కంపెనీ ఆస్తులు కేవలం రు.2లక్షలు. అంతకు ముందు ఏడాది స్థిరాస్థులు లేవీ ఆ కంపెనీకి లేవు. స్వల్పకాల రుణాలు, అడ్వాన్సులు మొత్తం రూ.4.14 కోట్లు. అంతకుముందు ఏడాది ఆ మొత్తంరూ.10వేలు మాత్రమే. అంతకుముందు ఏడాది శూన్యంగా ఉన్న ఇన్వెంటరీలు రూ.9కోట్లకు ఒక్క ఏడాదిలో పెరిగాయి. ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఈ ఆదాయాలు భారీ ఎత్తున పెరిగినట్లు ఆర్‌ఒసి నుంచి సేకరించిన రికార్డులు చెబుతున్నాయి.

కెఐఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి రూ.15.78 కోట్ల అన్‌సెక్యూర్‌డ్ రుణం కూడా సంస్థ పొందినట్లు రికార్డులు తెలిపాయి. ఆ ఆర్థిక సహాయ సంస్థ ఆదాయం ఆ రుణం ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో రూ.7కోట్లు మాత్రమే. ఆ ఆర్థిక సంస్థ వార్షిక నివేదికలో టెంపుల్ సంస్థకు రూ.15.78కోట్ల రుణం ప్రస్తావన లేదు. జయ్ షా కంపెనీతో సంస్థ కార్యకలాపాలపై ది వైర్ పోర్టల్ వివరణలు కోరుతూ ఇటీవల ప్రశ్నాపత్రం పంపినప్పుడు ప్రమోటర్ రాజేష్ ఖండ్వాలా సానుకూలంగా స్పందించటానికి ముందు అంగీకరించారు. అయితే తరువాత ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. ఖండ్వాలా కుమార్తె పరిమళ్ నాధ్వానీ కుమారునితో వివాహమైంది. అహ్మదాబాద్‌లో ఉండే నాధ్వానీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్ కార్యకలాపాల అధిపతి. రాజ్యసభ ఇండిపెండెంట్ సభ్యుడు ఆయన. 2014లో ఆయన తిరిగి ఎన్నికవడానికి జార్ఖండ్ బిజెపి ఎంఎల్‌ఎల మద్దతు కారణం. ఖండ్వాలా సంస్థ నుంచి టెంపుల్ సంస్థకు అన్‌సెక్యూర్‌డ్ రుణం వచ్చేలా చేయడానికి నాధ్వానీ గాని, రిలయన్స్ గానీ ఎటువంటి సహాయకపాత్ర నిర్వహించలేదని అమిత్ షా సన్నిహితుడొకరు తెలిపారు. అయితే షా కుటుంబానికి ఖండ్వాలా పాతమిత్రుడు అని జయ్‌షా లాయర్ తెలిపారు. ఆర్‌ఒసి రికార్డుల ప్రకారం టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ టోకు వాణిజ్య కార్యకలాపాలు సాగించింది. దాని ఆదాయంలో 95 శాతం వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వస్తోంది.

వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో నష్టాలా?
నువ్వులు, ఆముదం, దేశీ శనగలు, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదిగుమతి వ్యాపారాన్ని ఆ సంస్థ సాగించింది. ఈ విషయం కూడా జయ్‌షా న్యాయవాది తెలిపారు. జితేంద్ర షా కూడా అమిత్ షా కుటుంబానికి పూర్వమిత్రుడు. అతను జే షా భాగస్వామిగా టెంపుల్ సంస్థను చాకచక్యంగా నడపిన వ్యక్తి. సరుకుల వ్యాపారంలో రూ.80కోట్ల వార్షిక లావాదేవీ పెద్ద మొత్తమేమీ కాదని షా న్యాయవాది వాదన. జయ్‌షా కంపెనీలో అసాధారణంగా కనపడేది రూ.50వేల నుంచి రూ.80కోట్లకు ఒకే ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాని ఆదాయం హఠాత్తుగా పెరగడం. గత ఏడాది కార్యకలాపాలను అది మూసివేయడం కూడా ఆశ్చర్యకరమే. దీనిపై షా న్యాయవాది వివరణ ఇస్తూ ‘నష్టాల వలన 2016అక్టోబర్ నుంచి టెంపుల్ సంస్థ వ్యాపార కార్యకలాపాలు మానుకుంది’ అని వివరించారు. కుసుమ్ ఫిన్‌సెర్వ్ అనే సంస్థ జయ్ షా నుంచి 60శాతం వాటా పెట్టుబడితో 2015లో మొదలైంది. అది పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. తరువాత దానిని ఎల్‌ఎల్‌పి(పరిమిత భాగస్వామ్యంలిమిటెడ్ లయబిలిటీ పార్టనర్ షిప్) సంస్థగా మార్చారు. ఆ కంపెనీకి కెఐఎఫ్‌ఎస్ నుంచి 2.6కోట్ల డిపాజిట్లు 2014-15లో వచ్చాయి. ఆ వాటాపై మొత్తం 24కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఆర్‌ఒసి రికార్డుల ప్రకారం ఆ సంస్థ రూ.4.9కోట్ల అన్‌సెక్యూర్‌డ్ (హామీలేని) రుణాన్ని పొందిందికాని ఎక్కడినుంచో తెలియదు. కుసుమ ప్రధాన వ్యాపారం కొనుగోలు, అమ్మకాలని షా లాయర్ తెలిపారు. అయితే సంబంధంలేని మరో వ్యాపారానికి నిధులు మళ్లించారని ఆర్‌ఒసి రికార్డులు తెలుపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రూ.15కోట్ల వ్యయంతో 2.1మెగావాట్ల పవన విద్యుత్ కర్మాగారానికి ఆ నిధుల మళ్లింపు జరిగిందని వెల్లడించాయి. జయ్ షా కాలూపూర్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రూ.25కోట్ల ఆర్థిక సహాయం పొందినట్లు కూడా ఆర్‌ఒసి రికార్డులు తెలుపుతున్నాయి. ఇందుకు తనఖా పెట్టిన ఆస్తులలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు చెందిన రూ.ఐదు కోట్ల ఆస్తి కూడా ఉంది. ఇలా అనేక అవకతవకలతో అమిత్ షా కుమారుడి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఆ వివరాలు ఆరా తీస్తున్న న్యూస్‌పోర్టల్‌పై తాజాగా వందకోట్ల రూపాయల పరువునష్టం దావా రూపంలో ఎదురుదాడి మొదలుపెట్టారు జయ్‌షా.

* రోహిణీ సింగ్