Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అవినీతి… చేపలు..

చేపల విడుదలలో మాయాజాలం
జీరో సైజ్ చేపలను కలిపి విడుదల
చేపల కొను.. గోల్‌మాల్
చేపల విడుదలలో అవినీతికి అవకాశం
అధికారుల మౌనం

Fish

బాన్సువాడ డివిజన్ : ప్రభుత్వం మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్షంతో ఉచితంగా విడుదల చేసిన చేప పిల్లల వ్యవహారంతో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నీలి విప్లవంలో అవినీతి నీడలు కమ్ముకున్నాయి. చెరువులలో చేప పిల్లల విడుదల చాటున అక్రమాలు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున అవినీతి అవకాశం కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుత్తేదారులతో సంఘాల ప్రతినిధులు, అమాత్యులు మిలాఖత్ అయ్యారన్న వదంతులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్బాటంగా సాగిన ఈ చేప పిల్లల విడుదలలో గుట్టుగా జీరో సైజు చేప పిల్లలు చొరబడ్డాయి. వాటి చాటున పెద్దమొత్తంలో కొనుగోల్‌మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులందరూ వదిలిన చేపపిల్లలలో అవినీతి చేపలు కూడా జత కలిసి చెరువుల్లో చేరిపోయాయి. ప్రతి చోట ఈ పరంపర కొనసాగింది. వివిధ సైజుల చేపలతో పాటు జీరో సైజు చేప పిల్లలను కలిపి చెరువుల్లో విడుదల చేశారు. వాస్తవానికి జీరో సైజు చేప పిల్లలను చెరువులో విడుదల చేసే అవకాశం లేకున్నప్పటికీ సగానికి సగం చేపలకు చెరువుల్లో విదుదల చేశారు. ప్రభుత్వం కొనుగోళ్లలో ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అక్రమాలకు అవకాశం కల్పించుకున్నారు. మత్సకార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియకు అండాగా నిలిచారు.

జిల్లాలో చేప పిల్లల విడుదల ఇలా : జిల్లాలో మత్స సంపదకు అనుకూల అవకాశాలున్నాయి. అందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా 549 రిజర్వాయర్లుండగా, నీటి నిలువ విస్త్రీర్ణం 26,889 హెక్టార్లున్నాయి. జిల్లాలో 162 మత్సకార సంఘాలుండగా, 11,371 మంది సభ్యులు ఉన్నారు. చేపలను విడుదల చేసిన జలశయాలు 170 ఉండగా, మరో 529 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసినట్లు అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి. 108.4 లక్షలలో చేప పిల్లలను వదిలి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 529 చెరువుల్లో మూడు కోట్ల 32 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ప్రతి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ఉన్న అన్ని చెరువుల్లో చేప పిల్లల విడుదలకు చర్యలు తీసుకున్నారు. అన్ని చెరువుల్లో ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లలు పెరుగుతున్నాయి.

చేప పిల్లల సైజుల్లో మాయాజాలం : ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లల వ్యవహారంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు గాను గుత్తేదారుల నుండి పిల్లలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.అందులో బాగంగా 70 నుండి 80 ఎంఎం ల సైజులో చేపలను 92 పైసల చొప్పున గుత్తేదారు ధరను ప్రకటించగా, వాటిని అధికారులు రెండు పైసలు తగ్గించి ఒక్కో చేప పిల్లకు 90 పైసల చొప్పున కొనుగోలు చేశారు.తదనంతరం జరిగిన మాయాజాలంలో వాటితో పాటు మరికొన్ని సైజుల చేప పిల్లలను కూడా కొనుగోలు చేయగా, అందులో జీరో సైజు చేప పిల్లలను కలిపి సరఫరా చేశారు. జీరో సైజులకు కూడా రేటు కడుతూ ప్రభుత్వ నిధులను నొక్కేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏడాదికి బయటపడునున్న చేపలు : ప్రస్తుతం ప్రభుత్వ పరంగా జిల్లాలోని అన్ని చెరువుల్లో విడుదల చేసిన చేప పిల్లలను నిధానంగా ఏడాది దాటాక బయటకు తీస్తారు. అప్పుడు అట్టి చేపల బరువు కిలో నుండి కిలోన్నర వరకు ఉంటుంది. మరికొన్ని చేపలు రెండు కిలోల వరకు బరువుతో పెరుగుతాయి. ఇంకొన్ని చేపలు కిలోకు తగ్గి, లేక కిలో పావు బరువుతో తూకం వస్తాయి. విడుదల చేసే సమయంలో వేసిన చేప పిల్లల సైజులను బట్టి చేపల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని చెరువులను కలుపుకోని 3 కోట్ల 32 లక్షల చేపలను విడుదల చేయగా ఏడాది తరువాత అంతే సంఖ్యలో చేపలు బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాని ఇప్పుడున్న శ్రద్ద ప్రభుత్వానికి అప్పుడుండదన్న ధీమాతో గుత్తేదారులు, మరికొందరు కలిసి కొనుగోలు మాల్ చేశారు.

చెరువుల్లో వేసిన చేపలు ఇవే : జిల్లాలోని చెరువుల్లో వివిధ రకాల చేపలను విడుదల చేశారు. చెరువలు నీటిని, ఆ ప్రాంత మట్టిని బట్టి చేపల పెంపకానికి చేపలను కెటాయించుకున్నారు. అందులో బాగంగా అన్ని చెరువులలో ఒకేరకమైన చేప పిల్లలను కాకుండా మూడు రకాల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ క్రమంలో చెరువుల్లో వేసిన రవ్టా, కట్నా, మిర్గ చేప పిల్లలతో పాటుగా అధిక ధరలతో అమ్ముడుపోయే మొట్ట చేపలను కూడా విదుదల చేసుకున్నారు.

పెద్ద చేపలకు ఆహారంగా జీరోసైజు చేప పిల్లలు : చెరువుల్లో వేసిన చేప పిల్లలలో జీరో సైజు చేప పిల్లలు పెద్ద చేపలకు అహారంగా పోతాయి. పెద్ద చేపలు చిన్న జీరో సైజు చేపలను తినేస్తాయి. దీంతో అవి విడుదల చేసిన వెంటనే వాటికి అహారంగా మారడంతో వాటి ఉనికి చెరువుల్లో కనిపించే అవకాశం ఉండదు. ఈ విషయం తెలిసినప్పటికీ వాటిని వివిద సైజుల చేపలతో కలిసి చెరువుల్లో విడుదల చేశారు.

Comments

comments