Home ఎడిటోరియల్ తీరని ధనదాహం..లంచాల ప్రవాహం

తీరని ధనదాహం..లంచాల ప్రవాహం

corruption in india

దేశంలో అవినీతి వ్యవహారాల బాగోతాలను బయటపెట్టి దోషులకు అరదండాలు వేయించే సిబిఐ, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం చర్చనీయాంశం అవుతోంది. సి.బి.ఐలో అగ్రస్థానాల్లోని అధికారులు ఇద్దరూ కేసులను మాఫీ చేయించేందుకు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని పరస్పర ఆరోపణలతో కేసులు నమోదు కావడం విశేషం. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు, మొయిన్ ఖురేషిపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త సతీష్ సనాను వేధించకుండా ఉండడానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసి రూ.3 కోట్లు ముడుపులుగా సి.బి.ఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా తీసుకున్నారని ఆరోపణ వచ్చింది. సిబిఐలోనే లంచాల ప్రహసనం సాగుతోందంటే ఇక మిగతా విభాగాల సంగతి ఏవిధంగా ఉంటుందో ఆలోచించాల్సిందే.

“ఆమ్యామ్యా”అన్నా “తాంబూలం” దక్షిణ ముడుపులు లంచానికి పర్యాయ పదాలుగా ఇప్పుడు చెలామణి అవుతున్నాయి. “ఇందుగలడందు లేదని ” అన్నట్టు లంచం లేనిదే ఏ పని సాగడం లేదు. ఎంత నిఘా వేసినా, అవినీతి నిరోధక శాఖ ఎన్ని దాడులు వేసి దోషులుగా చట్టం ముందు నిలబెట్టినా “లంచ గొండి తనం” అన్నది అంతరించడం లేదు. ఆ “లంచం” ఇవ్వడం పుచ్చుకోవడం విధానాలు మారవచ్చు. లేదా లంచం రూపాలు మారవచ్చు. ఎవరినైనా లంచం పుచ్చుకున్నాడని పట్టుకుంటే తీగలాగితే డొంక కదిలినట్టు ఆ ఒక్కడితో పాటు మరికొందరు ప్రబుద్ధులకు ఆ లంచంలో వాటా ఉన్నట్టు బండారం బయట పడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో అవినీతి పెచ్చు మీరుతోందని 201617లో 64,410 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.

2013లో 35,332 ఫిర్యాదులుతో పోలిస్తే 32 శాతం ఈ కేసులు పెరిగినట్టు స్పష్టమవుతోంది. 2014లో రైల్వేపై 12 వేలకు పైగా ఫిర్యాదులు రాగా, బ్యాంకు అధికారులపై 3468 ఫిర్యాదులు వచ్చాయి. 201617 లో ఆరు నెలల్లో తెలంగాణ లోని ప్రభుత్వ శాఖల్లో వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ విభాగానిదే పైచేయి. మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో 5519లో 33 శాతం ఒక్క రెవెన్యూ పైనే ఉండడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1.87 కోట్లు. వీరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 33.01 లక్షల మంది వరకు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖల్లో ఏటా చేతులు మారుతున్న లంచాల సొమ్ము 5 వేల కోట్లకు పైగా ఉంటుందని అనధికారంగా తేలింది. ఈ లెక్కల ఆధారంగా దేశ మంతా ప్రభుత్వ శాఖల్లో చేతులు మారుతున్న లంచాల సొమ్ము 1,00,000 కోట్లు వరకు ఉంటుందని అంచనాగా తెలుస్తోంది.

రెవెన్యూ విభాగంలో భూముల సర్వే నుంచి పట్టాదారు పాసు పుస్తకాల వరకు అడుగడుగునా లంచాలు ఏరులై ప్రవహిస్తోంది. చిన్న రాష్ట్రాల నుంచి పెద్ద రాష్ట్రాల వరకు ఏటా దాదాపు 500 నుంచి 800 కోట్ల వరకు లంచాలపై లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పోలీస్ శాఖలో ఏటా రూ. 150 కోట్లు నుంచి 200 కోట్ల వరకు ముడుపులు అందుతుంటాయన్న అపవాదు వెంటాడుతోంది. రవాణా శాఖలో మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌నుంచిమామూలు బంట్రోతు వరకు లంచాలు వసూలవుతుంటాయన్న విమర్శ వస్తోంది. ఇన్‌కంటాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో లంచాల వసూలు “ముద్ర’ చెరగలేదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏటా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు డాక్యుమెంటు రిజ్రిస్టేషన్ అవుతుంటాయి.

ఒక్కో డాక్యుమెంటుకు ఎలా లేదన్నా వెయ్యి రూపాయలు ఇచ్చుకోవలసి వస్తుందని, దాంతో ఏటా 200 కోట్ల నుంచి 600 కోట్ల వరకు వసూళ్లవుతుంటాయని ఒక అంచనా. విద్యుత్ శాఖలో కొత్తగా కనెక్షన్ ఇవ్వాలంటే చేతులు తడపాల్సిందే. అలాగే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతుల నుంచి రూ. 10వేలు గుంజిన ఉదంతాలు ఉన్నాయి. ఏటా కనీసం ఒక్కో రాష్ట్రంలో 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు లంచాల రాబడి రావడం పరిపాటి అన్న ఆరోపణలున్నాయి. పౌరసరఫరాల శాఖలో డీలర్లు నుంచి అధికారుల వరకు లంచాల వ్యవహారమే. అంతేకాకుండా సబ్సిడీ బియ్యాన్ని చాటుమాటుగా బయట అమ్మడం జరుగుతోంది. ఈ లెక్కన 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు నల్ల డబ్బు పోగవుతుందని తెలుస్తోంది. మున్సిపాలిటీలు, పంచాయితీలు, కూడా లంచాలకు తీసిపోవు.

హైదరాబాద్ నిజాంపేట శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్ల వ్యవహారం అందరికీ తెలిసిందే.. ఇందులో అధికా రులు, సర్పంచ్‌ల లంచాల వాటా కొన్ని వందల కోట్ల వరకు ఉన్నట్టు బయటపడింది. టౌన్ ప్లానింగ్‌లో అధికారి నుంచి కింది స్ధాయి సిబ్బంది వరకు లక్షల రూపాయలు ముడుపులుగా పుచ్చుకుంటున్న నిర్వాకం చల్లగా సాగుతోంది. ఓ టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిపై ఎసిబి దాడి చేయగా 70 లక్షల వరకు బయటపడింది. ఎక్సెయిజ్ సిబ్బంది నిర్వాకం పరిశీలిస్తే ఒక్కో బార్ నుంచి నెలానెలా ఇంత అని చెప్పి కొన్ని లక్షలు దండుకోవడం బహిరంగ రహస్యం. లిక్కర్ షాపులు వేలం వేసేటప్పుడు ప్రతి షాపుకు కొన్ని వేల వంతున కచ్చితంగా ముట ్టచెప్పాల్సి వస్తోంది.

తెలంగాణలో 800 బార్లు, 1240 వైన్ షాపులు ఉన్నాయి. దీన్ని బట్టి ఏటా ఇంచుమించూ 100 కోట్లు అయినా రావచ్చు. అలాగే ఆంధ్రలో సుమారు 4500 మద్యం దుకాణాలు, 770 బార్లు ఉన్నాయి. వీటి నుంచి నెల వారీగా వసూలయ్యే మాముళ్లే ఏడాదికి 170 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటాయని అంచనాగా తెలుస్తోంది. 10 వేల మందికి శిక్షలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ( సివిసి) గణాంకాల ప్రకారం 2015లో ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది 10 వేల మందికి అవినీతి కేసుల్లో శిక్షలు పడ్డాయి. వీరిలో బ్యాంకర్లే 60 శాతం మంది ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 60 శాతం మంది వీరే. దేశంలో ప్రతి 100 అవినీతి కేసుల్లో సగటున కేవలం 19 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి.

2015లో దేశ వ్యాప్తంగా 5867 కేసులు ప్రభుత్వ ఉద్యోగులపై నమోదు కాగా ఏడాది చివరి నాటికి మొత్తం అవినీతి కేసుల సంఖ్య 13,585కు చేరుకుంది. ఇందులో లంచాలు తీసుకున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. 29,206 కేసులు విచారణలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచగొండితనం అవినీతి అడ్డూ ఆపులేకపోతుండడంతో అభివృద్ధి పథకాలు ముందుకు సాగక లక్షాలు దూరమవుతున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి 15 నుంచి 18 శాతం మేరకే ఫలితాలు లబ్ధిదారులకు అందుతున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, లంచగొండితనం పై కేసులు నమోదవుతున్నా శిక్షలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో నమోదయిన మొత్తం నేరాల్లో ఇటువంటి కేసులు 0.06 శాతం మాత్రమే ఉన్నాయి. గత పదిహేనేళ్లలో పశ్చిమబెంగాల్‌లో ఏఒక్క అవినీతి కేసులోనూ శిక్షలు పడలేదు.

గోవాతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో నమోదయిన కేసులు విచారణ దశలోనే కొట్టివేయడమయింది. ఫిర్యాదుదారులపై, సాక్షాలు చెప్పే వారిపై అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడడం, అనేక రకాలుగా ఒత్తిళ్లు తేవడంతో ఈ కేసులు చివరి వరకు విచారణకు నిలబడడంలేదని ఒక అధ్యయనంలో తేలింది. 201415 మధ్యకాలంలో దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 9.11 కోట్ల కేసులు నేరాలకు సంబంధించి దాఖలు కాగా వీటిలో అవినీతి కేసులు 54,139 మాత్రమేనని కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్ (సిహెచ్‌ఆర్‌ఐ) అధ్యయనంలో బయటపడింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు 1,16,010 ఉండగా కేసుల సంఖ్య మాత్రం 50 శాతం కన్నా మించలేదు.

                                                                                                                                                                – పి.వెంకటేశం

corruption in india

Telangana Letest News