Home జయశంకర్ భూపాలపల్లి అవినీతి మయంగా తాహసిల్దార్ కార్యాలయం

అవినీతి మయంగా తాహసిల్దార్ కార్యాలయం

Tahsildar office

 

ఎకరాకు రూ 15 వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు
పట్టాదార్ పుస్తకాలలో పేర్లు ఎక్కించేందుకు కొందరి విఆర్‌ఒల నిర్వాకం
బ్రోకర్‌లతో చెలామణి చేస్తున్న వైనం
సీనియర్ అసిస్టెంట్‌కు నోటీసులు ఇచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తాహసిల్దార్
విఆర్‌ఒలకు డబ్బులు ఇవ్వవద్దని తాహసిల్దార్ హెచ్చరిక

జయశంకర్ భూపాలపల్లి: మంగపేట మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో అవినీతి ఊడలు వేసుకుని వేళ్ళాడుతుంది. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న కొంత మంది విఆర్‌ఒలు బ్రోకర్‌లను ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయలను దోచుకుని పట్టాదార్ పాస్ పుస్తకాలలో పేర్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరాకు రూ 15 వేలు వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు ఎకరాకు రూ 5 వేలు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారు. అయితే ఉచితంగా వస్తున్న డబ్బులను తీసుకునేందుకు రైతులు తమ పేర్ల మీదకు ఎక్కని భూములను పట్టాలలో ఎక్కించుకునేందుకు తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చి నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో కొంత మంది బ్రోకర్‌లుగా ఏర్పడి రాత్రి వేళ 8 నుంచి 9 గంటల వరకు తాహసిల్దార్ కార్యాలయాల్లో ఉంటూ లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నట్టు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే మరికొన్ని లక్షల రూపాయలు చేతులు మారతాయని ప్రజలు మదన పడుతున్నారు.

పహనీలలో పేర్లు తొలగించి మరి డబ్బులు వసూలు
మండలంలోని కొంత మంది రైతుల పేర్లను పహనీలలో, ఆర్‌ఒఆర్‌లలో పేర్లను తొలగించి మళ్ళీ చేర్చేందుకు విఆర్‌ఒలు డబ్బులను డిమాండ్ చేస్తున్నట్టు రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ 15 ఇవ్వలేని రైతుల పేర్లను ఎక్కించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బులను తీసుకుని పని చేస్తున్న విఆర్‌ఒలు సంబంధిత రైతులకు మాకిచ్చే డబ్బులు సంవత్సరంలోపు ప్రభుత్వం మీకు ఇస్తుందని అందుకే ఎకరాకు రూ 15 వేలు తీసుకుంటున్నామని చెబుతున్నట్టు రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై కొంత మంది ఎసిబి అధికారులను సంప్రదించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మండలంలో జరుగుతున్న అవినీతిపై కొన్ని యువజన సంఘాలు సైతం ఆందోళన చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలిసింది.

సీనియర్ అసిస్టెంట్‌కు నోటీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు
మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన తిరుపతి లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై కొంత మంది రైతులు నేరుగా తాహసిల్దార్ హరిచంద్ దృష్టికి తీసుకు వెళ్ళారు. విషయం తెలుసుకున్న తాహసిల్దార్ సీనియర్ అసిస్టెంట్‌ను మందలించి నోటీసులు జారీ చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తాహసిల్దార్ తెలిపారు. గతంలో పని చేసిన తాహసిల్దార్ నాగరాజు సైతం లక్షల్లో డబ్బులు వసూలు చేసి పంట పొలాలకు పట్టాలను మంజూరి చేసినట్టు తెలిసింది. ఆయన బదిలీపై వెళ్ళిన అనంతరం మండలానికి వచ్చిన హరిచంద్ ఇలాంటి వాటికి పాల్పడక పోయినా విఆర్‌ఒలు అవినీతికి పాల్పడి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.

విఆర్‌ఒలకు లంచాలు ఇవ్వద్దు: తాహసిల్దార్ హరిచంద్
పట్టాలలో పేర్లు ఎక్కించుకునే రైతులు నేరుగా తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని తాహసిల్దార్ హరిచంద్ అన్నారు. మండలంలోని కొంత మంది విఆర్‌ఒలు లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఏదైనా సమస్య ఉన్న, తాహసిల్దార్ కార్యాలయంలో ఎవరైనా లంచాలు అడిగినా తనకు ఫిర్యాదు చేసి కలెక్టర్‌కు సైతం చెప్పాలని రైతులకు సూచించారు.

corruption in mangapet tahsildar office