Home వికారాబాద్ పైసా వసూల్ !

పైసా వసూల్ !

 Corruption in Police Department In Telangana

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజలతో మెరుగైన సంబంధాలు పెట్టుకుంటామని  పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవ విరుద్ధంగా జరుగుతున్నది. బెదిరింపులు, హఫ్తా వసూళ్లు, తప్పుడు కేసుల బనాయింపు, రోడ్‌మాస్టరింగ్, చోరీ కేసుల రికవరీ సొత్తు మాయం చేయడం.. ఇలాంటి అంతులేని వసూళ్ల దందా నిరాటంకంగా సాగుతోంది. ఇటీవల రాజకీయ అండదండతో పోలీసు అధికారులు మరింత పేట్రేగిపోతున్నారు.  రోజూ వారీ కలెక్షన్లు, నెలవారీ మామూళ్లపైనా తరచూ మీటింగులు జరుగుతున్న దాఖలాలు ఉన్నాయని పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి సబ్‌డివిజన్‌లలో 20 ఠాణాలు ఉన్నాయి. దాదాపు ప్రతి సబ్‌డివిజన్‌లో, ప్రతి ఠాణాలో అవినీతి, వసూళ్ల దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలో కేవలం 27 మందిని మాత్రమే చేర్చినా వసూల్‌రాజాల సంఖ్య మూడింతలు ఉంటుందని సమాచారం. కొంతమంది అమాయక సిబ్బందినీ ఇరికించారనే వాదనలూ వినిపిస్తున్నాయి.  నిఘా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించకుండా నివేదిక ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. వారి వ్యవహారాన్నీ శంకించాల్సిన  ఉంటుందని బాహాటంగా విమర్శలు వస్తున్నాయి. ఎవరి అండదండా లేకుండా కానిస్టేబుళ్లు వసూళ్లకు బరితెగించడం కష్టసాధ్యమని అంటున్నారు.

స్టేషన్ హౌజ్ అధికారుల కనుసన్నలలోనే వ్యవహారం సాగుతోందనేది జగమెరిగిన సత్యం. అధికారుల జేబుల్లోకి లక్షల రూపాయలు వెళుతుంటే.. వసూల్‌రాజాలకు వేల రూపాయలు అందుతున్నాయని తెలుస్తున్నది. ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ స్థాయి అధికారులకు డ్రైవర్లుగా వ్యవహరించే హోంగార్డులు కూడా వసూళ్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఓ సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న ఓ హోంగార్డు ఐదేళ్ల క్రితం కట్టుబట్టలు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు అంతస్థుల మేడ నిర్మిస్తున్నాడు. ఇసుక అక్రమార్కుల వద్ద వసూలు చేసే బాధ్యతలు ఆయనకు అప్పగించారని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రతి నెలా 5వ తేదీ లోపు వసూలు చేయడంలో సదరు హోంగార్డు దిట్ట అంటుంటారు. అధికారులకు నెలవారీగా వసూలు చేస్తుంటాడని సమాచారం.  ఐదేళ్లుగా ఇదే విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది.  రూ.కోటి వెచ్చించి సదరు హోంగార్డు నాలుగు అంతస్థలు భవనం నిర్మిస్తున్నాడు.

ఇప్పటి వరకు భవనానికి  రూ.70 లక్షల వరకు ఖర్చయినట్లు పోలీసుశాఖలో చెవులు కొరుక్కుంటున్నారు. అతనికి అండగా నిలిచిన అధికారులు కోట్ల రూపాయలు ఆర్జించి ఉంటారని  సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.  ఫోన్ కాల్‌లిస్టు సేకరిస్తే ఇసుక మాఫియాతో పోలీసులకు ఉన్న సంబంధాలు బయటపడతాయని అంటున్నారు.  జిల్లాలోని ఖనిజ సంపదను దోచుకుంటున్న మాఫియా నుంచి పోలీసులే ఎక్కువగా సంపాధించారని ఉన్నతాధికారులకు నివేదిక అందింది.  వసూల్‌రాజాలకు వెన్నంటి ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేని జవాన్లపై కఠినంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు అవినీతికి మూలస్తంభాలుగా నిలిచిన వారిపై ఎలాంటి చర్య తీసుకుంటారని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న చాలామంది అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేకపోయారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పుష్కలంగా రాజకీయ అండదండలు ఉన్నాయి. పోలీసుస్టేషన్‌ను ప్రవృత్తిగా మార్చుకుని రాజకీయులతో జత కట్టడమే వారి వృత్తిగా మారిందని మేధావివర్గం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సామాన్య పౌరునికి అన్యాయం జరిగితే రోజుల తరబడి పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సత్వర న్యాయం జరుగడం లేదు. గ్రామ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వెలుగు చూడకుండా చేస్తున్నారు. జిల్లాలో కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు బదిలీ చేసి ప్రక్షాళన చేస్తేనే వసూళ్ల దందాను అరికట్టవచ్చని జనం అంటున్నారు. ఏళ్ల తరబడి జిల్లాలో తిష్టవేసి రాజకీయ పలుకుబడితో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగు చూడనున్నాయి.