Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యథేచ్ఛగా అవినీతి

Corruption in Sub-Registrar Offices

ప్రతి దస్తావేజుకు పక్కాగా వసూలు
సర్కారు భూములకు రెక్కలొచ్చేదిక్కడే
లెక్కలేనన్ని డబుల్ రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/నిజామాబాద్ : భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయంటే రిజిస్ట్రేషన్ శాఖ పంట పండినట్లే. భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిందంటే చాలు భూమి విస్తీర్ణం, బహిరంగ మార్కెట్‌లో భూమి విలువను బట్టి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి లెక్కగట్టి వాటా అప్పగించాల్సిందే. ఇక్కడే అధికారులు నేరుగా ఈ వాటాను తీసుకోకపోగా మధ్యవర్తులుగా వ్యవహరించే దస్తావేజులేఖరులే రోజువారిగా కార్యాలయంలో అధికారి హోదా ను బట్టి తాము వసూలు చేసిన మొత్తాన్ని పంపిణీ చేస్తుంటారు. ప్రతిరోజు, ప్రతి దస్తావేజుకు వసూలు జరుగుతుందన్నదీ బహిరంగ రహస్యం. చట్టపరంగా భూమి యాజమాన్య హక్కులను కల్పించే దస్తావేజుల జారీలో ఈ శాఖ కీలకం కాగా అనేక స్థిరాస్థి వివాదాలకు ఈ కార్యాలయాలే వేదికలవుతున్నాయి. నిజానికి ఒక భూమి అమ్మకం, కొనుగోలు జరిగిందంటే భూమి యాజమాన్య హక్కులు ఒకరే కలిగి ఉండాలి. కానీ రిజిస్ట్రేషన్ అధికారుల నిర్వాహకం, లోపభూయిష్టమైన విధానాల కారణంగా పెద్ద ఎత్తున డబుల్ రిజిస్ట్రేషన్‌లు జరుగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల్లో ఉన్న డొల్లతనాన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడ్డావేసి మరీ తప్పుడు రిజిస్ట్రేషన్లకు తెరలేపుతూనే ఉన్నారు. నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖ నుండి భూమి ఆధారిత పత్రాలను తెస్తే చాలు భూమి బదలాయింపు జరిపి కొత్త వారికి భూయాజమాన్య హక్కులను కల్పిస్తుంటారు. ఒకరి నుండి మరొకరికి బదలాయింపు జరుపుతూ లింక్ డాక్యుమెంట్లను సృష్టిస్తూ హక్కులను మరింతగా పటిష్టపరిస్తారు. తప్పుడు విధానం ద్వారా జరిగే ఈ తరహా రిజిస్ట్రేషన్‌లో అధికారులకు భారీగానే ముడుపులు ముడుతుంటాయి. ప్రభుత్వ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం కాగా వాటికి రిజిస్ట్రేషన్ చేసే వీలుండదు. అయితే అక్రమాలకు కాదే అనర్హులు అన్నట్లు అక్రమార్కులు, రిజిస్ట్రేషన్ అధికారులు చేతులు కలుపుతూ వేలాది ఎకరాల్లో సర్కారు భూములు, ఇనామ్‌భూములు చివరికి దేవాదాయ భూములను రిజిస్టర్ చేస్తూ వాటిని ప్రైవేట్ భూములుగా మార్చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ తరహ అక్రమాలపై అనేకసార్లు ఫిర్యాదు అందినా చర్యలు లేకపోగా తాము బాధ్యులం కాదంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. సదాశివనగర్ ప్రాంతంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని గతంలో మండల ప్రజలు నేరుగా అప్పటి ఆర్డిఓకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో దాదాపు 12 గ్రామాలకు చెందిన అసైన్డ్‌భూముల వ్యవహరంలోను రిజిస్ట్రేషన్ శాఖ డొల్లతనం బయటపడింది. గతంలో 2004-05 సంవత్సరంలో ఇల్జీపూర్, అడ్లూర్ నర్సన్నపల్లి, పాతరాజంపేట, క్యాసంపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున చేతులు మారిన ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్లు విచారణ చేపట్టినా ఫలితం లేకపోయింది. అప్పటికే వరుసగా భూమార్పిడి జరిగి లింక్ డాక్యూమెంట్లను సాధించిన కొంతమంది కోర్టును ఆశ్రయించి యాజమానులుగా కొనసాగుతుండగా మరికొంత మంది విచారణను అటకెక్కించేలా చక్రం తిప్పారు. ఎల్లరెడ్డిలోను శిఖం భూముల రిజిస్ట్రేషన్ వివాదస్పదం కాగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల చేతికి మట్టి అంటకపోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలోని శివారు ప్రాంతాలైన సారంగాపూర్, సిర్పూర్, నాగారం, దాస్‌నగర్ తదితర ప్రాంతాల్లోను వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. సిర్పూర్ శివారులో కొందరు రెవెన్యూ అధికారులే బినామి పేర్లతో భూముల రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ విధానాలు, అక్రమాలు, సామాన్య ప్రజలకు ఎదురవుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా మొత్తం రిజిస్ట్రేషన్ శాఖనే ఎత్తివేసే నిర్ణయం తీసుకోగా నిర్ణయాన్ని దశలవారీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. భూమి రికార్డులు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా మరొకశాఖ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అక్రమాలు జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి గుర్తించారు. దీనికి తోడు సబ్ డివిజన్ కేంద్రాల్లో వందలాది గ్రామాలకు ఒక కార్యాలయం ఉండటం ప్రజలకు అసౌకర్యంగా సిఎం గుర్తించారు. ఓ వైపు ప్రజలకు మేలు చేస్తూనే మరోపక్క భూ అక్రమాలకు తావులేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. మండలాల సంఖ్యను పెంచుతూ ఏ మండల పరిధిలో ఆ మండల భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో తహశీల్ధార్లు రిజిస్ట్రేషన్ అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించగా నకిలీ రిజిస్ట్రేషన్లకు తావు లేకుండా పోయింది. ప్రభుత్వ భూమిని తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసే వీలుండకపోగా పూర్తిగా భూరికార్డులను పరిశీలించాకే కొత్తవారికి భూమి బదలాయింపు సాధ్యం అవుతోంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ దారుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. గతంలో భూమిరిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అమ్మకందారుడు, సహయకులు, సాక్షులు ఇలా జనాన్ని పొగుచేసుకుని, ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సివచ్చేది. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు వెళ్లాల్సిరాగా దారి ఖర్చులు, విందుల పేరిట అయ్యే ఖర్చు తడిపి మోపడయ్యేది. సిఎం కెసిఆర్ నిర్ణయంతో ఇంటి వద్దే భోజనం చేసి అక్కడే కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కలిగినట్లైంది. ఈ మేరకు మొదటి విడతగా కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండలం నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దార్‌లకు అప్పగించారు. మే నెల 19 నుండి తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌లపై ఆయా మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భూప్రక్షాళనలో మంచి మార్పు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన భూప్రక్షాళనతో రెవెన్యూ శాఖకు ఉపశమనం కలుగుతుందని, రికార్డుల్లో పేరుకుపోయిన తప్పులు సరిదిద్దుబడుతున్నాయని సదాశివనగర్ తహసీల్దార్ అమీన్‌సింగ్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తమ మండలంలో మే 19 నుండి తాను భూముల రిజిస్ట్రేషన్లు చేస్తుండగా ఇప్పటి వరకు 240 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ పరిణామంతో మా పాత్ర రైతులకు పూర్తిగా సౌకర్యంగా మారగా ఎలాంటి జాప్యం లేకుండా అలావచ్చి ఇలా రిజిస్ట్రేషన్ పని ముగించుకుని పోతున్నట్లు వివరించారు. తహసీల్దారునైనాన తాను రిజిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో తన వద్దకు వచ్చే పత్రాలను భూరికార్డుల పరంగా క్షుణ్ణంగా తనిఖీ చేశాకే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్‌కు తావులేకపోగా ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Comments

comments