Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఉపాధి హామీకి అవినీతి మరకలు

Corruption Strikes for Employment Guarantee

ప్రజా వేదికల సాక్షిగా వెలుగులోకి అక్రమాలు
నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న పనులు
ఇప్పటికే జిల్లాలో పది మంది సిబ్బందిపై వేటు
మరో 302 మందికి నోటీసులు జారీ
నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు
ఉపాధి పనుల పేరిట లక్షలాది రూపాయల దుర్వినియోగం

మన తెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: గ్రామీణప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తూ మౌళిక వసతులను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించగా నిబంధనలకు విరుద్దంగా పనులు చేపట్టడంతో అంతులేని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పథకం అబాసు పాలు అవుతుండగా అధికారుల చేతి వాటం కారణంగా లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక తనిఖీల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా వెలుగు చూసినప్పటికీ సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకుండానే రికార్డులో పనులు జరిగినట్లుగా నమోదు చేసి, బిల్లులు స్వాహా చేయడం లాంటి సంఘటనలు ఉండగా ఇప్పటికే బహిగర్గతమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో ఇప్పటి వరకు 11 మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 18,81,628 లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రూ. 4,87,500 జరిమానా విధించగా 302 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. లక్షలాది రూపాయలు తప్పుడు రికార్డులతో స్వహా చేశారనే ఆరోపణలపై మరో పదిమంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. దండేపల్లి మండలంలోని నర్సాపూర్, గుడిరేవు, కోటపల్లి మండలంలోని కొత్తూరు గ్రామాల క్షేత్ర సయకులను సప్పెండ్ చేశారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంతో జాబు కార్డులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. లక్షెట్టిపేట,తిమ్మాపూర్, గ్రామాలకు చెందిన క్షేత్రసహయకులను సస్పెండ్ చేశారు. మట్టి పనులు , వ్యవసాయ బావులు, కాల్వల్లో పూడిక తీత పనుల కొలతల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు కల్పించకుండా డబ్బులు డ్రా చేసుకొని సొంత అవసరాలకు వాడుకున్నట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడయ్యాయి. లక్షెట్టిపేట మండలం ఊత్కూర్ పంచాయతీ పరిధిలో కూలీలకు ప్లే స్లిప్‌లు ఇవ్వాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘించి బ్రాంచ్ పో స్టుమాస్టర్‌తో కుమ్మక్కై కూలీల ఇంటింటి వెళ్లి బయో మెట్రిక్ ద్వారా వేలి ముద్రలు వేయించినట్లు వెల్లడైంది. అదే విధంగా పనులు చేయని వారి పేరిట ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ చేసి, అందులోకొంత  కూలీలకు అందించి, లక్షలాది రూపాయలను క్షేత్రసహయకులు  స్వహా చేసినట్లుగా సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. సామాజిక తనిఖీల్లో భాగంగా  జిల్లా వ్యాప్తంగా 3426 ఆర్థిక అభ్యంతరాలు  లేవనెత్తగా వాటి విలువ రూ. 4,28,90,599 కోట్లు ఉండగా అందులో రూ. 68,78.394 లక్షల విలువైన 1405 అభ్యంతరాలు పరిష్కారం కాగా మరో  2021 అభ్యంతరాలు సంబంధించి రూ. 3,60,12,205 కోట్ల విలువైన పనులకు సంబంధించి పరిష్కారం కావాల్సి ఉండగా అధికారులు మాత్రం  సిబ్బందిపై నామమాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు స్పందించి  సామాజిక తనిఖీల్లో  బహిర్గతమైన అక్రమాలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments