Home రాష్ట్ర వార్తలు సాటి, పోటీ లేదు

సాటి, పోటీ లేదు

KCR

కొత్తదైనా ఉత్తమ రాష్ట్రం తెలంగాణ 

సంక్షేమంలో మనకెవ్వరూ సాటిరారు

కేంద్రానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న ఏడు రాష్ట్రాల్లో మనది ఒకటి
మనం ఢిల్లీకి రూ.50 వేల కోట్లు చెల్లిస్తే అది మనకు ఇస్తున్నది రూ.24 వేల కోట్లే

సిబ్బందికి మంచి జీతాలిస్తున్నాం హోంగార్డుల వేతనం రూ.3 నుంచి 25 వేలు చేశాం

అంగన్‌వాడీ, ఆశాలకూ బాగా పెంచాం ఈ ఏడాదిలోపే 3 లక్షల ఇళ్లు నిర్మిస్తాం : ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో సిఎం కెసిఆర్

అవినీతిని అరికట్టాం

గతంలో కాంట్రాక్ట్‌లు చేపడితే అవినీతి, ముందస్తు చెల్లింపులు (అడ్వాన్స్ పేమెంట్) జరిగేవి. ఇప్పుడు పూర్తి పారదర్శకతతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్ట్ పనులు చేపడితే పదేళ్లు నిర్వహణ బాధ్యత వారిదేనని, నాణ్యత విషయంలో రాజీ పడేదిలేదు.  అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైంది. 

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశానికి అధిక ఆదాయాన్ని అం దించే ఏడు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని, కొత్తగా పుట్టిన రాష్ట్రమే అయినా ఎన్నో రంగాల్లో ముందుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లను చెల్లిస్తే, తిరిగి రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ. 24 వేల కోట్లే అందజేస్తుందని స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ, సంక్షేమ పథకాల అమలులో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు పోటీ, సాటి లేదన్నారు. ఉదయ్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.9వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపిందని, అందుకే బడ్జెట్‌లో తేడా వచ్చిందని, అప్పులు చేస్తున్నారని చెబుతున్న ప్రతిపక్షాలు ఆ అప్పులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని చూడడానికి నిరాకరిస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఉద్యోగులకు మెరుగైన వేతనాలిస్తున్నామని, గత పాలకుల వెట్టి చాకిరి నుంచి మెరుగైన వేతనాలను పెంచామన్నారు. హోంగార్డులకు రూ.3 వేల వేతనాల నుంచి 20 వేల వరకు తీసుకొచ్చామని, అంగన్‌వాడీ, ‘ఆశా’ కార్మికులకు మెరుగైన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సెకండ్ ఎన్‌ఎన్‌ఎం జీతాలను పెంచబోతున్నామని చెప్పా రు. అవినీతి లేని, ఆకుపచ్చ, అభ్యుదయ, 24 గంటల పాటు వెలుగులు విరజిమ్మేలా తెలంగాణ కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. బిజెపి పాలిత 19 రాష్ట్రాలలో కనీసం వేతనాలు 19 శాతమైనా మెరుగ్గా ఉన్నాయా అని ప్రశ్నించారు. పిఆర్‌సి బకాయిలను చెల్లిస్తే ఉద్యోగులు ఖర్చు చేస్తారని, వాటిని పెన్షన్‌లో కలిపితే బాగుంటుదని తాము ఉద్యోగ సంఘలకు సూచిస్తే అందుకు వారు తొలుత అంగీకరించారని, ఆ తర్వాత తిరిగి తమకు ఇవ్వాలని కోరారని, దీంతో వారికి విడతల వారీగా బకాయిలను చెల్లిస్తామని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్ర  వ్యాప్తంగా 2,38,068 ఉద్యోగులకు వేతనాల ద్వారా ప్రభుత్వానికి రూ. 1100 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
పిసిఎస్ విధానం కేంద్ర పరిధిలోనే…సిపిఎస్ విధానం కేంద్ర పరిధిలోనే ఉన్నదని, దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని, ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో స్పష్టం చేశారని సిఎం కెసిఆర్ గుర్తుచేశారు. ఉద్యోగుల పట్ల తాము సానుకూలంగా ఉన్నామన్నారు. సిపిఎస్‌లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఏం చేయాలో రాష్ట్రం ఏం చేయాలి అనే అంశంపై లోతుగా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో మీరు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 52 శాతం రైతు ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రకటన చేస్తే, రాష్ట్రంలో 3500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ గాలివార్తలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
కరీంనగర్‌ను తప్పకుండా లండన్‌గా మారుస్తాం : ఉమ్మడి రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి బిసి,మైనార్టీలు అసైన్డ్ భూముల పంపిణీ అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. భూ పంపిణీకి టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం రూ. 92 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం నాలుగేండ్ల పాలనలో రూ. 556 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అన్ని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని తాము అనలేదని, అర్హులైన కుటుంబాలకు, ఎంతమందికి వీలైతే అంతమందికి పంపిణీ చేస్తామని చెప్పామని వివరించారు. కరీంనగర్‌ను లండన్ చేస్తామని, వరంగల్‌ను సింగపూర్ చేస్తామని, తాము చెప్పలేదని, కిషన్ రెడ్డి తాము చెప్పినట్లు కలలు కన్నట్లుగా ఉన్నారని అన్నారు. లోయర్ మానేరు చెక్‌డ్యాం పూర్తి చేస్తే, రూ.500 కోట్ల టూరిజం ప్యాకేజ్ అమలు చేస్తే కరీంనగర్ తప్పకుండా లండన్ లాగా మారుతుందని, రివర్ ఫ్రంట్ ‘ఏథెన్స్’ను తలపిస్తుందన్నారు. నగరాలు మంచిగా ఉండాలని కోరుకోవడం కూడా తప్పా…? ఎప్పుడూ దరిద్రంగానే ఆలోచించుకోవాలా అని ప్రశ్నించారు. ఈ ఏడాదిలోపే మూడు లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు. గృహ నిర్మాణాల్లో కుంభకోణాలకు పాల్పడి, కేవలం ఓట్ల కోసమే ఇండ్లను నిర్మించడం లేదని, పదికాలల పాటు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే పనులు చేపడుతున్నామని వివరించారు.
అవినీతిని అరికట్టాం.. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టామని సిఎం తెలిపారు. గతంలో కాంట్రాక్ట్‌లు చేపడితే అవినీతి, ముందస్తు చెల్లింపులు (అడ్వాన్స్ పేమెంట్) జరిగేవని గురు ్తచేశారు. పూర్తి పారదర్శకతతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాంట్రాక్ట్ పనులు చేపడితే పదేళ్లు నిర్వహణ బాధ్యత వారిదేనని, నాణ్యత విషయంలో రాజీ పడేదిలేదని, అందుకే ఇలాంటి రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. వివిధ ప్రాజెక్టుల నిమిత్తం నాలుగున్నర లక్షల ఎకరాల స్థలం అవసరం కాగా ఇప్పటికే సుమారు మూడున్నర లక్షల ఎకరాల స్థలాన్ని సేకరించామని ఆయన వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించండి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శాసనసభలోని సభ్యులందరూ సందర్శించాలని సిఎం సూచించారు. ప్రాజెక్ట్ పనులు మూడు షిప్ట్‌లలో జరుగుతున్నాయన్నారు. కోటి ఎకరా లకు సాగునీరు అందించే కల సాకారం కాబోతుందన్నారు. ఇప్పటికే 17వేల చెరువులు పూర్తయ్యాయన్నారు. జాతీయ రహదారులలో 4.9 శాతం వృద్ది పెరిగిందన్నారు. రహదారులకు సహకరించిన కేంద్ర మంత్రి నితీష్‌గడ్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎల్‌ఎ క్వార్టర్స్ వద్ద ఎంఎల్‌ఎలు అధికారికంగా జెండావిష్కరణ చేస్తారని,ఇందుకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా అధికారికంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా, ఎస్‌సి కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఒంటరి మహిళా పెన్షన్లు, టిఎఫ్‌టి పెన్షన్లు, సన్నబియ్యం, గురుకులాలు, మెస్‌చార్జీలు పెంపు, కళ్యాణ లక్ష్మి, రూ. 12వేల నుంచి రూ. 40వేల జీతలను పెంచామని, చివరకు కెసిఆర్ కిట్ పథకాన్ని మధ్యప్రదేశ్ సిఎం చౌహన్ కాపీ కొట్టారని వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళన 96 శాతం జరిగిందన్నారు.
ప్రతి ఏటా వైద్యపరీక్షలు : ప్రతి ఏటా ‘హెల్త్‌ప్రొఫైల్’ నిర్వహించి, ప్రజలకు హెల్త్‌కార్డులు అందజేస్తామని కెసిఆర్ తెలిపారు. కెనడా, ఇంగ్లాండ్‌లో జరిగే ఉచిత వైద్యపరీక్షల విధానాన్ని పరిశీలించేందుకు అధికార బృందం అక్కడకి పోయి అధ్యయనం చేస్తారన్నారు. పేదలందరికీ ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 80 లక్షల మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేసి, క్యాట్‌లాగ్ ఉచితంగా పరీక్షలు చేయిస్తామన్నారు.
రాష్ట్ర గౌరవానికి భంగం రానివ్వం : తమ ప్రాణాలు పోయినా కొత్త రాష్ట్రంలో రాష్ట్ర గౌరవానికి భంగం కలుగనివ్వబోమని కెసిఆర్ స్పష్టం చేశారు. అరాచకంగా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల వద్ద సబ్జెక్ట్ లేదని, వారి వద్ద సరుకు లేదని, అందువల్లనే ఎలాగైనా సభ నుంచి బయటకు పోవాలనే ఉద్దేశంతో గవర్నర్ ప్రసంగంలోనే గొడవ చేయాలని వారు ముందే వేసుకున్న పథకంపై తమకు సమాచారం ఉన్నదని తెలిపారు. తాము ఛైర్మన్‌ను కాదని, గవర్నర్‌కు కొడుతామని అనుకున్నామని కాంగ్రెస్ సభ్యులే అన్నారని, సభలో చర్చించేందుకు వారు సిద్ధంగా లేరని, ఇది బాధకరమని చెప్పారు.
సిపిఎం పాలనలో బెంగాల్ ద్వంసం : 35 సంవత్సరాల సిపిఎం పాలనలో పశ్చిమబెంగాల్ ద్వంసమైందని, అలాంటది మమత బెనర్జీ రాగానే ప్రాణం పోసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఏడేండ్లముందు తాను బెంగాల్‌కు పోతే అక్కడి పరిస్థితులు బాగాలేవని, ఇటీవల తాను అక్కడికి పోతే మంచి కళ వచ్చిందని కొనియాడారు. ఇప్పుడు బెంగాల్ సూడబుద్ది అవుతుందన్నారు.
ఓటర్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఓటర్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని, పార్టీలు చేసేదే ఆ పని అని, ఓట్లు ఆకర్షించకపోతే ఇక రాజకీయ పార్టీ ఎందుకని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం చూసి, వారి అభివృద్దికి కృషి చేసి ఎవరు ఎక్కువ శాతం ఆకర్షిస్తారో వారే గెలుస్తారని చెప్పారు. ఓటర్లను ఆకర్షించకుంటే వికర్షిస్తారా..? మీరు ఆకర్షించారా… ఇలా చేయకపోతే ప్రజాస్వామ్యంలో అర్థమే లేదన్నారు. ఐదేళ్ల ఆర్థిక ప్రణాళిక , టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వ విధానం మంచిచెడులను చూసి ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ అంటేనే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయ గేమ్ అని, టిఆర్‌ఎస్‌కు మాత్రం ఇది టాస్క్ లాంటిదని, తమ పనితీరుకు ఉప ఎన్నికలే ఇందుకు గీటురాయి అని చెప్పారు. అనేక విషయాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. దేశ తలసరి ఆదాయం రూ. 1,12,704 ఉంటే, తెలంగాణలో రూ. 1,475,536 ఉన్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దుర్మార్గపాలన ఉండేదన్నారు. 201314లో దేశ జిడిపి 13 శాతం ఉంటే, తెలంగాణలో జిఎస్‌డిపి 12.4శాతం నమోదుకాగా 201718లో దేశం జిడిపి 9.8 శాతం ఉండగా, తెలంగాణ జిడిఎస్‌పి 14.17 శాతం పెరిగిందన్నారు. పారిశ్రామిక రంగంలో 2013-14లో 0.8 శాతం ఉంటే, 201718లో 5.6 శాతం, వ్యవసాయం రంగంలో 201314లో 4 శాతం ఉండగా, 201718లో 7శాతం నమోదు అయిందన్నారు. ప్రధాని మోడి కూడా దేశ బడ్జెట్‌లో మూడవ వంతు అప్పులు కడుతున్నారన్నారు. రూ.8,50,000 కోట్ల అప్పులు కడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల బాండ్స్‌కు పోయిందని, ఇలాటి ధైర్యం దేశంలో ఎవరూ చేయలేదన్నారు. అప్పులు చేసి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అదనంగా 6 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్స్ : రాష్ట్రంలో వరంగల్, పెద్దపలిల్లోని బసంత్‌నగర్‌లో, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల, కొత్తగూడెంలో ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సిఎం వెల్లడించారు. ఎయర్ సర్వీస్ క్వాలిటీలో శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, ప్రతి రోజూ 506 విమానాల రాకపోకలు సాగుతున్నాయని వివరించారు. విమానాల రాకపోకలలో 99 శాతం వృద్ధి సాధించామన్నారు. ఎయిర్‌ట్రాఫిక్‌లో లో 2014లో 8.7 మిలియన్ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 18 మిలియన్లకు చేరిందన్నారు. హైదరాబాద్ బాగలేకపోతే వీరంతా ఎందుకు ఇక్కడికి వస్తాయరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి వద్ద 12 ఫ్లాట్‌ఫాములతో రైల్వే టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రైతులకు పరిహారం చెల్లించాలంటే బడ్జెట్ సరిపోదు : ప్రభుత్వాలు రైతులకు సహాయ కార్యక్రమాలు మాత్రమే చేపడుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు పరిహారం చెల్లించాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, లక్ష ఎకరాలు పంట నష్టపోతే ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా అని ప్రశ్నించారు. రైతుల పంట నష్టపోతే పూర్తి పరిహారం ఇచ్చిన దాఖాలులు లేవని గుర్తుచేశారు. పంటలు నష్టపోతే పూర్తి పరిహారం ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదన్నారు. దేశంలో క్రమం తప్పకుండా చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే కొన్ని రాష్ట్రాలలో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, పంజాబ్ రాష్ట్రం సమయానికి జీతాలు ఇవ్వలేకపోతుందన్నారు. పన్నులు సమయానికి రావడం లేదని, ఎప్పుడొస్తే అప్పుడే ఇస్తామని కేంద్రం చెప్పడం మోడి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. గతంలో ఇలాంటి విధానం లేదన్నారు. పార్మసిటీ ద్వారా వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, తదీనిన అడ్డుకుంటే ఓట్లు రావని సూచించారు.
వారు ఆహా ఓహో వీరేమో వ్యతిరేకంటారు… బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, అధికార పార్టీ వారు ఆహా ఓహో బడ్జెట్& జనరంజకం అని అంటే, ప్రతిపక్షంలో ఉన్నవారు రైతు వ్యతిరేక బడ్జెట్ అని, కొత్త సీసాలో పాత సారా అనే వ్యాఖ్యలు చేయడమే అలవాటుగామారిందని, ఒక్క కార్యక్రమాన్ని కూడా బాగున్నదని కొనియాడిన దాఖలాలు లేవని, ఒక వేళ అలా చేస్తే ఆ పార్టీలు ఊరుకోవన్నారు. వాస్తవాల పునాదులపై నిర్మాణాత్మక ధోరణిగా లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని, ఇలాంటి రాజకీయాలు మారాలన్నారు. డిస్కంలు అప్పులో ఉన్నాయని అనడంలో వాస్తవాలు లేవని, రూ. 11,900 అప్పలు మాత్రమే ఉన్నాయని, ఇది ప్రతి ఏటా రోజువారీగా జరిగే కార్యక్రమాల్లో భాగమని చెప్పారు. యుపిఎ ప్రభుత్వం కంటే ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రానికి అధికంగా నిధులు ఇచ్చారని బిజెపి సభ్యులు మాట్లాడుతున్నారని, మీరిచ్చేది(కేంద్ర ప్రభుత్వం) ఏమీ లేదని, ఇక్కడ బిచ్చగాళ్లు ఏవరూ లేరని, ఇది రాష్ట్రాల హక్క అని చెప్పారు. పన్నులలో రాష్ట్రాలకు వాటా ఉంటుందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం చూపించే మహేర్‌బానీ ఏమీ లేదన్నారు. తాను తమాషాకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని, బలమైన పునాది కోసమే పోతున్నానని సిఎం తెలిపారు. నిధుల కూర్పు, ఖర్చులు ఇలా అనేక అంశాలు ఉంటాయన్నారు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ, వ్వవసాయ శాఖ కేంద్ర పరిధిలో అవసరం లేదని, రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నారు.
మాది ‘ప్రజా ఫ్రంట్ : దేశ వ్యాప్తంగా 70 ఏళ్ళ పాలనలో ఆ రెండు పార్టీల (బిజెపి, కాంగ్రెస్) పట్ల ప్రజలు, మిగతా రాష్ట్రాల సిఎంలు, ఆర్థిక మంత్రుల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. రాష్ట్రాల వృద్ధిని కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. వ్యవసాయం, పట్టణ, గ్రామీణ శాఖలు కేంద్రం వద్ద ఎందుకని, ఎఎన్‌ఎంల పనితో కేంద్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రాలను బికారీలుగా చేస్తున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, దీనికి తాము మద్దతుగా ఉంటామన్నారు.
దేశం ముందుకు పోవాలంటే గుణాత్మకమైన మార్పు రావాలని, అందులో తాము కీలకపాత్ర పోషిస్తానని వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పాత్ర అవసరమని, ఏదో మూడు, నాలుగు పార్టీల కలయికతో ఫెడరల్ ఫ్రంట్ కాదని, దేశ వ్యాప్తంగా ప్రజలందరినీ ఏకీకృతం చేసేందుకే ప్రజల ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో 70వేల టిఎంసి నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని, మొత్తంగా 40 కోట్ల ఎకరాలకు 30 వేల టిఎంసి నీరు సరిపోతుందన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటే ఇప్పటికీ పరిష్కారం లేదని, దూరదృష్టితో ఆలోచించి విధాన నిర్ణయాలు తీసుకునే వీలు లేకపోయిందని ఆ రెండు పార్టీలపై ధ్వజమెత్తారు.