Home రంగారెడ్డి అవినీతి జలగలు

అవినీతి జలగలు

Corruptions In Exchange Department In telangana

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కల్లు గీత కార్మికుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఎక్పైజ్ శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అవినీతి జలగలు కల్లు గీత కార్మికుల రక్తంను పీల్చుకు తాగుతున్నాయి. ప్రతి పనికో రేటు పెట్టుకుని అడ్డగోలు వసూళ్లతో సామాన్యుడు ఎక్పైజ్ కార్యాలయం వైపు రావాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకువచ్చారు. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈత, తాటి చెట్లను పెంచడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఎన్నో రాయితీలను అందచేస్తూ ముందుకు సాగుతున్న ఎక్పైజ్ శాఖ అధికారులు మాత్రం కాసుల సంపాదన తప్ప జనం గోస పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న రంగారెడి, మేడ్చల్ జిల్లా శివార్లలో కల్లుకు విపరీతమైన డిమాండ్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఎక్పైజ్ శాఖ సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్‌లుగా, మేడ్చల్ జిల్లాలో మల్కాజ్‌గిరి, మేడ్చల్ డివిజన్‌లుగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంగా వికారాబాద్ ఎక్పైజ్ విభాగం విధులు నిర్వహిస్తుంది. ఎక్పైజ్ విభాగంలో ఏళ్ల తరబడి పాతుకు పోయిన కొంత మంది అవినీతి జలగలను రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన ప్రక్షాళనలో బదిలీలు చేసినా ప్రస్తుతం పరిస్థితి తిరిగి యధాస్థితికి చేరుకుంది. కల్లు ను విక్రయించి జీవనం సాగించేవారిని లక్షంగా చేసుకుని అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది రెచ్చిపోతున్నారు. కల్లు గీత కార్మికులకు కొత్త లైసెన్స్‌లు జారీచేయాలన్నా, ఉన్న లైసెన్స్‌లను రెన్యూవల్ చేయాలన్నా ఎక్పైజ్ అధికారుల పాత్ర కీలకం కావడంతో దానిని ఆసరాగా చేసుకుని చాలా మంది అధికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు తెరతీస్తున్నారు. కొన్ని స్టేషన్‌లలో క్రింది స్థాయి సిబ్బందిని నియమించుకుని వసూళ్ల దందా చేస్తుండగా మరికొన్ని స్టేషన్‌లలో సిఐలు నేరుగా వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. కొత్తగా లైసెన్స్‌ల జారీ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వసూళ్ల దందా సాగుతుందని, కనీసం చెట్టు ఎక్కడానికి రాని వారిని సైతం కాసులు తీసుకుని లైసెన్స్‌లు జారీచేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

పోటో స్టూడియోలలో చెట్టు ఎక్కినట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను తీసుకువచ్చి లైసెన్స్‌లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగిన పనులు కావడం లేదని కాసులిస్తే మాత్రం ఫైలు ముందుకు కదులుతుందని పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు పిర్యాదులు వస్తున్నాయి. కాసుల కోసం అధికారుల వేదింపులను బరించలేక ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని చాలా మంది ఎసిబి అధికారులను ఆశ్రయించారు. తాజాగా మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లికి చెందిన రాఘవేందర్ గౌడ్ టిఎఫ్‌టి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎక్పైజ్ సిఐ లక్ష రూపాయలు లంచం అడగడంతో ఎసిబిని ఆశ్రయించడం, అధికారులు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఒక్క మహేశ్వరం మండలంలోనే ఇలాంటి సంఘటన జరుగుతుందనుకుంటే పొరపాటుగానే భావించాలి. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో ప్రతి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి బాగోతాలు నిత్యకృతంగానే మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పైసలు లేకుండా లైసెన్స్ వచ్చే పరిస్థీతి లేదన్నది బహిరంగ రహస్యంగానే మారిందని ప్రచారం జరుగుతుంది.
వసూళ్లే లక్షం…
ఎక్పైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వసూళ్ల శాఖగా మారిందన్న అపప్రదను ముట్టకట్టుకుంది. మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి నేల మామూళ్లు వసూళ్లు చేయడానికి ప్రతి స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పరచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసు శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసూల్ రాజాల జాబితా కేవలం 391 మాత్రమే ఉన్న ఎక్పైజ్ శాఖలో మాత్రం అంతకన్న అధికంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. గ్రామాల్లో గల్లీ గల్లీలో వెలిసిన బెల్ట్‌షాపుల నుంచి వసూళ్లు చేసుకోని తీసుకురావడానికి కొన్ని స్టేషన్‌లలో ప్రైవేట్ వ్యక్తులను సైతం నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వచ్చమైన కల్లు లేక కల్తీ కల్లును పెద్ద ఎత్తున విక్రయిస్తున్న ఆలయాల ముందు అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు వెలుస్తున్న కనీసం వారికి కనిపించడం లేదంటే పనితీరు అర్ధం చేసుకోవచ్చు. కల్లు మాఫియా వికారాబాద్ జిల్లాలో చేస్తున్న దందాను ఒక్కసారి చూస్తే చేదు నిజాలు చాలా బయటకు వస్తాయి. కల్తీకల్లును పెద్ద ఎత్తున ఒకే దగ్గర తయారు చేసి లారీలు, ఆటోలలో గ్రామాలకు తరలించి విక్రయిస్తున్న పట్టించుకునే వారు లేరు. డైజోఫామ్ వంటి మత్తు పదార్దాలను కలిపి కల్తీకల్లు తయారు చేస్తున్న తమకు కావలసిన నజరానాలు ఇస్తే చాలు అటువైపు కన్నెతికూడ చూడని ఎక్పైజ్ అధికారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని ఎక్పైజ్ శాఖలో పాతుకుపోయిన అవినీతి జలగలను ఎరిపారేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న కల్తీకల్లును అరికట్టవలసిన అవసరం చాలా వరకు ఉంది.