Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నిరీశ్వరవాద ప్రముఖులు

Cosmos is a 1980 popular science book
తొమ్మిదో శతాబ్దంలో జైన తత్తవేత్త జినసేన ‘మహా పురాణం’ రాశాడు. అందులో ఇలా ఉంది “భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని కొందరు పిచ్చివాళ్లు ప్రకటించారు. ఒకవేళ భగవంతుడే ఈ సృష్టికి కారణభూతుడవుతే, మరి సృష్టికి పూర్వం ఆయన ఎక్కడ ఉన్నాడూ? ఆయనకు ఏ ఆధారమూ అక్కర లేదు డోలాయమాన స్థితిలోనైనా ఉండగలడు.. అని అనుకుంటే, సృష్టి జరిగిపోయింది కదా? మరి ఇప్పుడెక్కడున్నా డూ?” అని ! ఇదే విషయం కార్ల్ సాగన్ పుస్తకం ‘కోస్‌మోస్’ (cosmos)లో కూడా ఉంది.

హిందూ తత్త శాస్త్ర ప్రకారం ఆస్తిక, నాస్తిక భావజాలాలు రెండున్నాయి. ఇందులో మొదటిది వేదాల నుండి దేవుడి నుండి బల్లి శాస్త్రం దాకా అన్నింటినీ నమ్మే ఈ ఆస్తికత్వం విపరీతంగా విజృభించి ప్రపంచమంతా వ్యాపించింది. సాంఖ్య, యాగ, న్యాయ, వైశాఖ, మీమాంస, వేదాంత శాఖలుగా పరిఢవిల్లింది. ఇక రెండోరకం నాస్తికత్వం ముక్తిని, స్వర్గాన్ని, ఆత్మల్ని నమ్మలేదు. ఈ కోవలోని వారు కూడా శాఖోపశాఖలుగా విస్తరిల్లారు. జైన, బౌద్ధ, చార్వాక, అజ్విక శాఖలుగా ఆయా కాలాలలో వర్ధిల్లుతూ వచ్చారు. వీరు ఆస్తికుల భావాలకు వ్యతిరేకమైన అంశాల్ని ప్రవేశపెట్టారు. ఎవరి భావజాలం వారిదైనా, చార్వాకులు మాత్రం వీరిలో ప్రత్యేకంగా నిలిచారు. పైగా క్రీస్తు పూర్వమే ఉద్భవించారు. దేవుణ్ణి, ఆత్మలను నిరసించారు. ప్రత్యక్ష ప్రమాణాలు కావాలని నిలదీశారు. భూమి, నీరు, గాలి, అగ్ని అనే నాలుగు మూలకాలతోనే అన్ని రూపొందాయని చెప్పారు.

దైవ భావనను పక్కకు నెట్టి, తొలిసారిగా ఒక వైజ్ఞానిక విశేషాన్ని అప్పుడే చెప్పగలిగారు: ప్రవచనాలు చెప్పేవారు చెపుతున్నట్టు, దేవుణ్ణి నిరసించే వారు ఇటీవల ఆధునిక కాలంలో పుట్టుకు రాలేదు. ఆస్తికత్వంతో పాటే నాస్తికత్వమూ పుట్టింది. అదేమీ విశృంఖలత్వం కాదు. సంఘ విద్రోహ శక్తి కాదు. పాపమూ కాదు. ఇదంతా ఆస్తికులు ప్రచారం చేసిన అబద్ధం! నాస్తికత్వం ఒక విచారధార. ఆలోచనా సరళి. జీవన విధానం. ఓపికగా నిజానిజాలు విశ్లేషించుకునే వారికి సత్యం బోధపడుతుంది. జట్కా గుర్రానికి పక్కలకు చూడకుండా గంతలు కడతారు. దైవంపై విశ్వాసమున్నవారు అట్లాంటి గంతలే కట్టుకుని విశ్వాన్ని మా కోణం లోంచే చూస్తామంటే కుదరదు. వారికి సమగ్రమైన అవగాహన కలగదు. గంతలు విప్పుకుని రావాలి!

చార్వాకుల మూల పురుషులు వెలువరించిన ‘బృహస్పతి సూత్ర’ ఇతర చార్వాక గ్రంథాలు కాల గర్భంలో కలిసిపోయ్యాయి. ఆ తర్వాత రెండు వందల ఏళ్లకు అంటే ఎనిమిదో శతాబ్దంలో జయరాసిభా ‘తత్వో పప్లవ సింహ’ అనే గ్రంథం ప్రకటించాడు. పద్నాలుగో శతాబ్దపు మధ్వాచార్ల ‘సర్వ దర్శన సంగ్రహ’ రాశాడు. ఇది భారతదేశ తత్త శాస్త్రాల సారాంశం. ఇందులో ఆయన చార్వాకుల గురించి రాశాడు. అది కూడా మొదటి అధ్యాయంలో ప్రముఖంగా రాశాడు. 8,14 శతాబ్దాలలో వెలువడ్డ ఈ రెండు గ్రంథాలు రెండవ తరం చార్వాకులు ప్రకటించినవి. వాటిలోని కొన్ని కొన్ని విషయాలు తరువాత తరాలకు అందుతూ వచ్చాయి. ఇవి ప్రశ్నించడాన్ని నేర్పాయి. ప్రత్యక్ష సాక్షాలను, రుజువులను కోరాయి. పందొమ్మిదో శతాబ్దంలోనే తమిళనాడులో ఒక ప్రయత్నం జరిగింది. 18821888 మధ్య కాలంలో మద్రాస్ సెక్యులర్ సొసయిటీ ‘ద థింకర్’ (తత్త వివేశిణి) పేరుతో ఒక పత్రిక ప్రచురించింది. ఇందులో రచయితల పేర్లు లేకుండా వ్యాసాలు రాయబడ్డాయి. లండన్ సెక్యులర్ సొసయిటీ జర్నల్ నుంచి ఎన్నిక చేసిన వ్యాసాలు కూడా పునర్ముద్రించబడ్డాయి. ఆ రోజుల్లో లండన్ సెక్యులర్ సొసయిటీకి మద్రాస్ సెక్యులర్ సొసయిటీ అనుబంధంగా పని చేసింది.

ఇరయ్యవ శతాబ్దంలో వినాయక్ దామోదర్ సావర్కర్ (18831966) భారత స్వాతంత్య్ర సమర యోధుడు, హిందూ జాతీయ నాయకుడు. ఆయన గో పూజను తీవ్రంగా నిరసించాడు. తన రాజకీయ నేపథ్యాన్ని పక్కన పెట్టి గొప్ప హేతువాదిగా, నిరీశ్వరవాదిగా వినుతికెక్కాడు. సత్యేంద్ర నాథ్ బోస్ (18941974) గణిత భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు. నిరీశ్వర వాది కూడా! క్వాంటమ్ మెకానిక్స్‌ని వెలుగులోకి తెచ్చాడు. అదే తర్వాతి కాలంలో బోస్ ఐన్‌స్టీన్ స్టాటిస్‌టిక్స్‌కి ఆధారమైంది. ఆస్ట్రో ఫిజిస్ట్‌గా ప్రసిద్ధుడైన మేఘానంద్ సాహా (18931956) నక్షత్రాల్లోని రసాయనిక, భౌతిక స్థితిగతుల గూర్చి చెప్పిన వాడు మాత్రమే కాదు.

ఒక నాస్తికుడు కూడా! అలాగే మరో ఆస్ట్రో ఫిజిస్ట్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (19101995) కూడా నక్షత్ర పరిణామంపై కృషి చేసి, 1983లో నోబెల్ బహుమతి సాధించాడు. ఆయన కూడా నిరీశ్వర వాదే! నాస్తికుడే!! తొలి భారత ప్రధాని ‘టు వర్డ్ ఫ్రీడమ్’ (1936) పేరుతో తన ఆత్మకథ రాసుకున్న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ (18891964) ఏ దేవుణ్ణీ విశ్వసించలేదు. మూఢ నమ్మకాల్ని తీవ్రంగా నిరసించాడు. మతం కారణంగా జరిగే అనర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన గోరా : గోపరాజు రామచంద్ర రావు (19021975) కులమతాల్ని దుయ్యబట్టిన సామాజిక కార్యకర్త! ఆయనతో పాటు ఆయన భార్య సరస్వతీ గోరా (19122007) కూడా హేతువాద ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1940లో హేతువాద కేంద్రం స్థాపంచి సమాజంలో మార్పు కోసం అహరహం కృషి చేశారు.

గోరా రచనలు తెలుగు సమాజానికి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి. 1972లో ప్రపంచ హేతువాద సభలు తొలిసారిగా ఏర్పాటు చేసి, ఆయన ఘనంగా నిర్వహించారు. ఫలితంగా 1997లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్’ ప్రారంభమైంది. 21వ శతాబ్దపు భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఆమర్తసేన్ నిరీశ్వరవాది. హిందూ మతంలో నిరీశ్వరవాదాన్ని ‘లోకాయత’ పేరుతో ఒక విభాగంగా గుర్తించాలన్నాడు. 2008లో ‘నిర్ముక్త’ వెబ్‌సైట్ (www.hugan athesit.org) ఏర్పాటయ్యింది. అది స్వేచ్ఛాలోచన కోసం, ప్రజాస్వామ్య మానవతా వాదం కోసం కృషి చేస్తోంది. 2009లో మీరానందా “ద గాడ్ మార్కెట్‌” (దేవతల సంత) అనే పుస్తకం ప్రచురించారు. అది భారతీయ మధ్య తరగతి జనుల్లో గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా పడుతూ ఉందో చర్చించింది.

వీరందరినీ గుర్తు చేసుకోవడమెందుకంటే, దైవభీతి, దైవ భావన లేకుండానే సమాజ శ్రేయస్సుకు జీవితాలు ధారపోసిన వారు కాబట్టి! విశ్వశాంతి కోసం, మానవీయ విలువల కోసం నిరంతరం శ్రమించారు కాబట్టి!! ఇప్పుడిక మనం, మన రాబోయే తరాలు ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాల్సి ఉంది. కనపడని దైవాన్ని నమ్ముదామా? కనిపించే మనిషి మేధస్సును, ఆత్మ విశ్వాసాన్ని నమ్ముదామా? దైవం పేరుతో దైవత్వం పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసే ఘరానా మోసగాళ్లను నమ్ముదామా? లేక వారి భరతం పట్టి, నోరు మూయిద్దామా? ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రచయిత గోపీచంద్ తండ్రి గారు నాటి ప్రముఖ రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి, నటులు అక్కినేని నాగేశ్వర రావు, కమల్ హాసన్ వంటి లక్షల మంది నిర్ణయం తీసుకున్నారు. వారు దైవాన్నీ దైవాంశ సంభూతుల్ని నమ్మలేదు. మరి వారు, వారి వారి రంగాలలో అత్యున్నత శిఖరాలు చేరులోలేదా?

2009లో హేతువాదాన్ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలకు ఓటు వేయవద్దని కాథలిక్ బిషప్ కౌన్సిల్‌లో ఒక ఉత్తర్వు జారీ అయ్యింది. అలాంటిదే 2010లో కూడా వెలువడింది. 2012 మార్చ్ 10న సనల్ ఎడ్మరు విల్లిపార్లే మోసాన్ని బట్టబయలు చేశాడు. క్రీస్తు విగ్రహం ఏడవడం ఒక బూటకమని, అది డ్రైనేజ్ సమస్యవల్ల విగ్రహం నుండి నీరు కారిందని రుజువు చేశాడు. టివి చర్చల్లో అదే చెప్పాడు. వాస్తవాల్ని అంగీకరించకుండా కొందరు ఆయనపై పోలీసు కేసు నమోదు చేయించి, ఇబ్బందులకు గురి చేశారు. మత మౌడ్యం వదిలించుకోలేనివారు అంతకన్నా ఎం చేయగలరు? ఏ కేసూ నిలవలేదు. ఇటీవలి కాలంలో కూడా హేతువాదులపై అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి.

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం బలిసిపోవడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే వచ్చే సమాధానం మత మౌఢ్యమే కదా? ఒక మత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మనోన్మాదులు చెలరేగిపోతున్నారు. ఇతర మతాలపై ద్వేషం కక్కుతున్నారు. ద్వేషం కక్కడంలో ఏ మతం వారికీ మినహాయింపు లేదు. మతాన్ని, కులాన్నీ, ప్రాంతాన్నీ ఫణంగా పెట్టి రాజకీయాలు చేస్తూ బతికేవాళ్లు మన కళ్లముందే ఉన్నారు. మనం గుర్తించడమే తరువాయి. ఇలాంటి విషయాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయితే తక్షణం చేయాల్సిన కర్తవ్యమేమిటంటే, మతం లేని మాన్యుల్ని గుర్తించుకోవడం, గౌరవించుకోవడం, వారిని ఆదర్శంగా తీసుకుని వారివారి పరిధుల్లో ముందుకుపోవడం అయితే దైవత్వం గురించి మాట్లాడేవారు మాత్రం, దయచేసి మానవుడి విజయాల ఫలితాలను అనుభవించకుండా బయటికి వచ్చి, వారేమిటో వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Comments

comments