Home కామారెడ్డి పత్తి ధర ‘బొత్తి’

పత్తి ధర ‘బొత్తి’

పెట్టుబడిరాక దిగాలుపడిన రైతులు
ధరను పెంచాలని రైతులు అభ్యర్థన
దళారుల ప్రమేయంతో రైతుల్లో ఆందోళన

Cotton1బాన్సువాడ: పత్తి రైతు చిత్తయ్యాడు. గిట్టుబాటు చాలక గొల్లుమన్నారు. దిగుబడులు మురిపించినా…మద్దతు ధర మాత్రం మరిపించేసింది. పెట్టిన పెట్టుబడులకు వచ్చిన దిగుబడులు ఆశలో ఊరించినా, చేతికందిన పైకం వారిని నిండా నిరుత్సాహానికి లోను చేసింది. తెల్ల బంగారం పండిస్తే ఆర్థిక కష్టాల నుండి తేలిపో తామనుకున్న వారికి మరిన్ని నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఈ ఏడు సాగు తక్కువ కావడంతో ధరలు అమాంతంగా పెరుగుతాయని అనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి.

వచ్చిన దిగుబడులను కొనేందుకు లేనిపోని కొ ర్రీలు పెడుతుండటంతో ఇంకా పత్తిదారులు పరేషానవుతున్నారు. దుమ్ము ఎక్కువుందని…పత్తిలో నాణ్యత లేదని… ఇంకా పచ్చిగుందని చెబుతూ వారిని నిండా ముంచాలని చూస్తున్నారు. మరో వైపు దళారులు సైతం రంగ ప్రవేశం చేసి వారి ప్రతాపాన్ని చూపించుకునే పనిలో పడ్డారు. ధరను దిగజార్చి మరీ కొనుగోలు చేసేందుకు రైతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎకరం పత్తి సాగుకు దాదాపు ఇరువై వేల పైచిలుకు ఖర్చు కాగా అందులో సాగు మాత్రం నాలుగు నుండి ఆరు క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. కర్షకులు మాత్రం సుమారు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడులు చేతికందుతాయని ఆశించారు. కాని అలా జరుగలేదు. ఆరు క్వింటాళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వచ్చిన దిగుబడులకు సరిపడా గిట్టుబాటైనా రాకపోవడంతో ఆర్థిక కష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పత్తి ధర రాక పోవడం పెట్టిన పెట్టుబడులకు అందిన రాబడి సరిపోక రైతులు దిగాలు మంటున్నారు. మొదటి నుండి వ్యవసాయాధికారులు పత్తి పంటను సాగు చేసుకోరాదని, వర్షాపాతం తక్కువగా ఉన్న దృష్టా నష్టాలను చవిచూడరాదని సూచించినప్పటికీ వారి మాటను రైతులు పెడచెవిన పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను చూసి బిత్తెర పోతున్నారు. కొనుగోలు కేంద్రాలలో మాత్రం వారం రోజుల క్రితం క్వింటాళుకు 5 వేల 850 రూపాయలను అందించారు. అంతలోనే ధరను తగ్గిస్తూ ప్రస్తుతం 5,650 రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో కర్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

కనీసం దళారులైనా కాసింత ధరను పెంచి ఇస్తారను కుంటే అది కూడా వారికి కనిపించడం లేదు. దళారులు కూడా ప్రభుత్వ ధర కంటే మరింత దిగజార్చి 4 వేల నుండి 4500 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతూ పత్తిదారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఎదురు చూసిన వారికి ముందు చూపు కొంపముంచినట్టుగా చేసింది. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 18 వేల 300 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగాల్సి ఉండగా అందులో ఖరీఫ్‌గాను 10 వేల 537 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. కాని వారి అంచనాల ప్రకారం కాకుండా రైతులు 6 వేల 139 ఎకరాల్లో మాత్రమే పత్తి పంటను సాగు చేసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో కేవలం 34 శాతం మాత్రమే తెల్ల బంగారం పండిందని అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి. తక్కువ సాగులో అధిక ధరలు వస్తాయని ఆశించిన అన్నదాతలకు ఆశాభంగం కలిగించింది. ఏదేమైనా పత్తి రైతుకు మాత్రం ఖరీఫ్ పత్తి సాగు కష్టాలను తీసుకొచ్చి పెట్టింది.
తరలుతున్న పత్తి దిగుబడులు

జిల్లాలో గాంధారి, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ ప్రాంతాలలో పత్తి సాగు అక్కడక్కడ జరిగింది. వచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు గ్రామ గ్రామాల నుండి పత్తిని ఆటోలు, టాటా ఎసీలు, ట్రాక్టర్లలో పత్తిని తరలించుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల రద్దీతో పాటు రైతుల సందడి కనిపిస్తున్నా అందరిలో నిరాశే కనిపిస్తోంది.

ఆశలు అడియాసలయ్యాయి… రైతు సంతోష్

పత్తి సాగుతో ఈ సారి అధిక గిట్టుబాటు ధరను చూస్తామని అనుకున్నా. నాకున్న మూడు ఎకరాలలో పత్తిని పండించినా. ఎకరాకు నాకు ఇరువై నుండి ఇరువై మూడు వేలు ఖర్చయింది. కాని నేను అనుకున్నట్లుగా ధర రాలేదు. బాగా తగ్గించి ఇస్తున్నారు. పెట్టుబడి కూడా రాకుండా ఉంది. ధర పెరిగితే కొన్ని అప్పులైనా తీరేవి అంటూ మద్నూర్‌కు చెందిన రైతు సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు.

పత్తి ధరను పెంచితే బాగుండే… రైతు దావుద్

పత్తి గిట్టుబాటు ధరను ప్రభుత్వం ఆరు వేల రూపాయలైనా ఇస్తే బాగుండే. కాని మొదట్లో 5850 రూపాయలిచ్చిండ్రూ.గిప్పుడేమో 5650 రూపాయలే ఇస్తామంటున్రూ. రేపు రేపేమంటరో. పత్తికి కోరుకున్న విధంగా ధర రాక నాకు నష్టం జరిగిందని, వేసిన నాలుగు ఎకరాలకు 80 వేలు ఖర్చయితే వచ్చిన రాబడి మాత్రం 70 వేల ఉందని రైతు దావుద్ ఆవేదన వ్యక్తం చేశారు.