Home ఆఫ్ బీట్ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ మంచిదే!

పెళ్లికి ముందు కౌన్సెలింగ్ మంచిదే!

ఈ మధ్య కాలంలో భార్యాభర్తల గురించి, కొత్తగా పెళ్లి చేసుకుని విడిపోతున్న వారి గురించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. అసలు అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో వాటికి ముగింపు ఎలాగో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ రోజుల్లో సంబంధాల్లో స్థిరత్వం, ఒకరికొకరు అండగా ఉండటం క్రమంగా తగ్గిపోతోంది. ఈ కారణంగా వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి బదులు చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకుంటున్నారు. ఫలితంగా పరిస్థితి విడిపోవటందాకా వెళ్తుంది. ఇలాంటప్పుడు బంధాల్లో ఆత్మీయత నిలిచి ఉండాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

wedding

దంపతులు విషయాలను సరైన రీతిలో అర్థం చేసుకునేందుకు కౌన్సెలింగ్ సహాయపడుతుంది. మ్యారేజీ కౌన్సెలర్లు ఈ రోజుల్లో ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్‌లుగా కూడా మారుతున్నారు. వారిని నూతన దంపతులు, కాబోయే దంపతులు కలిసి తమ సమస్యలు, సలహాలకు సమాధానాలను పొందొచ్చు. కొన్నిసార్లు భార్యాభర్తల బంధాలు పొసగని విషయాలతో తెగిపోయేదాకా వెళ్తున్నాయి. ఎందుకంటే వారికి వివాహం తర్వాత బంధాల్ని ఎలా కొనసాగించాలనే అంశంపై శిక్షణ ఏదీ ఉండదు.
సైకాలిజిస్ట్‌లు ఈ విషయం గురించి మాట్లాడుతూ భారతదేశంలో వివాహాలకు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాం. కానీ వివాహ బంధాన్ని నిలుపుకునేందుకు అవసరమైన కౌన్సిలింగ్ కోసం డబ్బు ఖర్చు పెట్టరు. అసలు ఇది అవసరమే లేదు అనుకుంటారు. అందుకే ఈ రోజుల్లో కొన్ని విడాకుల కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. హనీమూన్‌లో భర్త కేవలం తడి టవల్‌ను బెడ్‌పై పెట్టేయటాన్ని అసహ్యించుకుని విడాకులు కోరుతున్న మహిళలు కూడా ఉన్నారు అని చెబుతున్నారు. మ్యారేజీ కౌన్సిలింగ్ రెండు విషయాలతో ముడి పడి ఉంటుంది. ఒకటి ఆరోగ్య సంబంధమైనది, రెండోది అనుబంధాలకు సంబంధించింది. కౌన్సెలింగ్‌లో వైవాహిక జీవితంలో వచ్చే సాధారణ సమస్యలు, వాటి నుంచి కాపాడుకునే ఉపాయాలు వివాహాన్ని సక్సెస్ ఫుల్‌గా మలుచుకునే విశేషాలను తెలియజేస్తారు. వివాహం తర్వాత ఆరోగ్య సంబంధమైన కౌన్సెలింగ్ వైవాహిక జీవితానికి ఉపయోగపడినట్లే సంబంధాలపై పరిజ్ఞానం పొందటం వల్ల నవ దంపతులు కొత్త వాతావరణంలో సులభంగా సర్దుకుపోగల్గుతారు.
కౌన్సెలింగ్‌తో లాభాలు
పెళ్ళి గురించి అబ్బాయి, అమ్మాయి ఇద్దరి మధ్య శారీరకరమైనవేగాక సంబంధాలను నిభాయించటం గురించి కూడా అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కానీ వాటికి సరైన జవాబులు స్నేహితులు, కుటుంబసభ్యులు ఎవరి దగ్గరా దొరకవు. ఇలాంటి సమయంలో మ్యారేజీ కౌన్సెలర్ మాత్రమే వారి సందేహాలకు సరైన జవాబులు చెప్పగలరు. మ్యారేజీ కౌన్సెలర్‌తో మరో ప్రయోజనం ఏమిటంటే భాగస్వాములిద్దరూ ఒకరికొకరు చర్చించుకోడానికి సంకోచించే విషయాలను కూడా మనసు విప్పి మాట్లాడుకునేలా చేస్తారు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు.
పెళ్లి ఒక టర్నింగ్ పాయింట్. దీంతో జీవన విధానం పూర్తిగా మారిపోతుంది.
వివాహానికి ముందు కౌన్సెలింగ్ పెళ్ళి చేసుకునే జంటలకు రాబోయే జీవితానికి సంబంధించిన పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ ప్రకారమే నడుచుకునేందుకు సహాయపడుతుంది. మ్యారేజీ కౌన్సెలర్లు జంటలకు సహాయపడుతూ వారు వర్తమాన సమయంతోపాటు భవిష్యత్తు గురించి కూడా ప్లానింగ్ చేసుకునేలా సూచిస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్, అత్తారింట్లో సంబంధాలను మేనేజ్ చేసుకోవటం, ఫైనాన్షియల్ ప్లానింగ్ తదితర విషయాల్లో సలహాలిస్తారు. మ్యారేజీ కౌన్సెలర్లు జంటలతో కేవలం పాజిటివ్ మాటలే కాకుండా జనం మాట్లాడడానికి ఇష్టపడని, సంకోచించే విషయాల గురించి కూడా చర్చిస్తారు. ఎందుకంటే పెళ్ళి చేసుకునే ముందు నిజంగానే ఇద్దరూ ఒకరినొకరు కోరుకుంటున్నారా? ఎమోషనల్, సెక్సువల్, ఫైనాన్షియల్‌గా తోడు ఉండగలరా? సంబంధం గురించి ఇరువురి ఆలోచనలు ఒకేలా ఉన్నాయా? ఈ ప్రశ్నల జవాబుతో నిజంగా పెళ్ళికి సిద్ధ్దమయ్యారా, లేదా అనే విషయం తెలిసిపోతుంది.