Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రక్త దానంతో ప్రాణాలను నిలుపుదాం

రక్త దానంతో ప్రాణాలను నిలుపుదాం

Blood

మన తెలంగాణ/సిటీబ్యూరో : అన్నదానం ఆకలి తీరుస్తోంది…రక్త దానం ప్రాణాన్ని నిలుపుతోంది…అన్ని దానాల్లో ప్రాణాలను నిలిపేది రక్త దానం…రక్తం ఇవ్వడం వల్ల ఏలాంటి నష్టాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రక్తదానం చేసిన 72గంటల్లోనే రక్తం తయ్యారవుతోందని, మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చని సూచిస్తున్నారు. రక్త దానంపై ఎంతో ప్రచారమవుతోన్న నేటికి కొందరు రక్త దానం చేసెందుకు ముందుకు రావడంలేదు. ఈ అపోహాలను వీడి రక్తదానం చేయండని వైద్యులు సూచిస్తున్నారు. నేడు రక్త దాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం….రక్తంలో ఎ, బి, ఓ అనే గ్రూపులు ఉన్నాయని 1900 సంవత్సరంలో కనుగొని నోబెల్ బహుమతితో పాటు ఫాదర్ ఆఫ్ ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ గుర్తింపును పొందిన కారల్‌ల్యాండ్ స్టెయినర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్త దాన దినోత్సవం జరుపుకుంటున్నాం.

దాతల్లో ఎక్కువ యువతే

రక్త దానంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా, అవసరమున్న వారికి సమాచారమిచ్చేందుకు కొన్ని వెబ్‌సైట్‌లు,సోషల్ మీడియాలో బ్లడ్ డొనేషన్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఏ గ్రూపు రక్తం అవసరమున్నా అందించే అవకాశం కల్పిస్తున్నారు.కానీ వేసవి కాలం కావడంతో నగరం నుంచి విద్యార్థులు సెలవుల్లో స్వస్థలాలకు వెళతారు. దీంతో వేసవిలో రక్త దానం చేసే వారు కూడా నగరంలో తగ్గుముఖం పడుతుంది.

రక్త దాత ప్రాణదాత

రక్తం మనిషికి ప్రాణవాయువు కొన్ని అవయవాలు లేకుండా జీవించొచ్చు. కానీ రక్తం లేకుంటే బతికే అవకాశాలే లేవు. రోడ్డు ప్రమాదాలు,శస్త్రచికిత్సలు, సందర్భం ఏదైనా రోగి శరీరంలో ఉన్న రక్తం బయటకు పోవడంతో ఒంట్లో రక్త శాతం తగ్గుతోంది. దీనివల్ల మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బాధితులకు వెంటనే రక్తం ఎక్కిస్తుంటారు. మహిళల విషయానికొస్తే ప్రసవం సమయయంలో చాలా వరకు అవసరముంటుంది. గుండె, కాలేయం, కిడ్నీ తదితర పెద్ద పెద్ద శస్త్రచికిత్సల సమయంలో రోగులకు రక్తం ఎంతో అవసరం. సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే రోగి బ్రతకడం కష్టమే…ఈ క్రమంలో రక్త దానానికి ప్రాధాన్యం పెరిగింది.

రక్తం ఎన్ని రకాలు

రక్తంలో మొత్తం 8రకాల ప్రధాన గ్రూపులున్నాయి. దీంతో పాటు మరో అరుదైన గ్రూపునకు చెందిన రక్తం ఉంది. ఎనిమిది ప్రధాన గ్రూపుల్లో నాలుగు గ్రూపులు పాజిటివ్‌కు,మరోనాలుగు గ్రూపులు నెగటీవ్‌కు సంబంధించినవి. అయితే మనుషుల్లో 90శాతం మంది పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన వారే ఉంటారు. అందులో ఎక్కువ మొదటి స్థానంలో ‘ఓ’ పాజిటివ్, రెండో స్థానంలో ‘ఎ’ పాజిటివ్, మూడోస్థానంలో ‘బి’పాజిటివ్, నాలుగో స్థానంలో ‘ఎబి’పాజిటివ్ గ్రూపులు గ్రూపులకు చెందిన రక్తాన్ని కలిగి ఉంటారు. అదే విధంగా ‘ఎ’నెగటివ్, ‘బి’నెగటివ్,‘ఎబి’నెగటివ్,‘ఓ’నెగటివ్‌తో పాటు బొంబై బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఈ ఎనిమిది గ్రూపుల్లో ‘ఎబి’నెగటివ్,బొంబై గ్రూపులు అరుదైనవి.

ఒరకి దానం నలుగురికి

సాధారణంగా మనం చేసే రక్త దానం ద్వారా సేకరించిన రక్తం లోంచి రెండు రకాల ద్రవాలు, రెందు రకాల కణాలను తీస్తారు. అందులో ముఖ్యమైంది. ప్యాకిడ్ రెడ్ బ్లడ్ సెల్స్. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్, ప్లాస్మా అనే నాలుగు ప్రధానమైన పదార్థాలుంటాయి. ఒకవ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని హైస్పీడ్ రివల్యూషన్ పద్ధతి ద్వారా వీటిని వేరు చేస్తారు. రోగికి ఏది అవసరముంటే దాన్ని ఎక్కిస్తారు.

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు

తరచుగా రక్తదానం చేయడంవల్ల క్యాన్సర్ వ్యాధి సోకే ముప్పును తగ్గించుకోవచ్చు. రక్తదానం వల్ల శరీరంలోని ఐరన్‌శాతం తగ్గిపోతుంది. తద్వారా క్యాన్సర్ వ్యాధి భారినపడే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇంతే కాకుండా కనీసం ఏడాదికి ఒకసారి రక్తదానం చేస్తే గుండెపోటు రావడం 88శాతం తగ్గిస్త్తుందని అమెరికన్ జర్నల్ ఎపిడిమియాలజీ స్పష్టం చేసింది. రక్తదాత ఇతరుల జీవితానికి భరోసా ఇవ్వడమే కాకుండా తన సొంత ఆరోగ్యాన్ని, జీవితాన్ని సైతం మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు అవకాశముంటుందని వెల్లడించింది. కాలేయం ఆరోగ్యవంతంగాకూడా ఉంటుంది. శరీరంలోని ఇనుము నిల్వలు తగ్గిపోతాయి. నాన్ అల్కాహాల్ ఫ్యాటీ లివర్ సమస్యలు,ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

117సార్లు రక్తదానం

నగరంలోని బాగ్ అంబర్‌పేట్ డిడి కాలనీకి చెందిన యోగేష్ రాజ్ శ్రీవాత్సవ ఇప్పటి వరకు 117సార్లు రక్తదానం చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటికే అధికంగా రక్తదానం చేసినందుకుగాను ఈయనకు పలు అవార్డులు సైతం దక్కాయి. ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అంటున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయనకోరుతున్నారు. నేడు రక్తదాన దినోత్సవం సందర్భంగా మరో అవార్డును సైతం అందుకోనున్నారు.

రక్త దానం చేస్తే ఆర్యోగానికి మంచిది

సాధారణంగా ఒక వ్యక్తి నుంచి 450మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తం సేకరించే ముందు రక్తదానం చేసే వారికి కొన్ని ప్ర ధానమైన పరీక్షలు చేస్తారు. రక్తదానం చే సే వ్యక్తి 18ఏళ్లు నిండి, 60ఏళ్లలోపు వయ సు వారై ఉండాలి. శారీరకంగా ఆరోగ్య వంతుడై ఉండాలి. 45కిలోలకు పైగా బరువు కలిగి ఉండాలి. రక్తదానం చేసిన వారికి పూర్తి స్థాయిలో రక్తం 21రోజుల్లో ఉత్పత్తి అవుతోంది. కనీసం మూడు నెలలకు ఒకసారైనా రక్త దానం చేయవచ్చు. రక్తదానం చేయడం ఆర్యోగానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

డాక్టర్ కె.హితేష్‌కుమార్ (ఎంబిబిఎస్,ఎండి)
ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ కన్సల్టెంట్ కిమ్స్ ఆసుపత్రి