Home తాజా వార్తలు అగ్రవర్ణ రిజర్వేషన్లపై దేశవ్యాప్త ఆందోళన

అగ్రవర్ణ రిజర్వేషన్లపై దేశవ్యాప్త ఆందోళన

BC Welfare Association president Jajula srinivas goud

 

బిసి సంఘాల నిర్ణయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : ఆగ్రవర్ణ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బిసి సంఘాలు నిర్ణయించినట్లు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 22వ తేదీన ఓబిసిల ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చేడానికే అగ్రవర్ణాలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలో బిసి సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కేటాయించేలా చట్టం చేయడం అనైతికమన్నారు. నగరంలోని బిసి భవన్‌లో జరిగిన శనివారం బిసి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ తెలంగాణలో బిసిల రిజర్వేషన్లు తగ్గించడాన్ని నిరసిస్తూ దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ఓబిసి ప్రతినిధులతో కలిసి జాతీయ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

దేశంలో 56 శాతంగా ఉన్న బిసిల ప్రయోజనాలను తాకట్టు పెట్టి పది శాతంగా ఉన్న అగ్రవర్ణాల ప్రయోజనాలను కాపాడేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణ – దేశ సంరక్షణ నినాదంతో దేశవ్యాప్తంగా ఓబిసిలంతా ఢిల్లీలో భారీ ప్రదర్శనతో పాటు సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటివారంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లు, పంచాయతీల్లో బిసి రిజర్వేషన్ల తగ్గింపునకు సంబంధించి ఒకవైపు వీధి పోరాటంతో పాటు ఇంకోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. బిసి ఓట్లతో గెలిచిన పార్లమెంట్ సభ్యులను రానున్న ఎన్నికల్లో ఓడించి తమ సత్తాను చాటుతామని చెప్పారు. రాజ్యాంగ రక్షణ — దేశ సంరక్షణ నినాదంపై దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించి త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని వివరించారు.

Countrywide concern on upper caste reservation