Home దునియా దంపతులు ప్రేమికుల్లా ఉండాలి

దంపతులు ప్రేమికుల్లా ఉండాలి

డా.హిప్నో కమలాకర్
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
9390044031

couple-planned-for-Honeymoo

ప్రశ్న : మా నాన్నగారు, మా వారి నాన్నగారు చిన్నప్పట్నుంచి మంచి స్నేహి తులు. వారి స్నేహాన్ని చక్కని బంధంగా మలుచుకోవాలనే మా ఇద్దరికి పెళ్లి చేసారు. చిన్నప్పట్నుంచి బాగా తెలిసిన వ్యక్తి, ఇష్టపడిన వ్యక్తి కావడం వల్ల నేను కూడా ఆయనతో పెళ్ళికి అంగీకరించాను. పెళ్లయిన ఆరునెలలకి ఆయన నా దగ్గర దాపరికంగా వుండడం ఇష్టం వుండదంటూ తన లవ్ ఎఫైర్ గురించి చెప్పాడు. ఆమె అంటే తనకు చాలా అనురాగమని పెళ్లి చేసుకుంటే నిన్ను కాని తనను కాని చేసుకోవాలని అనుకునే వాడ్నని చెప్పాడు. మీ ఇద్దరికి నాకు భార్యకు తగిన లక్షణాలు వున్నవారేనని అన్నాడు. ఆమె తల్లిదండ్రులు, ఆమె తననే చేసుకుంటానని ఎంతగా మొరాయించినా, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేసారని చెప్పాడు. సరే ఇదంతా జరిగిపోయిన కథ కదాని అని నేను సరిపెట్టుకున్నాను. కాని ఇటీవలే తెలిసింది, ఇద్దరికీ ఇంకా సంబంధం కొనసాగుతూ వుందని. ఇద్దరూ తమ తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారని. నా భర్తకు ఈ ఒక్క విషయంలో తప్ప ఇంకేం లోపం లేదు. వేరెవ్వరిని ఆయన కన్నెత్తి కూడా చూడడు. కానీ నాకు ఎందుకో ఇలా వుండడం నచ్చడం లేదు. ఇపుడు నేనేం చేయాలి ?

జవాబు : మన పురాణాలు, అంతర్లీనంగా వ్యక్తుల వైఖరులను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి మీ సమస్య ఒక ఉదాహరణ. మీ వారిది లైంగిక విపరీత లక్షణం కారణంగా ఏర్పరుచుకున్న సంబంధం కాదు. ఇద్దరినీ తన భార్యలుగా చూసుకోవాలనుకునే తత్వం. అతనికి తెలియకుండానే మీ ఇద్దరినీ భార్యలుగా చేసుకోవాలనే కాంక్షను బయటపెడుతున్నాడు. కానీ నవ్యసమాజంలో ఇది సాధ్యం కాదు. ఈ చేదు నిజాన్ని భరించే శక్తిగాని, అందుకు అనుగుణంగా తనను నియంత్రించుకోవాలనే అవగాహన కానీ నీ భర్తలో లేవు. అది ఆయన మైండ్‌సెట్ కాదు. కాబట్టి ఈ పోకడను నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు. అలాగని అతనికి దూరమై బాధలను కొనితెచ్చుకోవల్సిన పని లేదు. ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎట్లాంటి ముప్పును తీసుకు వస్తాయో అతనికి తెలియచెప్పాలి.

మరీ ముఖ్యంగా పెళ్లయిన మరొక స్త్రీతో ( ఆమె అతనికి గత జీవితంలో గొప్ప ప్రియురాలే కావచ్చు.) సంబంధం పెట్టుకోవడం చాలా చాలా పెద్ద తప్పు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసిపోతే ఏం జరుగుతుందో ఆలోచన లేకుండా లేదా ఏం జరిగినా సరే ఫర్వాలేదు అనే తెగింపు ధోరణితో అతను చేస్తున్న తప్పు ! ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకముందు ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించడం వల్ల ఏర్పడబోయే ప్రమాదాలను, మీ రెండు సంసారాలలోను పుట్టబోయే లేదా ఇప్పటికే పుట్టిన బిడ్డల భవిష్యత్తుకు ఎంత కీడును కల్గిస్తాయో మీ భర్తకు తెలియచెప్పండి. లేదా మీకు దగ్గరలో వున్న మ్యారేజ్ కౌన్సిలర్‌ను సంప్రదించి ఆయనకు కౌన్సెలింగ్ ఇప్పించండి. సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించి చెప్పడం ద్వారా అతని వైఖరి మారవచ్చు. ఈ లోగా మీరు మీ భర్తపై కల్గిన ఏహ్యభావంతో అతనితో సఖ్యతను వదిలిపెట్టకండి. అతను మక్కువ చూపించే ఇరువురి భార్యల్లో, మీరు కూడా ఒకరు కాబట్టి, ఆయనకు మీపై వున్న ప్రేమానురాగాలను సందేహాస్పదం చేయకండి. ఆయన పెట్టుకున్న అన్యసంబంధం కన్నా, మీతో పెట్టుకునే సంసారిక బంధం అవ్యాజ మయినదని గ్రహించేలా చేసుకోండి.

ప్రశ్న : మంచి ఉద్యోగం వచ్చిందని మా వారు చెన్నయ్‌కి వెళ్లిపోయారు. నేను మా అత్తగారింట్లో, ఒక పల్లెటూరిలో వుండాల్సివచ్చింది. మాకు ఇద్దరు పిల్లలు. దగ్గర్లోనే వున్న ఒక కాన్వెంట్‌లో చేర్పించాను. వాళ్లని చదివించడం, ముసలి అత్తమామలను చూసుకోవడం… ఇదే నా పని. ఆయన ఎప్పుడో చుట్టం చూపులా ఒకసారి వచ్చి రెండురోజులు వుండి తిరిగి వెళ్లి పోతారు. నాకు చాలా బోర్‌గా వుంటోంది. అస లు నాకు పెళ్లి అయ్యిందా లేదా అనే అనుమానం వస్తోంది. ఆయనకు చెబితే… నవ్వేస్తారు. పిల్లల భవిష్యత్తుకోసం సంపాదించొద్దా అంటారు. అందులో నిజం వుందని నాకు అన్పిస్తున్నా ఆయనకు దూరంగా వుండలేకపోతున్నాను. నేనేం చేయాలి ?

జవాబు : ఆర్థిక పరిస్థితులు కఠినమయినవి. వాటికి సెంటిమెంట్లు వుండవు. ప్రణాళికా బద్ధమయిన జీవితాన్ని గడపడం ద్వారా భవిష్యత్తును ఉజ్వలంగా మలుచుకోవచ్చు. అందుకోసం కొన్ని త్యాగాలు తప్పవు. ఎడబాటు భరింపశక్యం కానిదే అయినా మీ వారు చెబుతున్న సత్యాన్ని మీరు కూడా గ్రహించారు కాబట్టి, ఓపిక పట్టక తప్పదు. కాకపోతే మీ దంపతులిద్దరూ కొంత జాగ్రత్తగా కలిసికట్టుగా ఆలోచిస్తే, మీ ఎడబాటు సమస్యను పూర్తిగా తొలగించుకోలేక పోయినా… కొంతవరకు ఉపశమింపచేయవచ్చు. ఒక సంవత్సరంలో ఆయన సెలవు పెట్టుకుని మీ ఊరికి వచ్చే సందర్భాలను పెంచుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం మూడుసార్లు మాత్రమే రాగల్గుతున్న ఆయన, పబ్లిక్ సెలవుల్ని కలుపుకునే విధంగా సెలవులు పెట్టుకుంటే మరో రెండురోజులు ఎక్కువగా మీతో గడిపే అవకాశాలు రావచ్చు.

లేదా మీ పిల్లల బాధ్యతను తాత్కాలికంగా మీ అత్తగారికి అప్పగించడమో లేక తరచుగా మీ ఇంటికి వచ్చే ఆడపడచుకు అప్పగించడమో చేసి, మీరు చెన్నయ్ వెళ్లవచ్చు. స్వయం పాకం చేసుకుంటున్న ఆయన సంరక్షణ చూసినట్టుగానూ వుంటుంది. ఆ కొన్నిరోజులు మీకు ఒక రిలీఫ్‌గాను వుంటుంది. ప్రతిరోజు ఒకే ఇంటిలో రొటీన్‌గా వుండేకన్నా ఇలా తరచు కలుసుకునే ప్రేమి కుల్లా మీ దంపతులిద్దరూ గడిపే అవకాశం ఏర్పరు చుకుంటూ ఆనందంగా వుండవచ్చు. నిరాశామయంగా కన్పిస్తున్న ప్రస్తుత పరిస్థితులలోనే ఆశావా దాన్ని అలవర్చుకోండి. మిగి లిన తీరిక సమయాన్ని ప్రయోజనకరంగా మలుచు కోవడానికి ఏదయినా వ్యాపకం పెట్టుకోండి. మీ చదువును కొనసాగించడం కాని, కుట్లు, అల్లికలు, శారీ ప్రింటింగ్ వంటివి చేస్తే, ఆర్థికంగా మీ వారికి చేదోడు వాదోడుగా కూడా ఉండగల్గుతారు. పనిలో పనిగా మీ బోర్‌డవ్‌ును కూడా జయించగల్గుతారు.

అంతర్గత సమస్యలను ఎవరితోనైనా పంచుకుంటే ఆ సమస్య సగం తీరినట్లే. శారీరక, మానసిక సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు డా॥ హిప్నో కమలాకర్ సలహాలిస్తారు
ఈ కింది ఇ-మెయిల్‌కి మీ సందేహాలను పంపగలరు.
e-mail : features @manatelangana.org