Home జాతీయ వార్తలు సిపిఐ అగ్రనేత బర్దన్ కన్నుమూత

సిపిఐ అగ్రనేత బర్దన్ కన్నుమూత

CP-Bardhanన్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అగ్రనేత , పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబి బర్దన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్ ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఈ ప్రముఖ కమ్యూనిస్టు, వామపక్ష కార్మిక నేత వయస్సు 91 సంవత్సరాలు. అనారోగ్యంతో గత నెల 7 నుంచి ఆయన పక్షవాతం రావడంతో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కొద్దిగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీనితో వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం ఉదయం కొద్దిగా కుదుట పడినట్లు అన్పించినా తరువాత క్షీణించింది. అర్ధ్దేందు భూషణ్ బర్దన్ దేశంలో పలు కార్మిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలో వామపక్ష రాజకీయాలలో ప్రముఖ బాధ్యతలు నిర్వర్తించారు. 1957లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. తరువాత సిపిఐ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దేశంలో కార్మికుల సమస్యల గురించి నిరంతరం పోరాడుతూ వస్తోన్న అఖిలభారత కార్మిక సంఘం ఎఐటియుసికి ఆయన తరువాత అధ్యక్షులుగా వ్యవహరించారు. 1990 ప్రాంతంలో ఆయన పార్టీలో జాతీయ స్థాయి రాజకీయాలలో కీలక పాత్ర వహించారు. సిపిఐ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అయిన తరువాత ఆయన సీనియర్ నేత ఇంద్రజిత్ గుప్తా తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1996లో ఎన్నిక అయ్యారు. 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో ఆయన జన్మించారు. విద్యార్థి సంఘాలలో తొలుత కీలక భూమిక నిర్వహించారు. బెంగాల్‌లో వామపక్షాల ఐక్యతకు బర్దన్ కీలక పాత్రపోషించడంతో రాష్ట్రంలో ఆ తరువాత వామపక్షాలు తిరుగులేని విధంగా ప్రజలకు చేరువఅయ్యాయి. 1967 , 1980 లోక్‌సభ ఎన్నికలలో నాగ్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1996 – 2012 మధ్య బర్దన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
నిరంతర పోరాట యోధుడు : సిపిఐ నివాళి
బర్దన్ అస్తమయం పట్ల సిపిఐ జాతీయ సమితి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి వార్తను పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన దేశంలో వామపక్ష, కమ్యూనిస్టు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారని గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న బర్దన్ శనివారం ఇక్కడి జిబి పంత్ ఆసుపత్రిలో కన్నుమూశారని పేర్కొన్నారు. ఆయనకు కుమారుడు అశోక్ , కూతురు డాక్టర్ అల్కా ఉన్నారు. నాగ్‌పూర్‌లో పార్టీ జాతీయ సమితి సమావేశాల సందర్భంగా ఆయనకు తొలిసారిగా పక్షవాతం వచ్చింది. తరువాత ఆయన ఎడమ భాగం దెబ్బతింది. జీవితాంతం ఆయన పలు ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చారని , పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారని , తనకు అనారోగ్యం తలెత్తిన తరువాత కూడా ఆయన పార్టీ పటిష్టతకు సేవలు అందించారని , 2015 పార్టీ 22వ జాతీయ సభలు పుదుచ్చేరిలో జరిగినప్పుడు ఆయన హాజరు అయ్యారు. పార్టీ నూతన కార్యక్రమాన్ని ఆయన సూచించగా పార్టీ వర్గాలు అప్పట్లో ఏకగ్రీవంగా ఆమోదించాయని పార్టీ తెలిపింది. ఏఐటియుసి నేతగా , సిపిఐకి వివిధ స్థాయిల్లో విశేష సేవలు అందించిన బర్దన్ మృతి తీరని లోటని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి తమ ప్రకటనలో తెలిపారు. సైద్ధాంతికంగా, రాజకీయంగా ఆయన పలు అంశాలవారిగా విశేషరీతిలో నిర్వహించిన అధ్యయనాలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిబద్దతతో, నిజాయితీతో శ్రామిక లోకానికి సేవ చేశారని, ఆయన మరనణం పట్ల సిపిఐ జాతీయ సమితి ప్రగాఢ సంతాపం తెలియచేస్తోందని ఆయన వెల్లడించారు.
సురవరం సుధాకర్ రెడ్డి ఢిల్లీ పయనం
బర్దన్ మరణ వార్త తెలియగానే సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కె. నారాయణ శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.
సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సంతాపం
బర్దన్ మరణం పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించింది. సమకాలీన రాజకీయాలలో ఆయన కమ్యూనిస్టు మేరు నగధీరుడని, కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి, వామపక్షాల ఐక్యతకు నిరంతరం కృషి చేశారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికే కాకుండా దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం మగ్దూంభవన్‌లోనూ , రాష్ట్రంలోని ఇతర చోట్ల సిపిఐ కార్యాలయాల్లోనూ అరుణ పతాకాన్ని అవనతం చేస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మగ్దూంభవన్‌లో సంతాప సభ జరుగుతుంది.