Home తాజా వార్తలు ‘టెలికామ్’ పరేషాన్

‘టెలికామ్’ పరేషాన్

bs1

రిలయన్స్ జియో టెలికామ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు  ఇంతలా ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 4జి వోల్ట్ నెట్‌వర్క్‌తో ఉచిత వాయిస్ కాల్స్, డేటా అంటూ వచ్చిన జియో ఓ విప్లవమే సృష్టించింది. ఏడాది పాటు ఉచిత తంతును కొనసాగించడంతో.. అప్పటి వరకు టెలికామ్ రంగంలో రారాజులుగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థల్లో అలజడి మొదలైంది. జియో ఉచిత ఆఫర్‌ను మరోసారి కొనసాగించడంతో ఇక ప్రత్యర్థి సంస్థల్లో గుబులు పెరిగింది. ఓ వైపు జియో కస్టమర్లను పెంచుకంటూ 10 కోట్లను క్రాస్ చేసి 20 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్ కంపెనీలు సగానికి పైగా నష్టాలను ప్రకటించాయంటే.. ఆ సంస్థలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో తెలుస్తోంది. రానున్నరోజుల్లో ఈ రంగంలో ఉద్యోగాల విషయానికొస్తే చాలా వరకు తొలగించే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు టెలికామ్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నాయి.

(మన తెలంగాణ/ బిజినెస్ డెస్క్):ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాకతో ప్రత్యర్థి టెలికం కంపెనీల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు టెలికామ్ రంగంలో దూసుకెళ్తున్న ఎయిర్‌టెల్‌తో సహా పలు కంపెనీలు ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. తొలుత జియో ఏడాదికిపైగా సేవలను అందించడంతో ఆయా సంస్థల లాభాలు ఆవిరైపోయాయి. కస్టమర్లూ తగ్గిపోయారు. ఆ తర్వాతి కాలంలోనూ జియో టారీఫ్‌లను భారీగా తగ్గించగా, ఎయిర్‌టెల్, జియో మధ్య ధరల యుద్ధానికి తెర లేచింది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా టెలిసర్వీసెస్, ఎయిర్‌సెల్ వంటి కంపెనీల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. వ్యాపారం లేక ఆదాయం పడిపోగా, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఎయిర్‌టెల్ లాభాలు సగానికి పైగా పడిపోగా.. ఐడియా నష్టాలు మూడింతలు పెరిగాయి.
90 వేల ఉద్యోగాలకు ఎసరు
దేశంలో ప్రతి టెలికామ్ సర్కిల్‌లో ఆపరేటర్ల సంఖ్య పడిపోతూ వస్తోంది. ఈ కారణంగా గత 12 నుంచి 18 నెలల కాలంలో టెలికామ్ రంగంలో వేలాది ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం దాదాపు 10 టెలికామ్ సంస్థలు ఉండేవి.. ఇప్పుడు ఆరు సంస్థలు మాత్రమే కనిపిస్తున్నాయి. రిక్రూట్‌మెంట్ సంస్థ సిఐఇఎల్ హెచ్‌ఆర్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు, మూడు త్రైమాసికాల్లో టెలికామ్ రంగంలో 80 వేల నుంచి 90 వేల మంది ఉద్యోగులపై వేటు పడనుందని వెల్లడించింది. 2017లో టెలికామ్ రంగంలో 40 వేల మంది జాబ్‌లను కోల్పోగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కానుందని తెలిపింది.
రానున్న రోజుల్లో విలీనాలు, స్వాధీనాలు పూర్తవనున్న తరుణంలో మరింతగా ఉద్యోగాల కోతలు ఉంటాయని, కొంత మంది ఆపరేటర్లు ఈ రంగం నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశముందని ఆ సంస్థ తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థ వొడాఫోన్ ఇండియా, మూడో స్థానంలో ఉన్న ఐడియా సెల్యులార్‌లు విలీనం కావడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీ అవతరించనుంది. ఈ విలీనం కారణంగా 5000 మంది ఉపాధి కోల్పోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కూడా టెలినార్ ఇండియా, టాటా టెలిసర్వీసెస్‌లను సొంతం చేసుకునే ప్రక్రియలో ఉంది.
సంప్రదాయంగా ఒక విలీన లేదా స్వాధీన ఒప్పందం ప్రకటన చేశారంటే.. డీల్‌లో చిన్న కంపెనీ ఉద్యోగులు ఇతర కంపెనీల వైపు చూడడం ప్రారంభిస్తారు. అదే సమయంలో జూనియర్ లేదా ప్రారంభ స్థాయి ఉద్యోగులు.. ఈ రంగం నుంచి బయటికి వెళ్లడానికి ఉద్యోగులు తమను తాము రి-స్కిల్లింగ్ ఆప్షన్ వైపు మరలుతారని ఓ టెలికామ్ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. రెండు కంపెనీల విలీనం తుడి ఆమోదం పొందలేదని, ఉద్యోగాల కోత ఊహాగానాలు అంతా ఊహాగానాలేనని విలీనంపై వొడాఫోన్‌కు చెందిన ప్రతినిధి అంటున్నారు. వొడాఫోన్, ఐడియా నాయకత్వ బృందాలు మార్కెట్‌లో పోటీ కొనసాగుతోందని అన్నారు. విలీనం ఒప్పందంలో ఉద్యోగాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
78 శాతం క్షీణించిన ఎయిర్‌టెల్ లాభాలు
క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో ఎయిర్‌టెల్ దారుణంగా నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. నికర లాభం 78 శాతం క్షీణించి రూ.83 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.373.40 కోట్లుగా ఉంది. అలాగే ఇంతకుముందు 2017 క్యూ3లో ఎయిర్‌టెల్ నికర లాభం 305 కోట్లు నమోదైంది. కంపెనీ లాభం ఈసారి భారీగా క్షీణించింది. కృత్రిమంగా అణచివేసిన ధర, అంతర్జాతీయ టర్మినేషనల్ రేట్ల తగ్గింపు అత్యంత దిగువకు చేరిన కారణంగా నష్టాలొచ్చాయని కంపెనీ విమర్శిస్తోంది. కంపెనీ ఆదాయం కూడా 10.48 శాతం తగ్గి రూ.19,634 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.21,934 కోట్లుగా ఉంది.
ఐడియా నష్టం రూ.962 కోట్లు
నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నష్టాలు మూడింతలు పెరిగాయి. సంస్థ నష్టం రూ.962 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఐడియా నష్టం రూ.327 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్ రెవెన్యూ రూ. 6,137 కోట్లతో 24 శాతం క్షీణించింది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా రూ.114 నుంచి రూ.105 తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువగా ఉంది. జియో ఆర్పూ 137 రూపాయలు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ ఆర్పూ రూ.116లుగా ఉంది. ఐడియా సెల్యులార్ నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం.

ఐదేళ్లలో కోటి ఉద్యోగాల సృష్టి

bsns

ఓ వైపు తీవ్ర పోటీ వాతావరణం వల్ల ఉద్యోగాలు పోతాయనే వాదనలు వినిపిస్తుంటే.. మరోవైపు వచ్చే ఐదేండ్లలో కోటి ఉద్యోగాలను టెలికం రంగం సృష్టిస్తుందని టిఎస్‌ఎస్‌సి(టెలికామ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్) అంచనా వేస్తోంది. రిలయన్స్ జియో రాకతో భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి దిగ్గజాల లాభాలు ఆవిరైపోయాయి. మరోవైపు ధరల యుద్ధంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ, ఎయిర్‌సెల్ వంటి సంస్థలు తమ వ్యాపారాలనే మూసివేసే పరిస్థితి వచ్చింది. మరోవైపు పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్నాయి. టెలికాం రంగం లో 40 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐదేండ్లలో ఈ సంఖ్య కోటి 43 లక్షలకు చేరనున్నదని టిఎస్ ఎస్‌సి పేర్కొంటోంది. మెషీన్- టు -మెషీన్ కమ్యూనికేషన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానా లు, టెలికాం తయారీ, మౌలిక, సేవల కంపెనీల నుంచి మున్ముందు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. టెలికాం, టెలికాం తయారీ విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని టెలికాం రంగ టిఎస్‌ఎస్‌సి సిఇఒ ఎస్‌పి కొచ్చర్ ఇటీవల తెలిపారు.