Home ఎడిటోరియల్ బిసిసిఐ సంస్కరణలకు నాంది

బిసిసిఐ సంస్కరణలకు నాంది

Cricket is the most popular sport in the country

దేశంలో అత్యంత ప్రజాదరణగల క్రీడగా అభివృద్ధి చెందిన క్రికెట్‌ను నిర్వహించే బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) లో ప్రవేశించిన పెడధోరణులను సరిదిద్ది, దాని అడ్మినిస్ట్రేషన్‌ను ప్రజాస్వామ్య యుతం, పారదర్శకంగావించేందుకు లైన్‌క్లియర్ అయింది. సుప్రీంకోర్టు నియామకంపై రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ రూపొందించిన బిసిసిఐ నియమావళి సంస్కరణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించిన త్రిసభ్య ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంది. బిసిసిఐ అడ్మినిస్ట్రేషన్‌లో వ్యక్తుల స్వార్థపరత్వాన్ని అరికట్టే దృష్టితో లోధా కమిటీ చేసిన సిఫారసులు కొన్నింటిని ధర్మాసనం సడలించినప్పటికీ మొత్తం మీద వాటి సారాంశాన్ని కొనసాగించింది.

2016 జులై 18న సుప్రీంకోర్టు ఆమోదించిన సంస్కరణలనే ఇప్పుడు నీరుగార్చటం పట్ల జస్టిస్ లోధా ఆశాభంగం వ్యక్తం చేశారు. అయినా ఈ సంస్కరణలు ఇతర క్రీడా సంస్థలకు మార్గదర్శకమైతే తానెంతో సంతోషిస్తానన్నారు. “ఈ సంస్కరణలు సుపరిపాలన తెస్తాయి, పారదర్శకతను, జవాబుదారీ తునాన్ని పెంచుతాయి. బిసిసిఐ ఇంకెంత మాత్రం గతంలోలాగా పని చేయజాలదు. కొత్త నిబంధనావళి అమలులోకి రాగానే బిసిసిఐ దాని ప్రకారం పని చేయకతప్పదు” అన్నారు లోధా. సుప్రీంకోర్టు సవరించిన రూపంలో లోధా కమిటీ సిపారసుల కనుగుణంగా బిసిసిఐ జనరల్ బాడీ కొత్త నిబంధనావళిని ఆమోదించాలి, రాష్ట్ర కమిటీలు పాటించాలి.

లోధా కమిటీ సిఫారసుల్లో ముఖ్యాంశాలు: 1) ఒక రాష్ట్రం, ఒక ఓటు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో చారిత్రకంగా ఒకటికన్నా హెచ్చు క్రికెట్ సంఘాలున్నాయి. అందువల్ల సుప్రీంకోర్టు వాటికి గతంలో ఉన్నట్లే పూర్తి సభ్యత్వం అంగీకరించింది. 2) రాష్ట్ర ప్రతిపత్తి లేని అసోసియేషన్‌లకు పూర్తి సభ్యత్వం ఉండరాదు. అయితే సర్వీసెస్, రైల్వేస్, భారత యూనివర్శిటీల అసోసియేషన్‌కు సుప్రీంకోర్టు పూర్తి సభ్యత్వం ఇచ్చింది. 3) ఆఫీసు బేరర్లకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనగా బిసిసిఐ, రాష్ట్ర అసోసియేషన్‌ల ఆఫీసు బేరర్లు మూడేళ్ల పదవీకాలం తదుపరి మళ్లీ ఎన్నిక కాకుండా మూడేళ్ల విరామం తీసుకోవాలని లోధా కమిటీ సిఫారసు చేయగా సుప్రీంకోర్టు దాన్ని వరుసగా రెండు పదవీ కాలాలకు పెంచింది. అయితే రాష్ట్ర అసోసియేషన్, బిసిసిఐలో నిర్వహించే పదవీ కాలాలను కలిపి చూడాలి. 4) బిసిసిఐలో, రాష్ట్ర స్థాయిలో కలిపి మొత్తం 9 సంవత్సరాలకు మించి ఎవరూ పదవిలో ఉండరాదన్న లోధా కమిటీ సిఫారసుపై, గరిష్ట వయో పరిమితిని 70 ఏళ్లుగా నిర్ణయించటంపై సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

ఒక రాష్ట్రం ఒక ఓటు అనే లోధా కమిటీ సిఫారసు ప్రధాన లక్షం ఓట్లను ప్రాంతం వారీ కూడగట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసే పద్ధతిని నివారించటం. ఉదాహరణకు మహారాష్ట్రలో మహారాష్ట్ర, ముంబయి, విదర్బ క్రికెట్ అసోసియేషన్‌లు, గుజరాత్‌లో సౌరాష్ట్ర, బరోడా, గుజరాత్ అసోసియేషన్ లున్నాయి. అయితే వాటికున్న చారిత్రక నేపధ్యం దృష్టా వాటిని పూర్తిస్థాయి సభ్యులుగా కొనసాగించాలని సుప్రీంకోర్టు భావించింది. కొందరు వ్యక్తులు బిసిసిఐలో తిష్టవేసుకుని దాన్ని సొంత సామ్రాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నందునే పదవీ కాలాన్ని పరిమితం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ముఖ్యంగా ఈ రెండు సిఫారసులను గట్టిగా వ్యతిరేకించిన పాత ఆఫీసు బేరర్లు, అసోసియేషన్‌లను కూడగట్టి జనరల్ బాడీ సమా వేశాన్ని రసాభాస చేశారు.

‘ఒక ఆఫీసు బేరర్ తన పదవీకాలాన్ని తనకు తాను సంపద కూడబెట్టుకునే అవకాశంగా పరిగణించరాదు. లోథా కమిటీ గట్టిగా విమర్శించింది దీన్నే. ఆ విమర్శకు సమర్థనీయమైన కారణాలున్నాయి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రెండేళ్ల క్రితం తాము ఆమోదించిన సిఫారసుల నుంచే సుప్రీంకోర్టు వెనక్కి వెళ్లటం తిరోగమనంగా కనిపించినప్పటికీ క్రికెట్ క్రీడ నిర్వహణను మెరుగుపరిచేందుకు వాస్తవిక దృష్టితో వ్యవహరించిందనవచ్చు. ఈ సిఫారసులు అమలు జరిగితే అదే అడ్మినిస్ట్రేషన్‌లో పెద్ద మార్పు. ఇతర జాతీయ క్రీడా సంఘాలు వీటిని అనుసరిస్తే వాటి నిర్వహణ కూడా మెరుగుపడుతుంది.