Home లైఫ్ స్టైల్ మహా పరివర్తనం

మహా పరివర్తనం

క్షణికావేశంలో నేరం చేసి కొందరు… చేయని తప్పుకు శిక్ష అనుభవించినవారు మరికొందరు… జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన వారికి మనుగడ కష్టమే… గౌరవంగా జీవించాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉండవు… ఉన్నా సరైన జీతభత్యాలుండవు.. ముఖ్యంగా మహిళా ఖైదీల పరిస్థితి చెప్పనలివికాదు… ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సత్ప్రవర్తనతో విడుదలైన మహిళా ఖైదీలకు ఉపాధి కల్పించడం కోసం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ ప్రవేశపెట్టిన మహా పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా  ఏర్పాటు చేసిందే  చంచల్‌గూడలోని ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ పెట్రోల్ బంక్. 

Women-Criminals

దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విడుదలైన మహిళా ఖైదీలతో పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ మరో మైలురాయిని సాధించింది. శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన 25 మంది మహిళలకు పునరావాసం కల్పించేలా జైళ్ల శాఖ ఆలోచించడం అభినందనీయం. నేరాలు చేసిన వారిని మార్చేందుకు శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది కృషితో తిరిగి నేరాలు చేసి జైలుకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. 2020 నాటికి జైళ్లశాఖ ఉత్పత్తులు రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించేలా లక్షంగా పెట్టుకుంది. అధికారుల పర్య వేక్షణలో సత్ప్రవర్తన కలి గిన ఖైదీలు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా జైళ్ల శాఖ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఖైదీలకు జీవనోపాధి కల్పిస్తోంది. బంక్‌లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.12,000 వేల వేతనం ఇస్తోంది. బంక్ ద్వారా వచ్చే లాభాన్ని తిరిగి వారి సంక్షేమానికే వినియోగించనున్నారు. ఇక్కడి మహిళా సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. విడుదలైన ఈ ఖైదీలకు పెట్రోల్ బంక్‌లో ఎలా పనిచేయాలో శిక్షణ ఇప్పించారు స్పెషల్ ప్రిజన్ ఫర్ విమన్ సూపరింటెండెంట్ బషీరాబేగం. సంపాదించిన డబ్బును ఏరోజు కారోజు పైఅధికారికి జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇక్కడి ఉద్యోగులు ఉండేదెక్కడ… చాలా మటుకు హైదరాబాద్ వాళ్లున్నారు. జిల్లాల వాళ్లు కూడా ఉన్నారు. కానీ నలుగురైదుగురు కలిసి ఓ గదిలో ఉండేట్లుగా ఏర్పాటు చేయమని జైళ్ల శాఖను కోరారు మహిళలు. పెట్రోల్ బంక్ దగ్గరలోనే వచ్చి వెళ్లడానికి సులభంగా ఉండేట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. వారి వారి కుంటుంబాలతో ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నారు.
శిక్షణలో మెళకువలు
పెట్రోల్ బంక్‌లో పనిచేసే మహిళలందరికీ పదిరోజులుగా పెట్రోల్ బంక్‌లోని మీటర్ ఆపరేటింగ్ పనితీరు గురించి నిపుణుల చేత అవగాహన ఇప్పించారు జైలు శాఖ అధికారులు. వినియోగదారులతో ఎలా ప్రవర్తించాలి, దురుసుగా ప్రవర్తించేవారితో ఎలా నడుచుకోవాలి, డబ్బులు తీసుకోవడం, బిల్లింగ్, స్వైపింగ్ తదితర విషయాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.

అమ్మ అవకాశం ఇచ్చింది : 

యాసిడ్ దాడి కేసులో జీవితకాలం శిక్ష పడింది. సత్ప్రవర్తన కింద ఆరేళ్లకే బయటకు వచ్చాను. బషీరమ్మ తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. జైలులో నాకు మంచి కుటుంబం దొరికింది. అమ్మ నాకు మంచి అవకాశం ఇప్పించింది. జైలు వాళ్లకు నేను రుణపడి ఉంటాను.

– ఇందురాణి

కష్టాలు తీరాయి.. : 

భర్తను హత్య చేశానన్న ఆరోపణతో 2010లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆరేళ్లు జైలులో ఉన్నాను. జైలు అధికారులు నా ఇద్దరు పిల్లల్ని సంక్షేమ వసతిగృహంలో చేర్పించారు. ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివిస్తున్నారు. నా ప్రవర్తన బాగుందనే కారణంతో ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. రిలీజయ్యాను. పదోతరగతి వరకు చదువుకున్నాను. జైలులోనే డిగ్రీ పూర్తిచేశాను. బయట ఆరువేల జీతంతో ఉద్యోగంలో చేరాను. సరిపోయేది కాదు. బషీరా మేడంకు నా బాధ చెప్పుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు. బయట నాగురించి తెలిసుకున్నవారెవ్వరూ నాకు పనిఇవ్వలేదు. చాలా కష్టాలు పడ్డాను. ఓ హోటల్‌లో క్లీనర్‌గా పనిచేసేదాన్ని. వచ్చే ఆరువేలతో నా బిడ్డలను చదివించుకునేదాన్ని. పదిరోజుల క్రితం మేడం నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ రు. 12వేల జీతం ఇస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది.

– గోదావరి

మళ్లీ నేరాలు చేయకుండా…

వికె సింగ్ సార్ మహాపరివర్తన్ కింద ఉమెన్ ఖైదీలకు పెట్రోల్ బంక్‌లు పెట్టించారు. వాళ్లు తిరిగి నేరాలు చేయకుండా ఉండటానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రిలీజైన ఖైదీలకు కౌన్సెలింగ్ ఇచ్చాం. మహిళల చేతిలో లక్షల డబ్బులు ఉంటాయి… చాలా జాగ్రత్తగా వారికి అన్ని చెప్పాల్సి వచ్చింది. రిలీజైన ఖైదీల రిజిస్టరు ఉంటుంది. దాంట్లో అందరి పేర్లు ఉంటాయి. ఎవరికైతే ఉద్యోగం అవసరమో వాళ్ల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వాళ్లకు ఫోన్ చేసి తెలపగానే ఉత్సాహంతో మా దగ్గరకు వచ్చారు. ట్రైనింగ్ పీరియడ్ నుంచి జీతం ఇస్తున్నాం. మూడు పద్ధతుల్లో మూడు సార్లు పిలిపించాం.. కుటుంబంతో సహా వచ్చారు. బయట అంత జీతం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ ఉద్యోగం నుంచి తీయడం అనేది ఉండదు. క్రమశిక్షణ, సెక్యూరిటీ ఉంటుంది. చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. మంచి స్పందన వచ్చింది.

– బషీరాబేగం, జైలు సూపరింటెండెంట్