Home ఖమ్మం పైసా వసూల్!

పైసా వసూల్!

Criticism of the task force

కుదిరితే ఓకే.. లేదంటే కేసే!
టాస్క్‌ఫోర్స్ తీరుపై విమర్శలు
పోలీసుల్లోనూ భిన్న స్వరాలు
సమన్వయలోపంతో గాఢి తప్పుతున్న లక్షం
టాస్క్‌ఫోర్స్… అంతుచిక్కని నేరాలను ఛేదిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతోంది. లా అండ్ ఆర్డర్ పోలీసులకు తెలియని విషయాలు వెలుగులోకి తెస్తోంది. ‘కల్తీ’గాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోకోణం వేరే ఉందని విమర్శ వినిపిస్తోంది. కమిషనరేట్ పరిధిలోని ప్రతి అక్రమంలో పైసా వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఉత్తమ అధికారులు ఉన్నప్పటికీ కొందరి తీరు టాస్క్‌ఫోర్స్‌ను అభాసుపాలు చేస్తోంది.
 

మన తెలంగాణ/ ఖమ్మం క్రైం: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎసిపి, ఇద్దరు సిఐలు, ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐతోపాటు పదిమంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. గతేడాది కాలంలో టాస్క్‌ఫోర్స్ చేసిన దాడులెన్నో..! వెలుగులోకి తీసుకొచ్చిన అక్రమాలు మరెన్నో..!! అయితే టాస్క్‌ఫోర్స్‌కు తెలిసి కూడా బయటికి రానివి కొన్ని ఉన్నాయనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఆ శాఖను సమన్వయం చేసే అధికారి తీరు విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల దాడులకు వెళ్లే క్రమంలో టాస్క్‌ఫోర్స్ తీరు ఆ స్టేషన్ పరిధిలోని పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎస్‌హెచ్‌ఒలు కాస్త గుర్రుగా కూడా ఉన్నట్టు సమాచారం.

సంవత్సర కాలంలో…
గతేడాది మే నుంచి ఈ సంవత్సరం మే నెల వరకూ టాస్క్‌ఫోర్స్ చేసిన దాడుల్లో గుట్కా మొదలుకొని గంజాయి వరకూ అన్నీ ఉన్నాయి. గుట్కా పట్టివేతను పరిశీలిస్తే… తొమ్మిది వాహనాలతోపాటు రూ.97,55,460 విలువైన గుట్కాలను సీజ్ చేశారు. దీనితోపాటు 1,433 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 47 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి విషయానికొస్తే… రూ.1,46,60,000 కోట్ల విలువైన సరుకును సీజ్ చేసి సంబంధిత సెక్షన్ల((క్రైం నంబర్: 340/2017 యు/ఎస్. 20(బి) ఎన్‌డిబిఎస్ యాక్ట్ కామేపల్లి),( క్రైం నంబర్: 258/2017 యు/ఎస్. 20(బి) ఎన్‌డిబిఎస్ యాక్ట్ ఖమ్మం వన్‌టౌన్), (క్రైం నంబర్: 139/2018 యు/ఎస్. 20(బి) ఎన్‌డిబిఎస్ యాక్ట్ ఖమ్మం రూరల్)పై కేసులు నమోదు చేశారు. 2018 జనవరి నుంచి చూస్తే గ్యాంబ్లింగ్ కేసుల్లో 34 మందిని అరెస్ట్ చేసి 9 వాహనాలు సీజ్ చేశారు. 29 మొబైల్ ఫోన్లు, రూ.95,400 స్వాధీనం చేసుకున్నారు. 1070 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని 59 వాహనాలు సీజ్ చేసి, 33 మందిపై కేసులు నమోదు చేశారు.

లెక్కల్లో అంకెల గారఢీ…
పైన చెప్పిన లెక్కలన్నీ పరిశీలిస్తే సగటు మనిషికి సైతం సందేహం కలుగక మానదు. లిక్కర్ దందా ఎక్కువగా జరుగుతున్నప్పటికీ వాటిపై దాడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వందల కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ లక్షల్లోనే రికవరీలు చూపించడం హాస్యాస్పదం. దీనితోపాటు ఇసుక అక్రమాలను అరికట్టడంలోనూ టాస్క్‌ఫోర్స్ తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక ప్రధానంగా జిల్లా నుంచే తరలిపోతున్నప్పటికీ కేవలం 59 వాహనాలే సీజ్ చేయడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్ కోట్లలో జరుగుతున్నప్పటికీ ఒక్క కేసూ నమోదు చేయకపోవడం దారుణం. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వరకూ అందరూ క్రికెట్ బెట్టింగ్ గురించి చర్చించుకుంటున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం సందేహాలు కలిగిస్తోంది.

లా అండ్ ఆర్డర్‌తో లొల్లి…
టాస్క్‌ఫోర్స్‌కు కొన్ని విశిష్టమైన అధికారాలు ఇవ్వడంతో లా అండ్ ఆర్డర్‌కు తలనొప్పిగా మారింది. కనీస సమచారం ఇవ్వకుండా ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దాడులు చేయడం, విచారణ అనంతరం మొక్కుబడిగా ఎస్‌హెచ్‌ఒలకు అప్పచెప్పడం సరైంది కాదనే వాదన విని పిస్తోంది. కేసులు నమోదు చేయాల్సింది లా అండ్ ఆర్డర్ పోలీసులే కావున విచారణ సైతం వారికే అప్పగిస్తే కేసుకు బలం చేకూరుతుందని కొందరు ఎస్‌హెచ్‌ఒలు బహి రంగంగానే చెబుతున్నారు. టాస్క్‌ఫోర్స్ నేరుగా సిపితోనే సమన్వయంతో ఉండడంతో ఎస్‌హెచ్‌ఒల ప్రాధాన్యం త గ్గుతోందనే భావన ఉంది. సదుద్దేశంతో టాస్క్‌ఫోర్స్‌ను నెలకొల్పినప్పటికీ సమన్వయలోపంతో లక్షం నీరుగారి పోతోందనే విమర్శ ఉంది. లా అండ్ ఆర్డర్‌తో టాస్క్‌ఫోర్స్ ను సమన్వయం చేస్తే తప్ప వ్యవస్థ గాఢిలో పడడం కష్టమ నే భావన పోలీసు శాఖలోనే నెలకొంది. అసాంఘిక కార్య కలాపాలు, కల్తీ ఆహార పదార్థాలు, జూదం, గుట్కా, మ ట్కా వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన టాస్క్‌ఫోర్స్ పైసా వసూల్‌కు పాల్పడుతోందనే అపకీర్తిని మూటగట్టుకుంది. పోలీస్ బాస్ దృష్టి సారించి టాస్క్‌ఫోర్స్‌కు అంటిన ఆ మ రకను చెరిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.