Home తాజా వార్తలు పతనావస్థలో కంగారూలు

పతనావస్థలో కంగారూలు

ausis

మెల్‌బోర్న్: కొంత కాలం క్రితం వరకు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం పతనావస్థలో కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహానికి గురైంది. బాల్ టాంపరింగ్ వ్యవహారం తర్వాత ఆస్ట్రేలియా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ కోలుకోలేక పోయింది. బాల్ టాంపరింగ్ ప్రభావం జట్టుపై భారీగానే పడింది. కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు నిషేధం వల్ల జాతీయ జట్టుకు దూరం కావడంతో ఆస్ట్రేలియా చాలా బలహీనంగా మారింది. స్టార్ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న స్మిత్, వార్నర్‌లులేని లోటు జట్టును వెంటాడుతోంది. ముఖ్యంగా టాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టు తీవ్ర ఒత్తిడికి గురైంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా వరుస ఓటములు జట్టును వెంటాడుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలతో సిరీస్‌ను కోల్పోయింది. మూడో వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా 481 పరుగుల భారీ స్కోరును సాధించి ఆస్ట్రేలియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 242 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఇది అత్యంత ఘోర పరాజయంగా చెప్పవచ్చు. అంతేగాక వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 34 ఏళ్ల తర్వాత ఆరో స్థానానికి పడిపోయింది. దశాబ్దం క్రితం వరకు ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం వరుస ఓటములతో దిక్కుతోచని స్థితికి చేరింది. హేడెన్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, షేన్ వార్న్, క్లార్క్, హసి, మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, వాట్సన్ తదితరులు ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకే ఎదురే ఉండేది కాదు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైన ఆస్ట్రేలియా విజయపరంపరకు అడ్డుకట్టు ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం తీరు మారింది. స్వదేశంలో కూడా ఆస్ట్రేలియాకు విజయాలు కష్టంగా మారాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడించడం ఆస్ట్రేలియాకు శక్తికి మించిన పనిగా మారింది. ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా ఆత్మవిశ్వాసం లోపించడంతో ఆస్ట్రేలియాకు ఓటములు తప్పడం లేదు. జట్టులో ఉత్సాహాన్ని నింపి మళ్లీ విజయాల బాట పట్టించే సారథి అవస రం జట్టుకు ఎంతో ఉంది. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టిమ్ పైన్‌కు ఆ సత్తా ఉన్నట్టు కనిపించడం లేదు. అతన్ని తప్పించి ఇతర ఆటగాళ్లకు సారథ్య బాద్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. అరోన్ ఫించ్‌కు కెప్టెన్సీ అప్పగిస్తే జట్టుకు కాస్త ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది.
మాజీ క్రికెటర్ల ఫైర్..
మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్, మైక్ హసి తదితరులు విమర్శలు గుప్పించారు. జట్టు పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా మారుతున్నా బోర్డులో చలనం లేక పోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 481 పరుగులు ఇచ్చుకోవడాన్ని మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేగాక వన్డేల్లో ఆరో ర్యాంక్ కు పడిపోవడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న దిద్దుబాటలు చర్యలు తీసుకోవడంలో క్రికెట్ ఆస్ట్రేలియా విఫలమైందని వార్న్, క్లార్క్‌లు విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో విండీస్‌గా మారే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. జట్టుపై బాల్ టాంపరింగ్ ఒత్తిడి తీవ్రంగా కనిపిస్తోందని వారన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో క్రికెటర్లలో ఆందోళన నెలకొందని, దీని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.