Home ఆఫ్ బీట్ పడిలేచిన కెరటం

పడిలేచిన కెరటం

క్రొయేషియా గురించి..

రాజధాని: జాగ్రెట్
అధికారిక భాష: క్రొయేషియన్
మతం: క్రైస్తవం (91శాతం)
జనాభా: 41,63,968 (2017,అధికారిక
గణాంకాల ప్రకారం)
జన సాంద్రత: చ.కి.మీటరుకు 74 మంది
వైశాల్యం: 55, 960 చ.కి.మీ.లు
పట్టణ జనాభా: 60 శాతం
తలసరి ఆదాయం: 14,788 డాలర్లు
జిడిపి: 61.056 బిలియన్ డాలర్లు
కరెన్సి: కునా
ప్రభుత్వం: ఏక జాతీయ పార్లమెంట్
అధ్యక్షురాలు: కొలిండా గ్రాబార్ కిటరోవిక్
ప్రధాన మంత్రి: ఆండ్రిజ్ ప్లంకొవిక్
ప్రధాన క్రీడలు: ఫుట్‌బాల్, టెన్నిస్

క్రొయేషియా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశం పేరు మార్మోగి పోతోంది. రష్యా వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్రొయేషియా జట్టు కనబరిచిన ప్రదర్శనే దీనికి కారణం. క్రొయేషియా అంటే తెలియని వారు కూడా ఆ దేశం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హేమాహేమీ జట్లను సైతం మట్టికరిపించి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా క్రొయేషియా జట్టు పెను ప్రకంపనలే సృష్టించింది. పట్టుమని 45 లక్షల జనాభా కూడా లేని పసికూన దేశం అసాధారణ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు కూడా ఆ దేశం గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో విజయం సాధించిన వెంటనే క్రొయేషియా గురించి తెలుసుకువాలనే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఫైనల్ చేరిన తర్వాత నెటిజన్లు ఎక్కువగా అన్వేషిస్తున్నది క్రొయేషియా గురించే కావడం విశేషం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న దేశాల్లో క్రొయేషియా కూడా ఒకటి. యూరప్‌లోని చిన్న దేశాల్లో ఒకటిగా క్రొయేషియాను పరిగణిస్తున్నారు. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ జట్టు అసాధారణ ఆటను కనబరచడంతో క్రొయేషియా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ దేశం గురించి కొన్ని వివరాలను మనం కూడా తెలుసుకుందాం..

Crotia

ఐరోపా సమాజంలో క్రొయేషియన్లకు ఎంతో పురాతన, చారిత్రక నేపథ్యం ఉంది. ఇతర దేశాల మాదిరిగానే క్రొయేషిన్లు కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆరో శతాబ్దం నుంచి మొదలుకుని 14వ శతాబ్దం వరకు క్రొయేషియన్ల సామ్రాజ్యం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. 1527లో ఒట్టోమస్ చక్రవర్తుల అక్రమణల నేపథ్యంలో క్రొయేషియా తమ అధినేతగా ఫెర్డినాండ్‌ను ఎన్నుకుంది. అప్పటి నుంచి ఫెర్డినాండ్ ప్రత్యేక పార్లమెంట్‌ను ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించాడు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సెర్బ్‌లు, స్లోవియన్లతో కలిసి క్రొయేషిన్లు యుగోస్లోవియా రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు.

సొంతంగా దేశం ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్షల నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో 1329లో రాజుగా ఉన్న అలెగ్జాండర్ పార్లమెంట్‌ను రద్దు చేసి నియంతృత్వ పాలన సాగించాడు. ఇదిలావుండగా 1941, ఏప్రిల్ 6న జర్మనీ నేతృత్వంలో దళాలు దాడిచేసి క్రొయేషియా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ క్రమంలో ఫాసిస్టు నాయకుడు ఉస్టేన్ ఆధ్వర్యంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగించాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టిటో నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అతని రాజ్యంలో ప్రజలు ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నారు. 1980లో టిటో కన్ను మూశాడు. కాగా, 1989 నాటికి తూర్పు ఐరోపాలోని పలు దేశాల్లో కమ్యూనిస్టు పాలన అంతమైంది. 1991లో క్రొయేషియన్లు ప్రకటించుకున్నారు. అయితే సరిహద్దుల్లో నివసిస్తున్న సెర్బ్‌ల రక్షణ పేరిట యుగోస్లోవియా సైన్యం క్రొయేషియాలోకి చొచ్చుకు వచ్చింది. ఇది సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది. కాగా, 1990 జనవరి 15న క్రొయేషియాను ఐరోపా మండలి గుర్తించింది. ఎర్తుట్ ఒప్పందం వల్ల 1995లో యుగోస్లోవియాతో యుద్ధం ముగిసింది. దీంతో 1998 వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న తూర్పు స్లోవేనియాను క్రొయేషియన్లకు ఐక్యరాజ్య సమితి అప్పగించింది. 2009లో నాటో, 2013లో ఐరోపా మండలిలో క్రొయేషియా చేరింది.

సవాళ్లను అధిగమిస్తూ..

మరోవైపు సుదీర్ఘ యుద్ధం వల్ల క్రొయేషియా ప్రజలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనక తప్పలేదు. ఆ ఛాయలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా క్రొయేషియా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వలసలు వారికి పెద్ద సమస్యగా మారాయి. అంతేగాక దేశంలో నిరుద్యోగం పెరిగి పోయింది. దేశ యువతలో 43 శాతం మంది నిరుద్యోగులే. నిరుద్యోగ సమస్య క్రొయేషియాను పట్టి పీడిస్తోంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన కమ్యూనిస్టు పాలన ఒకవైపు, యుగోస్లోవియాతో జరిగిన యుద్ధం మరోవైపు క్రొయేషియాన్ల ఆర్థిక పరిస్థితిని దారుణంగా దిగజార్చాయి. ఇప్పడిప్పుడే దేశంలో పెట్టుబడుల విధానం ప్రారంభమైంది. చాలా దేశాలు క్రొయేషియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, కౌన్సిల్ ఆఫ్ యూరప్, నాటో, డబ్యూటివోలలో సభ్య దేశంగా క్రొయేషియా చేరడంతో పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

Croatia-Fance

ఇతర యూరప్ దేశాలకు దీటుగా క్రొయేషియా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. క్రమంక్రమంగా ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతి దిశగా అడుగులు వేస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. సేవా రంగంలో కూడా క్రొయేషియా మంచి పురోగతి సాధించింది. క్రొయేషియా ఆర్థిక అభివృద్ధిలో పర్యాటకం ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రపంచంలో అత్యధిక పర్యాటకులు సందర్శించే టాప్20 దేశాల్లో క్రొయేషియా కూడా ఒకటిగా నిలిచింది. యువత కూడా ఇప్పుడిప్పుడే ఉపాధి రంగంలో నిలదొక్కుకుంటుంది. రానున్న దశాబ్ద కాలంలో క్రొయేషియా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐరాస ఇటీవల నిర్వహించిన ఆధ్యయనంలో తేలింది.

అద్వితీయం..చిరస్మరణీయం..

రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో పసికూన క్రొయేషియా జట్టు ప్రదర్శన అద్వితీయం..చిరస్మరణీయం..ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రొయేషియా ఏకంగా ఫైనల్‌కు చేరి ప్రపంచ ఫుట్‌బాల్‌లో పెను సంచలనమే సృష్టించింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌లో బలమైన జట్టుగా ఎదిగింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఓడినా క్రొయేషియా అభిమానుల దృష్టిలో నిజమైన విజేతగా నిలిచింది. స్వాతంత్య్రం పొందిన కొన్నేళ్లలోనే ప్రపంచ ఫుట్‌బాల్‌లో క్రొయేషియా అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటిగా అవతరించింది. 1998లో ఒకసారి సెమీ ఫైనల్‌కు చేరిన క్రొయేషియా ఈసారి ఏకంగా ఫైనల్లో ప్రవేశించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండు దశాబ్దాల క్రితం క్రొయేషియాలో పరిస్థితి దయనీయంగా ఉండేది.

యుగోస్లోవియాతో స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం నేపథ్యంలో క్రొయేషియాలో అల్లకల్లోల పరిస్థితి ఉండేది. ఎటు నుంచి బాంబు వచ్చి మీద పడుతుందో తెలియదు..అను క్షణం సైన్యం నుంచి ప్రాణాలకు భయం పొంచి ఉండేది…వారి చేతికి చిక్కితే ప్రాణాలకే ప్రమాదం. చీకట్లో ఉన్నా..వెలుతురులో ఉన్నా భయం వీడేది కాదు.. ఈ భయంతో ఛ స్తూ..బతుకుతూ క్రొయేషియన్లు కాలం వెళ్లదీస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడారు. అంతర్యుద్ధంతో క్రొయేషియా రణరంగంగా మారింది. అలాంటి నేపథ్యంలో బాల్యాన్ని గడిపిన కుర్రాళ్లు రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో ఆకట్టుకున్నారు. అసాధారణ ఆటతో ప్రపంచ దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. బతకాలంటే ఫుట్‌బాల్ ఒక్కటే మార్గమని భావించిన యువ ఆటగాళ్లు బాల్యం నుంచే సర్వం ఒడ్డారు. ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుంటూ దృఢ సంకల్పంతో లక్షం దిశగా అడుగులు వేశారు. అనేక కష్టనష్టాలను సైతం ఓర్చుకుంటూ ముందుకు సాగారు. గుండెల నిండ ఆత్మవిశ్వాసం..ఏదో సాధించాలనే తపన..కసి వారిని మేటి ఫుట్‌బాల్ ఆటగాళ్లుగా తీర్చి దిద్దింది. ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన వెంటనే క్రొయేషియా ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అందరిని కలచి వేసింది. ఆ కన్నీళ్ల వెనక అంతులేని విషాదం ఉంది.

తాము ఈ స్థాయికి చేరడంలో అలుపు ఎరగని శ్రమ దాగివుంది. నాకౌట్‌కు చేరడమే గొప్ప అని భావించిన జట్టు ఏకంగా ఫైనల్‌కు చేరి పెను ప్రకంపకనలే సృష్టించింది. హేమాహేమీ జట్లే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో ఏమాత్రం అంచనాలు లేని క్రొయేషియా అసాధారణ పోరాట పటిమతో ఫైనల్‌కు చేరడం అద్వితీయం. అకుంఠిత దీక్ష, అబ్బుర పరిచే నైపుణ్యం, కఠోర శ్రమ వల్లే క్రొయేషియా ఈ స్థాయికి ఎదిగిందని చెప్పాలి. బాల్యంలోనే కఠిన పరిస్థితులు ఎదుర్కొని జీవన పోరాటంలో విజయం సాధించిన నేపథ్యమే వీరిని ఈ స్థాయికి చేర్చింది. ప్రస్తుతం క్రొయేషియా జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు బాల్యంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపారు. కెప్టెన్ మోడ్రిచ్, డిఫెండర్ డీజన్ లోరెస్, బ్రోజొవిచ్, ఇవాన్ పెరిసిచ్ తదితరులు అల్లకల్లోల వాతావరణంలోనే పెరిగారు. తీవ్ర ప్రతికూల వాతావరణంలో సైతం వీరు పట్టుదలతో ఆడుతూ ఫుట్‌బాల్‌లో ఓనమాలు దిద్దుకున్నారు. చివరికి ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదిగారు.

ఓడినా మనసులు గెలిచారు..

ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో క్రొయేషియా ఫైనల్లో ఓడినా కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకొంది. ప్రపంచకప్ బరిలోకి దిగినప్పుడూ క్రొయేషియాపై ఎవరికి పెద్దగా ఆశలు లేవు. అయితే లీగ్ దశ నుంచే క్రొయేషియా అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. పటిష్టమైన అర్జెంటీనాను 30 తేడాతో చిత్తు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అర్జెంటీనాపై గెలవడంతో ఒక్క సారిగా క్రొయేషియా వార్తల్లో నిలిచింది. ఐస్‌లాండ్, నైజిరీయాలతో జరిగిన మ్యాచుల్లోనూ క్రొయేషియా జయభేరి మోగించింది.

దీంతో గ్రూప్‌లో క్రొయేషియా మూడు విజయాలతో అజేయంగా నిలిచ నాకౌట్‌కు చేరింది. నాకౌట్‌లోనూ క్రొయేషియా అద్భుతంగా ఆడింది. బలమైన డెన్మార్క్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా జయభేరి మోగించింది. పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా విజయం సాధించింది. అంతేగాక ఆతిథ్య రష్యాతో జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ సమరంలోనూ క్రొయేషియా విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రష్యా నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైనా చివరి వరకు ఆత్మవిశ్వాసాన్ని కనబరిచిన క్రొయేషియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించి పెను ప్రకంపనలే సృష్టించింది. ఓడిపోయే స్థితి నుంచి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకొచ్చింది. చిరస్మరణీయ పోరాట పటిమను కనబరిచిన క్రొయేషియా 21తో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది.

లీగ్ దశ దాటడమే గొప్ప అని భావించిన క్రొయేషియా ఏకంగా ఫైనల్‌కు చేరి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెజిల్, స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, అర్జెంటీనా, బెల్జియం వంటి పటిష్ట జట్లు సాధించని ఘనతను క్రొయేషియా దక్కించుకుంది. ఫైనల్లోనూ క్రొయేషియా అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌కు చివరి వరకు ముచ్చెమటలు పట్టించింది. అయితే అనుభవలేమి వల్ల ఫైనల్లో క్రొయేషియాకు ఓటమి తప్పలేదు. కానీ, ఫైనల్లో ఓడినా నిజమైన విజేతగా క్రొయేషియాకే అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు క్రొయేషియాకు మద్దతుగా నిలిచారు. భారత్‌తో సహా చాలా దేశాల అభిమానులు క్రొయేషియా విజేతగా నిలువాలని కోరుకున్నారు. చివరికి ఫ్రాన్స్‌లో కూడా కొంత మంది క్రొయేషియాకు మద్దతుగా నిలిచారంటే ఆ జట్టుకు లభించిన ఆదరణ ఊహించుకోవచ్చు. క్రొయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబార్ కిటరోవిక్ నాకౌట్ మ్యాచ్‌లకు స్వయంగా వీక్షించారు. అధ్యక్షురాలనే విషయాన్ని పక్కన బెట్టి కొలిండా సాధారణ ప్రేక్షకురాలుగా జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ కప్టెన్ మోడ్రిచ్ అసాధారణ పోరాట పటిమతో జట్టును విజయ పథంలో నడిపించాడు. ఏకంగా నాలుగు గోల్స్ కొట్టిన మోడ్రిచ్ గోల్డెన్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. సమష్టి పోరాటంతో అసాధారణ ఆటను కనబరిచిన క్రొయేషియా ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన జట్టుగా నిలిచింది. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పక తప్పదు.

సయ్యద్ కరీం అహ్మద్, స్పోర్ట్ డెస్క్