Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) నిర్ణీత గడువులోగా పంట రుణాలు: కలెక్టర్

నిర్ణీత గడువులోగా పంట రుణాలు: కలెక్టర్

 Crop loans for the farmers in due time

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా:  రైతులకు నిర్ణీత గడువులోగా పంట రుణాలను అంద జేయ డంలో బ్యాంకులు శ్రద్ద వహించాలని కలెక్టర్ యంవి రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. 2018,19 సంవత్సరానికి గాను రూ.10,023 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను మల్కాజిగిరి ఎంపి సీహెచ్.మల్లారెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమ, పశు సంవర్ధక అభివృద్ది, స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయ, ఉధ్యాన, ఇతర అనుబంధ పరిశ్రమలు, తదితర రంగాలలో పెట్టుబడులకు అస్కారం ఉన్నందున బ్యాంకర్ల పాత్ర కీలకమని అన్నారు. వార్షిక రుణ ప్రణాళికను అమలు పరిచే బాధ్యత బ్యాంకర్లకే ఉందన్నారు. 2018, 19కి గాను పంట రుణాలకు రూ.188 కోట్లు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.520 కోట్లతో మొత్తంగా రూ.708 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగిందన్నారు. పంట రుణాల రెన్యూవల్, కొత్త రైతులను, స్వయం సహయక రంగాలను గుర్తించి వారికి విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రైతులకు రుణాలు, బీమాపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో అందించేలా అధికారులు బ్యాంకర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును తప్పనిసరి అనుసంధానం చేయాలని ఆదేశించారు. సంక్షేమ అధికారులు డీఆర్‌డీఏ, ఉధ్యాన శాఖ, వ్యవసాయ శాఖ రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చే వినూత్న ప్రాజెక్టులను నాబార్డు అధికారులతో సంప్రదించి తయారు చేయాలని అన్నారు. 2017, 18 ఆర్ధిక సంవత్సరంలో లక్షానికి మించి రుణాలు మంజూరు చేసినందుకు కలెక్టర్ బ్యాంకర్లను అభినందించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కూడా లక్షాన్ని అదిగమించాలని సూచించారు. ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి మాట్లాడుతూ ముద్ర రుణాల మంజూరీపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని అన్నారు. సంవత్సరానికి కనీసం 1000 ముద్ర రుణాలు మంజూరు చేసే విధంగా లక్షాన్ని పెట్టుకోవాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణం పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం భుజంగరావు, ఆర్‌బిఐ జీఎం శంకర్, డీడీఎం కమల్ పట్నాయక్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ ఫణి, కెనెరా బ్యాంకు డీజీఎం కలిముద్దీన్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.