Home జాతీయ వార్తలు మహాకూటమి అనివార్యం

మహాకూటమి అనివార్యం

Crude prices are 130 dollars per barrel

ముంబయి : ప్రజల కోసం ప్రతిపక్ష మహాకూటమి అవతరణ కోసం కాంగ్రెస్ యత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. మహాకూటమి అవసరం అనివార్యం, ఇది ప్రజల మనోభావాలు, వారి విశ్వాసాలకు అనుగుణంగా ఏర్పడే వేదిక అని స్పష్టం చేశారు. ఈ మహాకూటమి బిజెపితోనో, ప్రధాని మోడీతోనే తలపడేందుకు వెలియడం లేదు. అంతేకాదు రాజకీయ నాయకుల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పాటు కావడం లేదు. కేవలం ఆసేతు హిమాచలం ప్రజానీకం ఆశలు, వారి ఆకాంక్షలు అంతకు మించి వారి మనోభావాలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటోందని రాహుల్ స్పష్టం చేశా రు. కూటమి ఏర్పాటు దిశలో కాంగ్రెస్ చొరవ తీసుకొంటోందని తెలిపారు. భావసారూప్య శక్తులను, అన్ని గొం తుకలను ఏకం చేసేందుకు తాము యత్నిస్తున్నట్లు వెల్లడించారు. మహా ఘట్‌బంధన్ ఒక చారిత్రక అవసరం. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల వేదిక కాదు, ఇది ఖచ్చితంగా ప్రజా వేదిక అవుతుందని తెలిపారు. మహా ఘట్‌బంధన్ దిశలో తమ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఆయన బిజెపి తరచూ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు.

వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఈ అరాచక ధోరణిని ఆపడం ఎలా? ఇది ఆగేదెలా? అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారని అన్నారు. కీలక అంశాలపై కిమ్మనని ప్రధాని అనవసర విషయాలపై ఎక్కువగా మాట్లాడే ప్రధాని కీలక అంశాలపై ముఖం చాటేస్తుంటారని రాహుల్ మండిపడ్డారు. ఇంధన ధరలను తగ్గించాలని, వీటిని జిఎస్‌టి పరిధిలోకి తేవాలని ప్రతిపక్షం కోరుతోంది. అయితే ప్రధాని మోడీకి వీటిపై స్పందించేందుకు ఇష్టపడటం లేదని అన్నారు. అసంఖ్యాక చిన్న వ్యాపారలు ఎటుపోతేనేం ? తనను నమ్ముకున్న, తాను నమ్ముకున్న బడా పారిశ్రామికవేత్తలు బాగుంటే సరి అనే ధోరణిలో ఉన్నారని విమర్శించారు. ఉగ్రవాదులతో గతంలో ముంబై దాడికి గురయింది. తరువాత ముంబైపై పెద్ద నోట్ల రద్దుతో భీకర దాడి జరిగింది. ఈ దెబ్బతో వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలం అయింది. చిన్న పరిశ్రమలు చితికిపొయ్యాయి. వ్యాపారులు ఎందరో ఇక్కడ ఉన్నారు. జవుళి మిల్లులు, బట్టల పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమలు అన్నీ కూడా గబ్బర్ సింగ్ టాక్స్‌తో దెబ్బతిన్నాయి. యావద్భాతరం విషాదభరితం అయింది. చిన్న వ్యాపారులు దీనస్థితికి చేరారు. వారి కోసం తాము పోరు సాగిస్తున్నామని తెలిపారు.
తగ్గిన ముడి చమురు డబ్బు జాడేది?
యుపిఎ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్ల స్థాయిలో పలికేవి. అయితే ఇప్పుడు అవి 70 డాలర్లకు తగ్గాయి. అయితే ఈ తగ్గుదల ఫలితం ఎటుపోతోంది. సామాన్యుడికి ఈ ఫలం దక్కడం లేదు. మరి తగ్గిన చమురు ధరల ఫలితంగా వచ్చే డబ్బు ఎటుపోతోంది? ఇది కేవలం దేశంలోని అతి కొద్ది మంది జేబుల్లోకి వెళ్లుతోంది. కోటానుకోట్ల మందికి కేవలం బాధలు మిగులుతున్నాయని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గత రెండు రోజులుగా మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. ఆటోవాలాలు మొదలుకుని రైల్వే కలాసీల వరకూ అందరిని కలుసుకుంటున్నారు. వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి రైతాంగం బాధలను క్షేత్రస్థాయిలో గ్రహిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలను తీవ్రతరం చేశారు.