Search
Wednesday 21 November 2018
  • :
  • :

థానేలో క్రిప్టోకరెన్సీ స్కామ్ ఛేదించిన పోలీసులు

bs

ముంబయి: రూ. 500 కోట్ల క్రిప్టోకరెన్సీ కుంభకోణాన్ని థానే క్రైం బ్రాంచీ ఛేదించింది. అంతేకాక ఒకరిని అరెస్టు చేసినట్లు మంగళవారం అధికారి చెప్పారు. నిందితుడు అమిత్ లఖన్‌పాల్ నడిపించే ఫ్లిన్ట్‌స్టోన్ గ్రూపు ఈ స్కామ్‌కు పాల్పడిందని ఆరోపణ. నిందితుడు ‘మనీ ట్రేడ్ కాయిన్’ అనే తన స్వంత క్రిప్టోకరెన్సీని దుబాయ్‌లో 2017 సెప్టెంబర్‌లో ఒక్కో కాయిన్‌కు 3 డాలర్లు ఆఫర్‌తో ఆరంభించాడు. అధిక రాబడి హామీతో లఖన్‌పాల్ మదుపరులను ఆకర్షించాడు. కొన్ని సందర్భాల్లో కాయిన్ విలువను 6000 డాలర్లకు కూడా పెంచాడు. అయితే కాయిన్ల అమ్మకాల హక్కును మాత్రం తన సంస్థ వద్దే ఉంచుకున్నాడు. దాదాపు 25 వేల మంది అతడికి పావులుగా మారి దాదాపు రూ. 500 కోట్లు మదుపు చేశారు. అయితే ఎప్పుడైతే మదుపరులకు డబ్బు తిరిగా రాలేదో అప్పుడు వారు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందడంతో క్రైం బ్రాంచీ థానే, విక్రోలిలలో దాడులు నిర్వహించింది. పోలీసులు 53 లాప్‌టాప్‌లు, ఆర్థిక మంత్రిత్వ శాఖ నకిలీ ఐడెంటీ కార్డులు, డిపాజిట్ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. 8వ తరగతి వరకే చదివిన లఖన్‌పాల్ నకిలీ మేనేజ్‌మెంట్ డిగ్రీ కలిగి ఉన్నాడు. హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు నుంచి రూ. 2500 కోట్ల డిపాజిట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నాడు. మదుపరులు కొందరు పోలీసులను ఆశ్రయించనున్నారని తెలుసుకున్న ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు. లఖన్‌పాల్ సహా ముగ్గురు అనుమానితులు దుబాయ్‌లో దాక్కున్నారని పోలీసులు చెప్పారు. అయితే లఖన్‌పాల్‌కు సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ఇచ్చిన తాహా కజీ అనే వ్యక్తిని ముంబ్రాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడే లఖన్‌పాల్ సంస్థ సాంకేతిక కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చాడు. లఖన్‌పాల్ అనేక మంది సినీ తారలు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలతో దిగిన ఫోటోలను అనేక మ్యాగజైన్లలో ప్రచురించి మదుపరులను ఆకర్షించాడు. లఖన్‌పాల్‌తో ఫోటోలు దిగిన ఆ సెలబ్రిటీలందరు ఇప్పుడు పోలీసలు నిఘాలో పడ్డారు. ఐపిసిలోని అనేక సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. చిట్‌ఫండ్ చట్టం, మదుపరుల ప్రయోజనాలు కాపాడే మహారాష్ట్ర సంరక్షణ చట్టం(ఎంపిఐడి), ఐటి చట్టం కింద లఖన్‌పాల్, అతడి ముగ్గురు అనుచరులపై కేసు నమోదు చేశారు.

Comments

comments