Home రాష్ట్ర వార్తలు సిఎంఒ అంటే చులకనా?

సిఎంఒ అంటే చులకనా?

tg

ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వివిధ శాఖల కార్యదర్శులపై సిఎస్ ఆగ్రహం
స్వయంగా తన సంతకంతో వెళ్లిన ఉత్తర్వులను కూడా పట్టించుకోక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమో జారీ
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పలువురు తమకంటే జూనియర్లనే చిన్నచూపుతోనే ఉత్తర్వులపై కార్యదర్శుల తిరస్కార దృష్టి?

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను సైతం వివిధ శాఖల కార్యదర్శులు సీరియస్‌గా తీసుకోకపోవడంపై ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితర ఉన్నతాధికారులకు ప్రధాన కార్యదర్శి ఈ నెల 14వ తేదీన ఒక ‘మెమో’ను జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా, ప్రధాన కార్యదర్శి హోదాలో తాను స్వయం గా సంతకం చేసి ఉత్తర్వులను జారీ చేస్తున్నా దానికి అనుగుణంగా ఆయా విభాగాల కార్యదర్శులు సీరియస్‌గా స్పందించడం లేదని, ఫైళ్ళు నత్తనడకన నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపైన ఇలాంటి జాప్యం తగదని, ఎలాంటి ఆలస్యానికి తావులేని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే దానికి అనుగుణంగా సంబంధిత శాఖల కార్యదర్శులు ఉత్తర్వులను జారీ చేయాలని ఆ మెమోలో సిఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంపై ఏదైనా సందేహం ఉన్నా, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అంశమైనా వెంటనే టెలిఫోన్‌లోనో లేక ఫ్యాక్స్ ద్వారానో లేక మెయిల్ ద్వారానో సిఎం కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చునని సిఎస్ ఆ మెమోలో పేర్కొన్నారు. ఆదేశాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని, ఫైళ్ళ నత్తనడకపై ముఖ్యమంత్రికి వివరించానని సిఎస్ స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నుంచి సమాచారం వచ్చిందంటేనే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సంబంధిత శాఖ కార్యదర్శులు భావించాలని గుర్తు చేశారు. కేవలం ఒకటి రెండు శాఖలు మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారు (హెచ్‌ఒడి, కమిషనరేట్, డైరెక్టరేట్)ల్లో అలసత్వం కనిపిస్తూ ఉందని సిఎస్ ఆ మెమోలో ఉదహరించారు. ఇంతకాలం ఇలాంటి జాప్యం జరిగి నా ఇకపైన అది పునరావృతం కారాదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సత్వరం ఆయా శాఖల ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించాలని, తదనుగుణమైన ఉత్తర్వులను ఆ శాఖ తరఫున జారీ చేయాలని, అప్రమత్తంగా ఉంటూ చిత్తశుద్ధితో ఆ ఆదేశాలను అమలు చేయాలని సిఎస్ స్పష్టం చేశారు. ‘సెక్రటేరియట్ నిబంధన’లలోని 34వ పేరా ప్రకారం ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆయా శాఖల కార్యదర్శులు వారం రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులను జారీ చేయా ల్సి ఉంటుందని, నిర్దిష్టంగా ఏదైనా అనివార్య పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మరికొంత సమయం పట్టవచ్చని సీఎస్ గుర్తుచేశారు. ఒకవేళ వివిధ మంత్రిత్వశాఖలతో సమన్వయం అవసరమైన స్వ భావంతో కూడుకున్న ఆదేశాలయినట్లయితే రెండు వారాల గడువులో ఆ శాఖ ఉన్నతాధికారి ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుందని నొక్కిచెప్పారు. నిబంధనల్లో ఇంత స్పష్టత ఉన్నా కొన్ని విభాగాల కార్యదర్శులు స్పందించడంలో జాప్యం చేస్తున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న పలువురు అధికారులు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల స్థాయితో పోలిస్తే జూనియర్లుగా ఉన్నందువల్ల ఉద్దేశపూర్వకంగా స్పందించడానికి నిరాకరిస్తున్నట్లు, జాప్యం జరిగేలా అలసత్వం వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి గ్రహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున కార్యదర్శులుగా పనిచేస్తున్నవారి స్థాయితో సంబంధం లేకుండా, ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలుగానే పరిగణించి సంబంధిత శాఖల్లోని ముఖ్య కార్యదర్శులు సీనియర్లు అయినా ఆ వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తక్షణం స్పందించడం అవసరమని, నిబంధనల ప్రకారం నడుచుకోవడం ద్వారా పరిపాలన సమర్ధవంతంగా నడుస్తుందన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. నిర్దిష్టంగా ఏ శాఖ ఉన్నతాధికారి దగ్గర ఉద్దేశపూర్వక నిర్లక్షం జరిగిందో ముఖ్యమంత్రి విశ్లేషించినట్లు సమాచారం. ఆ విషయమై ప్రధాన కార్యదర్శితో సిఎం మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం గురించి చర్చించినట్లు తెలిసింది. అందు లో భాగమే ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఈ ‘మెమో’ జారీ చేయాల్సిరావడం.