Home తాజా వార్తలు చెరువుల కింద సాగుపై భారీ ఆశలు

చెరువుల కింద సాగుపై భారీ ఆశలు

Ponds

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం చేయడంతో వచ్చే ఖరీఫ్‌లో మైనర్ ఇరిగేషన్ కింద సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తుంది. తొలుత తూములు, తర్వాత చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం మిషన్ కాకతీయ కొనసాగింపుగా కొత్త మిషన్ చేపడుతోంది. దీనికి ప్రత్యేకంగా మిషన్ తూములు, మిషన్ చెక్ డ్యాంలు అని పేరు పెట్టకుండానే పనులన్నీ మిషన్ మోడ్‌లోనే చేస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 3000 చోట్ల తూముల నిర్మాణం చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తోంది. అంతకు తక్కువగా గతంలో అంచనాలు వేయగా, తూముల ప్రభావం ఇప్పుడిప్పుడే స్థానిక ప్రజాప్రతినిధులకు, జనాలకు తెలుస్తుండడంతో కొత్తకొత్త ప్రాంతాల్లో కూడా తూములు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలోనే తూముల నిర్మాణం పూర్తిచేసుకొని, ప్రాజెక్టుల నీళ్లతో గొలుసుకట్టు చెరువులు నింపాలన్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఖరీఫ్‌లో సకాలంలో వర్షం కురిసి, సమృద్ధిగా నీరొస్తే దాదాపుగా 52 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఇందులో చెరువులు, మైనర్ ఇరిగేషన్, ఐడిసి ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టే 20 లక్షల ఎకరాల వరకు ఉంటుందని ఓ అంచనా. ప్రాజెక్టుల నీళ్లతో చెరువులు నింపి, ఆయా చెరువుల నీళ్లతో పంటలు పండినప్పుడు, ఆ ఆయకట్టును ఏ ఖాతాలో వేస్తారో తెలియాల్సి ఉంది. అంతిమంగా పొలాలకు నీరు చేరడమే ప్రధానోద్ధేశం.
కాళేశ్వరం ప్రాజెక్టు నీరు సకాలంలో అందితే ఈ నీటితోనే కనిష్టంగా 15 లక్షల ఎకరాల సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకే పునరుజ్జీవ పథకాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం నుంచి తీసుకునే ఒక టిఎంసి నీటినే ఈ పథకానికి వినియోగిస్తారు. పాత ప్రాజెక్టులైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల నీటితో 20.10 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. శ్రీరాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, తెలంగాణలో కురిసే వర్షాల ఆధారంగా ఆయకట్టుకు నీరు అందనుంది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్లో పది ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో భారీ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల ఎత్తిపోతల పథకాల కింద ఈ ఏడాది 15.46 లక్షల ఎకరాలు స్థిరీకరించే అవకాశం ఉందని అంచనా. ఇందులో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 3.07 లక్షల ఎకరాలు, రాజీవ్‌గాంధీ భీమా ఎత్తిపోతల పథకం కింద 2 లక్షలు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద 1.42 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందేలా నిర్మాణ పనులు ఇదివరకే పూర్తయ్యాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 80 వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉందని అంచనా. ఇందులో గొల్లవాగు ప్రాజెక్టు కింద 9,500, కుమ్రం భీం ప్రాజెక్టు కింద 22,500 ఎకరాలు, గడ్డెన్న సుద్దవాగు కింద 14,000, మత్తడివాగు కింద 8,500 ఎకరాల మేర ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వవచ్చు. మొత్తంగా కొత్తగా చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందే 16.22 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నా రు. గతేడాది లాగానే కృష్ణా బేసిన్‌లో అనుకున్న మేరకు నీటి ప్రవాహాలు కొనసాగితే పూర్తి ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందని పేర్కొంది. నిరుడు తెలంగాణలో పెద్దగా వర్షం పడనప్పటికీ, కర్ణాటకలో కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాం తం, బేసిన్‌లో పడ్డ వర్షాల కారణంగా జూలైలోనే శ్రీశైలం జలాశయానికి ప్రవాహాలు వచ్చి, రిజర్వాయర్ నిండింది. ఈ ప్రవాహం కొనసాగి, నాలుగేళ్లలో తొలిసారి నాగార్జునసాగర్ గేట్లు తెరిచేస్థితి వచ్చింది.
సాగర్ గేట్లు రెండు గంటల సేపు తెరిచి ఉంచినప్పటికీ, పూర్తిస్థాయిలో నీరు రావడం ఇటీవలికాలంలో అదే మొదటిసారి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు అందాలంటే, ఆ స్థాయి వర్షాలు వస్తేనే సాధ్యం.

ఇక ఈ ఏడాది చెరువుల కింద ఆయకట్టు రైతుకు పెద్ద సాయం చేయనుంది. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద 26,735 చెరువుల పనులు చేపట్టగా, ఇందులో 20,700 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ చెరువుల్లో పూడిక మట్టితీతతో ఏకంగా 8.53 టిఎంసిల నీటి నిల్వ సామర్థం పెరిగింది. దీనికి తోడు ఈ ఏడాది గొలుసుకట్టు చెరువుల అభివృద్ది కోసం ప్రభుత్వం 3 వేల తూముల నిర్మాణం చేపట్టనుంది. ప్రాజెక్టుల కాలువల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తిస్థాయిలో నింపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని ద్వారా ఈ ఏడాది చెరువుల కింద పెద్ద ఎత్తున ఆయకట్టు సాగవుతుందని అంచనా. ఈ చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 13.60 లక్షల ఎకరాలకు సాగునీరు పారేలా పునరుద్ధరణ పనులు జరిగాయి. తూములతో నీరు చేరితే సుమారుగా మరో లక్ష ఎకరాలకు అదనంగా నీరు వస్తుంది.
ఇక ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎత్తిపోతల పథకాలతో 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురిస్తే చిన్న నీటి వనరుల కింద 20 లక్షల ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తుంది.

Cultivation under ponds in Telangana