Home బిజినెస్ షాక్‌కు గురయ్యా!

షాక్‌కు గురయ్యా!

ఉద్వాసన అసాధారణమైంది
ఎంత ప్రతిష్ఠ ఉన్నా బోర్డు తీరు సరిదిద్దుకోలేనిది
నా వాదన వినిపించే అవకాశమివ్వలేదు
బోర్డు సభ్యులకు మిస్త్రీ లేఖాస్త్రం

Cyrus1ముంబయి : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంత రంగా ఉద్వాసన పలకడంపై సైరస్ మిస్త్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బోర్డు తీరు సరైంది కాదని, ఎంత ప్రతిష్ఠ ఉన్నా ఈ ధోరణి సరిదిద్దుకోలేనిదని మండిపడ్డారు. ఈమేరకు ఆయన బోర్డు సభ్యులకు ఇ-మెయిల్‌ను పం పారు. కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా బోర్డు ఇవ్వలేదని, ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అని అన్నారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యలు ఉండగా, అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించారు. అయితే ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న టాటా గ్రూప్ సంస్థ చైర్మన్‌ను తొలగించే విషయంలో అవలంభించిన తీరు అవమానకరంగా ఉందని విశ్లేషకు లు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కంపెనీ ఉద్వాసనకు కారణాలేమిటో చెప్పకపోవడం సంస్థకు నష్టం కల్గించే విషయమని అంటున్నారు. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించిన సంగతి తెలిసిందే. అవమానకర రీతిలో తనను తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్ర యించాలని మిస్త్రీ భావిస్తున్నట్టు కథనాలు వచ్చినప్పటికీ వాటిని పల్లోంజి గ్రూప్ ఖండించింది. అయితే మిస్త్రీ చట్టపరమైన చర్యలు తీసుకోకుండా టాటా గ్రూప్ కూడా జాగ్రత్తలు తీసుకుంది. లీగల్ చర్యలు నివారించేందుకు ఉద్దేశించిన కేవియట్ పిటిషన్లను బొంబాయి హైకోర్టులో టాటా గ్రూప్ దాఖలు చేసింది. అయితే, ప్రస్తుత దశలో లీగల్ చర్యలు తీసుకొనేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బ్రిటన్ స్టీల్ పరిశ్రమను అమ్మడం కారణంగానే మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించినట్టు తెలుస్తోంది.
రూ.19,400 కోట్లు ఆవిరి
సైరస్ మిస్త్రీని అకస్మికంగా తొలగింపు స్టాక్ మార్కెట్‌నూ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుత పరిణామాలు టాటా గ్రూప్‌లోని కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత రెండు రోజుల ట్రేడింగ్‌లో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలు దాదాపు రూ.19,400 కోట్లు మార్కెట్ విలువను నష్టపోయాయి. మిస్త్రీ ఉద్వాసన న్యూస్‌తో రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు డీలా పడ్డాయని, ఐటి కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావా న్ని చూపించనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ రెండు రోజుల్లో 1.3 శాతం నష్టపోయింది. ఈ సంస్థ మార్కెట్ విలువలో రూ.6,059 కోట్లు కోల్పోయింది. డివిఆర్ షేర్లు సహా టాటా మోటార్స్ రూ.9,610 కోట్ల సంపదను కోల్పోయింది. అలాగే ఇతర కంపెనీల కూడా ఇదే బాటలో పయనించాయి. టాటా స్టీల్ రూ.2,640 కోట్లు, టైటాన్ రూ.244 కోట్లు, టాటా పవర్ రూ.811 కోట్ల భారీ నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో రెండు రోజుల్లో సెన్సెక్స్ 1.2 శాతం మేరకు పడిపో యింది. అయితే నాయకత్వ మార్పు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్ వ్యాపారాలపై దృష్టి పెట్టాలని, కంపెనీలను మార్కెట్ లీడర్లుగా నిలపా లని గ్రూప్ కంపెనీల సిఇఒలకు మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా సూచించారు.

దానివల్లే మిస్త్రీ పదవికి ఎసరు
మిస్త్రీ ఉద్వాసన కథ మిస్టరీగానే ఉంది. ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా హఠాత్తుగా ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని టాటా గ్రూప్ తీసుకోవడానికి కారణం ఏమిటి? అన్నదానిపై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే అసలు మిస్త్రీని తొలగించడానికి కారణం బ్రిటన్ స్టీల్ విక్రయం వ్యవహారమేనని తెలుస్తోంది. టాటా గ్రూప్ నష్టాల్లో ఉండటం, బ్రిటన్ స్టీల్ పరిశ్రమను అమ్మేయడం వంటి కారణాల వల్లే మిస్త్రీని తొలగించినట్టు కథనాలు వచ్చాయి. అయితే టాటా గ్రూప్‌కు చెందిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ సభ్యుడైన విఆర్ మెహతా తాజాగా ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ టాటా గ్రూప్‌లో 60శాతం వాటా కలిగిన ఈ ట్రస్ట్ అత్యంత శక్తిమంతమైనదని, టాటా గ్రూప్ వ్యవహారాలన్నింటిలోనూ చాలావరకు ఈ ట్రస్ట్ మాటే చెల్లుబాటు అవుతుందని అన్నారు. టాటా గ్రూప్ వరుసగా ఎదుర్కొంటున్న నష్టాలే మిస్త్రీ తొలగింపునకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎల్‌ఆర్ (జాగ్వర్ ల్యాండ్ రోవర్) రెండు కంపెనీలపైనే మిస్త్రీ దృష్టి పెట్టారని, మిగతా వాటిని నిర్లక్షం చేశారని, దీంతో మిగతావన్నీ నష్టాల బాటలో నడుస్తున్నాయని తెలిపారు. ఇలా కంపెనీలు నష్టాల్లో ఉండటంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కోత పెట్టాల్సి వస్తోందని, దీనిని టాటాలు ఎంతమాత్రం ఒప్పుకోలేదని ఆయన వెల్లడిం చారు. మిస్త్రీ చైర్మన్‌గా టాటా గ్రూప్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని మెహతా అన్నారు.సంస్థ టెలికం భాగస్వామి డొకోమోకు వ్యతిరేకంగా న్యాయ పోరు చేయాల్సి రావడం, ఈ పోరాటంలో ఓడిపోవడం వల్ల ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి గ్రూప్‌కు ఏర్పడిందని ఆయన ప్రస్తావించారు. డొకోమో కేసు టాటాల సిద్ధాంతాలక అనుగుణమైనది కాదని, ఈ విషయంలో మరింత సమర్థంగా ఎదుర్కొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మిస్త్రీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టాటా గ్రూప్, ట్రస్ట్ మధ్య అగాథం పెరిగిపోయిందని పేర్కొన్నారు.