Home నిజామాబాద్ డిఎస్ కిం కర్తవ్యం

డిఎస్ కిం కర్తవ్యం

 రాజకీయ పయనంపై సందిగ్ధత,  బిజెపి నేత నుండి ఫోన్? 

D Srinivas Meet with Our Followers

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ భవిష్యత్తు రాజకీయ పయనంపై సందిగ్ధతత నెలకొంది. గత నెల 27న సత్వరమే స్పందించి ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, పార్టీ అంతా ఏకమై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. లేఖలోని అంశాలపై వివరించేందుకు సిఎం కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోసం డి.ఎస్.

రెండు మూ డు రోజులు ఎదురు చూసినా అవకాశం దక్కలేదు. ఈ ఘటన జరిగి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఆయనకు సిఎంఒ అపాయింట్‌మెంట్ లభించలేదు. దీంతో ఆయన టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నట్లా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. టిఆర్‌ఎస్ నేతలు మాత్రం పార్టీ వైపు నుండి చెప్పాల్సిందంతా లేఖలో స్పష్టంగా ఉందని, ఇక తేల్చుకోవాల్సింది ఆయనేనని చెబుతున్నారు. మరోవైపు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన తన అభిమానులతో హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాలా మంది కాంగ్రెస్‌లో చేరుదామన్నట్లు తెలిసింది. దీనికి డి.శ్రీనివాస్ స్పందిస్తూ పరిణామాలను వేచి చూద్దామన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతల విముఖత : ఢిల్లీ దారి నుండి కాంగ్రెస్‌లోకి డి.శ్రీనివాస్ పునరాగమనంపై కొన్ని ఆటంకాలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఆయనకు సోనియాగాంధీ, పాత నాయకులు, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తదితర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో నూతన సారధి రాహుల్‌గాంధీతో అంత సాన్నిహిత్యం లేదు. పార్టీలో పాత తరాన్ని పక్కనబెట్టి రాహుల్‌గాంధీ యువరక్తానికి ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో డిఎస్‌ను చేర్చుకోవడం, చేరిన తరువాత గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎంత వరకు ఉంటుందనే విషయంలో సానుకూల సంకేతాలు రానట్లు విశ్వసనీయ సమాచారం. అందరికంటే ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో సీనియర్‌లు డి.శ్రీనివాస్‌ను చేర్చుకునే అంశంపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు బహిరంగంగానే ఈ అంశంపై విముఖత వ్యక్తం చేయగా, సిఎల్‌పి నేత జానారెడ్డి సైతం ఈ అంశాన్ని అసందర్భమైనదిగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో బిసి విభాగానికి చెందిన ఒక ముఖ్యనేత కూడా అయిష్టతను తెలియజేశారు. డి.ఎస్. స్వంత జిల్లా నిజామబాద్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఒక కాంగ్రెస్ నేత మాట్లాడుతూ “డి.ఎస్.ను కాంగ్రెస్ 40 ఏళ్ళు కీల క పదవులిచ్చి గౌరవించింది. కేవలం రాజ్యసభ సీటు కోసం పార్టీని వీడి పోయాడు. రెండేళ్ళు ఓపిక పట్టి ఉండే పిసిసి అధ్యక్షుడిగా హ్యా ట్రిక్ సాధించేవారు. ఆయన కొడుకు ఒక పార్టీలో , ఆయనొక పార్టీలో ఉండడం కుదరద”ని వ్యాఖ్యానించారు. పిసిసి మాజీ అధ్యక్షులొకరు డి.ఎస్. చేరికకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఇంతకు దారెటు? : ఒకవైపు ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉండీ లేనట్లుగా ఉండడంతో డిఎస్‌కు అందులో ఇమడలేని పరిస్థితి నెలకొంది. పైగా తనకు వ్యతిరేకంగా రాసిన లేఖలో అవినీతి ఆరోపణలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతటి ఆరోపణలు చేసాక సీనియర్ నాయకునిగా పార్టీలో కొనసాగడం ఇబ్బందికరమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖానిస్తున్నారు. పాత పార్టీ కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే అక్కడ కూడా చాలా మంది సుముఖంగా కూడా ఆయనకు ఇబ్బందే. మరోవైపు ఆయన కుమారుడు అరవింద్ బిజెపి పార్టీలో చాలా దూరం వెళ్ళారు. దీంతో డి.ఎస్. బిజెపి వైపు అడుగులు వేస్తారా? అనే ప్రచారం కూడా సాగుతోంది. బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇటీవల డి.ఎస్.కు ఫోన్ చేశారనే వార్తలు ప్రాధాన్యత కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యనేతల్లో ఒకరిగా చెలామణి అయిన డి.శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు డోలాయమనంగా మారింది.