Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

లొంగిపోయిన సంజయ్

రిమాండ్‌కు తరలించేందుకు పోలీసుల కసరత్తు

Sanjay-Arrested

మనతెలంగాణ/ నిజామాబాద్ ప్రతినిధి : రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆదివారం నిజామాబాద్‌లో పోలీసులకు లొంగిపోయారు. నిజామాబాద్‌లోని తన సొంత నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినిలను లైంగికంగా వేధించిన కేసులో పరారీలో ఉన్న ఆయన నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ నెల 3న సంజయ్‌పై నిర్భయకేసు నమోదుకాగా ఆ రోజు నుండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు తీవ్రంగా యత్నించిన పోలీసులు లొంగిపోవాలంటూ సంజయ్ సన్నిహితుల ద్వారా ఒత్తిడితెచ్చారు. మరోవైపు పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ పొందేందుకు హైకోర్టులో క్వాష్ ఫిటిషన్ వేసిన సంజయ్‌కు చుక్కెదురు కాగా విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

అదే సమయంలో సంజయ్‌కు 41 సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం బాధిత విద్యార్థినిల్లో దళితులు ఉండడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు జోడించారు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన సంజయ్ తన తరపు న్యాయవాదులతో కలిసి ఆదివారం ఎసిపి మంత్రి సుదర్శన్ ముందు లొంగిపోయారు. పోలీసులు సంజయ్‌ను ఫస్ట్‌క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో రిమాండ్ పదం లేదని, నోటీసులు ఇచ్చి విచారణ చేయాలంటూ సంజయ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు తమ వాదనలను వినిపించారు. అయితే సంజయ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో ఎస్‌సి, ఎస్‌టి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి సూచించడంతో తిరిగి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.

అక్కడ సైతం సంజయ్ న్యాయవాదులు తమ వాదనను వినిపిస్తూ రిమాండ్‌కు తరలిస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అడ్డు చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు న్యాయనిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా సంజయ్‌ను రిమాండ్‌కు తరలించి ఆపై జ్యుడిషియల్ కస్టడీకి కోరాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి సంజయ్ అరెస్టు వ్యవహారం నాటకీయ మలుపులు తిరుగుతోంది.

Comments

comments