Home తాజా వార్తలు మరోసారి రాజకీయ నాయకుడిగా…

మరోసారి రాజకీయ నాయకుడిగా…

టాలీవుడ్‌లో హీరోలలో రానా దగ్గుబాటి రూటే సపరేటు. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ఈ కథానాయకుడి సినిమాల ఎంపిక విధానం పూర్తిగా మారిపోయింది. విభిన్నమైన కథాంశాలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటికే హాథి మేరే సాథీ, 1945 లాంటి విభిన్నమైన చిత్రాలలో నటిస్తున్న రానా ‘విరాటపర్వం’ అనే మరో చిత్రానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. ‘నీది నాది ఒకే కథ’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఉడుగుల ‘విరాటపర్వం’ చిత్రానికి దర్శకుడు.

ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఎమర్జెన్సీ కాలం నాటి 1975లో ప్రారంభమై 1992లో ముగుస్తుందట. ఇందులో రానా, సాయిపల్లవి విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో మానవహక్కులను అంతర్లీనంగా చర్చిస్తారట. అయితే ఇందులో ప్రముఖ నటి టబు మానవహక్కుల కార్యకర్త పాత్రలో నటిస్తుందని తెలిసింది. పీరియడ్ ఫిలింగా భారీ స్కేల్‌లో తెరకెక్కుతుండడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుందట. రానా తండ్రి డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది. ఈ సినిమా కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశప’ను కూడా రానా లైన్‌లో పెట్టారు.

Daggubati Rana act as Political leader in Virataparvam