Home ఎడిటోరియల్ ఆ చట్టానికి తూట్లు ఎవరి కుట్ర?

ఆ చట్టానికి తూట్లు ఎవరి కుట్ర?

bjp

ఏప్రిల్ 2వ తేదీన దళితులు నిర్వహించిన భారత్ బంద్ తర్వాత బిజెపికి వణుకుపుట్టిందని, అందుకే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో దళితుల వేధింపులు కొనసాగుతున్నాయని, పెద్దఎత్తున అరెస్టులు చేస్తున్నారని బహుజన సమాజ్ నాయకురాలు మాయావతి విమర్శించారు. ఆమె మాత్రమే కాదు బిజెపిలోని దళిత నేతలు కూడా ఈ ఆరోపణలు చేస్తున్నారు. నలుగురు బిజెపి ఎంపిలు, ఉదిత్ రాజ్, యశ్వంత్ సింగ్, ఛోటేలాల్ ఖర్వార్, అశోక్ కుమార్ దోహ్రేలు ఇలాంటి ఆరోపణలే చేశారు. బిజెపిలోని దళిత నాయకులను దళిత సముదాయం ఎన్నటికీ క్షమించదని మాయావతి దాడి చేశారు.
ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటిస్ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాల తర్వాత దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరిగింది. గ్వాలియర్‌లో జరిగిన హింసాకాండలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరుపుతున్న వీడియోలు టివిల్లో వచ్చాయి. తర్వాత ఆ వ్యక్తి పేరు రాజా చౌహాన్ అని తేలింది. అతడు భారతీయ జనతాపార్టీ కార్యకర్త అని కూడా చాలా మంది గుర్తుపట్టి మరీ చెప్పారు. విడియోల్లో జై శ్రీరాం అనే ని నాదాలు కూడా వినిపించాయని ఎబిపి న్యూస్ కథనం.
దళిత ప్రతిఘటనకు అసలు కారణాలు మరుగున పడిపోయి హింసాకాండపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు సుప్రీంకోర్టు ఎందుకిలాంటి నిర్దేశాలిచ్చింది, దీని వెనుక నేపథ్యం ఏమిటన్నది కూడా మననం చేసుకోవడం అవసరం. అసలు కేసు 2007 నాటిది. న్యాయం కోసం తాను పెట్టిన కేసు ఇలా పరిణమిస్తుందని తాను కల్లో కూడా ఊహించలేదని దళితుడైన భాస్కర్ గైక్వాడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పాడు. అంతేకాదు, ప్రభుత్వం రివ్యూ పిటిషనుతో సంబంధం లేకుండా తాను ప్రత్యేకంగా రివ్యూ పిటిషన్ వేస్తున్నానని, ఏప్రిల్ 19న వేస్తానని చెప్పాడు. ఎందుకంటే, అసలు కేసులో ఎఫ్ ఐఆర్ మరాఠీలో ఉంది. దానిని సుప్రీంకోర్టులో తప్పు అనువాదంతో సమర్పించారని ఆయన అంటున్నాడు.
ఈ కేసు వేసినప్పుడు భాస్కర్ గైక్వాడ్ కరాడ్‌లో ప్రభుత్వ ఫార్మసీ కాలేజీలో పనిచేస్తున్నాడు. అప్పటి కాలేజీ ప్రిన్సిపల్ అవినీతికి పాల్పడ్డాడని, అందుకు అనుగుణంగా రికార్డులు రాయమంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని గైక్వాడ్ చెబుతున్నాడు. గైక్వాడ్ ఈ పనికి ఒప్పుకోలేదు. అప్పట్లో ఆయన స్టోర్ మేనేజరుగా పనిచేసేవాడు. ఈ అవినీతి వ్యవహారాల గురించి పై అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో ఆగ్రహించిన కాలేజీ అధికారులు వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో గైక్వాడ్ గురించి చెడ్డగా రాశారు.
దీనిపై గైక్వాడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టరు వద్ద ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. జాయిం ట్ డైరెక్టరు సుభాష్ మహాజన్. కాని అక్కడ ఆయన మాట ఎవరూ వినలేదు. జాయింట్ డైరెక్టరు తన ఫిర్యాదును కనీసం వినకపోయేసరికి గైక్వాడ్ ఆయనపై ఫి ర్యాదు చేశాడు. తనపై గైక్వాడ్ చేసిన ఫిర్యాదును రద్దు చేయాలంటూ సుభాష్ మహాజన్ కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం మహాజన్‌కు పూర్తి మద్దతుగా వ్యవహరించిందని, తన మాట ఎవ్వరు వినలేదని గైక్వాడ్ అన్నాడు. దాంతో గైక్వాడ్ ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించే మార్చి 20వ తేదీ నిర్దేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు ఎఫ్‌ఐఆర్ అనువాదం కాపీని సమర్పించారని, ఒరిజినల్ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మూడు పేరాలు అందులో లేవని, అంతేకాదు, మహాజన్‌కు అనుకూలంగా ఉండేలా ఒక కొత్త వాక్యం కూడా చేర్చారని గైక్వాడ్ ఆరోపించాడు
ప్రభుత్వ కార్యాలయాల్లో కులవివక్ష లేదా? బిజినెస్ స్టాండర్డ్ డాట్ కామ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్ డేటాను ప్రస్తావిస్తూ, 2015-16లో 29,931 కేసులు ఇలాంటివి, అంటే కులపరమైన అణచివేతలకు సంబంధించినవి ఉన్నాయని తెలిపింది. పెండింగ్ కేసుల్లో చాలా వరకు దళితుల సర్వీస్ మేటర్స్‌కు సంబంధించినవే. ప్రమోషన్లు ఇవ్వకపోవడం, రీయింబర్స్‌మెంట్లు ఇవ్వకపోవడం, కక్షసాధింపు బదిలీలు వంటివే కాదు, పెట్రోలు పంపుల కేటాయింపుల వంటివి కూడా ఉన్నాయి.
వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఫిర్యాదులు గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. అంతేకాదు 2014 తర్వాత ఈ ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్లు కూడా తెలుస్తోంది. కమిషన్ రీజినల్ కార్యాలయాల్లో అట్రాసిటీస్ కేసులు 27 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది. అట్రాసిటీస్ కేసుల్లో రేప్, భూవివాదాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణ, దహనాలు వగైరా ఉన్నాయి. మరో విషయమేమంటే 2014 తర్వాత కమిషన్ పరిష్కరించిన కేసుల సంఖ్య తగ్గిపోతు వస్తున్నది. సర్వీస్ మాటర్స్‌కు సంబంధించి కులవివక్షను రుజువు చేయడం అంత తేలిక కాదు. గైక్వాడ్ కేసు అలాంటిదే.
ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసిన తర్వాత విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముందు ఈ కేసులో అమికస్ క్యూరి అమరేంద్ర శరణ్ చెప్పిన మాటలు “వాళ్ళు (అంటే కేంద్రప్రభుత్వం) డేటా ఇచ్చారు. వాళ్ళే దాఖలు చేశారు (అంటే, అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణాత్మకమైన మార్గదర్శక సూత్రాలు కావాలని). ఇప్పుడు వాళ్ళే దాన్ని సవాలు చేస్తున్నారు.” అని చెప్పారు.
ఈ మాటలాయన ఎందుకు చెప్పాడు. ప్రభుత్వం ఇచ్చిన డేటా ఏమిటి? ఈ ప్రశ్నలు ముఖ్యమైనవి. ఈ విషయమై అయోమయాన్ని ప్రభుత్వమే తొలగించాలి. హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇద్దరు కూడా ఈ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయమూ లేదని చెప్పారు. కోర్టు మాటలతో విభేదిస్తున్నట్లు కూడా మాట్లాడారు. కాని ప్రభుత్వం అబద్ధాలాడుతోందని కాంగ్రెసు విమర్శించింది. ఈ విమర్శలకు ప్రభుత్వం నుంచి సరయిన జవాబేదీ రాలేదు. దళితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేకానేక కార్యక్రమాల జాబితా చదవడం జరుగుతోంది. భారత్ బంద్ తర్వాత మోడీ గారు మౌనం వదిలి అంబేద్కర్‌ను తమ ప్రభుత్వం గౌరవించినంతగా మరే ప్రభుత్వమూ గౌరవించలేదని ఒక మాట చెప్పా రు. రాజనాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్దేశాల తర్వాత దళితుల్లో ఆగ్రహావేశాలను అర్ధం చేసుకుంటున్నామని, అయితే ఈ కేసులో ప్రభుత్వం పార్టీ కాదని అన్నారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయమై మాట్లాడుతూ సుప్రీం కోర్టుతో ప్రభుత్వం ఈ విషయంలో గౌరవపూర్వకంగా విభేదిస్తుందని చెప్పారు. దళితుల భద్రతకు మోడీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ మాటలు ఏమైనా, అసలు చేసిన పనేమిటి అనేది చూడాలి.
మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు నిర్దేశాలకు ముం దు అడిషనల్ సోలిసిటర్ జనరల్ చెప్పిన మాటలు, అట్రాసిటీస్ చట్టంలో సెక్షన్ 18 ఉన్నప్పటికీ, మౌలికాధారాలులేని పక్షంలో బెయిలు ఇవ్వడంపై పూర్తి నిషే ధం వంటిదేమీ లేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వు లో ఒక మొత్తం సెక్షన్ అడిషినల్ సొలిసిటర్ జనరల్ చెప్పిన మాటలపైనే ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే కోర్టులో హాజరయ్యారు. అంతేకాదు, ప్రభుత్వం ఇచ్చిన డాటాపై ఆధారపడే ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు చెప్పింది.కాంగ్రెసు చేస్తున్న విమర్శలు కూడా గమనార్హమైనవి. ఈ కేసులో ప్రభుత్వం ఒక పార్టీగా లేదు. కాని బెయిలు ఇవ్వడానికి అనుకూలమైన విధంగా వ్యవహరించింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి (రెండు చోట్ల బిజెపి అధికారంలో ఉంది) 2017 నవంబరులో సుప్రీంకోర్టు నోటీసులు పంపిం ది. ఒక ప్రత్యేక చట్టానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ నోటీసులు వెళ్ళాయి. కేంద్రచట్టం కాబట్టి దీనిపై అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా కోర్టులో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. కాని మోడీ ప్రభుత్వం అటార్నీ జనరల్ ను పంపలేదు. సోలిసిటర్ జనరల్ ను కూడా పంపలేదు. అడిషనల్ సోలిసిటర్ జనరల్ వచ్చారు. కోర్టు ఉత్తర్వు వచ్చిన వెంటనే రివ్యూ పిటీషన్ వేశామని చెప్పడం కూడా సరికాదు. ఆందోళనలు చెలరేగిన తర్వాత మాత్రమే రివ్యూ పిటీషన్ వేశారు. ఈ మొత్తం వివరాలన్నీ చూస్తే మనకేం అర్థమవుతోంది. ఒక ఆఫీసులో అన్యాయానికి గురైన ఒక దళిత ఉద్యోగి చేసిన ఫిర్యాదును చివరకు దళితులకు రక్షణ కల్పించే చట్టాన్ని నీరుగార్చడానికి వాడుకొంటున్నారు. ఆగ్రహావేశాలతో భారత్ బంద్ పిలుపిచ్చిన దళితుల ప్రతిఘటనలో సంఘవ్యతిరేక శక్తులు చొరబడి హింసాకాండకు పాల్పడి అసలు చర్చ దళితులపై అణిచివేతలు, అన్యాయాల నుంచి హింసాకాండకు ఎవరు బాధ్యులన్న చర్చగా మార్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.