Search
Sunday 23 September 2018
  • :
  • :

రహదారి వెంటే చెత్త డంపింగ్

 Damping the trash along the highways in Nalgonda

దుర్వాసనతో ఇక్కట్ల పాలవుతున్న ప్రయాణీకులు
పొగతో ప్రమాదాల బారిన పడుతున్న వాహన చోదకులు
పట్టించుకోని అధికారులు
మనతెలంగాణ/నేరేడుచర్ల : పట్టణ శివారులోని పలు ప్రధాన రహదారులు చెత్త చెదారంతో, దుర్వాసనతో కంపు కొడుతున్నాయి. గ్రామ పంచాయతీ వాహనం నుండి సేకరించిన చెత్తను ప్రధాన రహదారుల వెంబడే డంపింగ్ చేస్తుండడంతో ఆ చెత్త మురిగి కుళ్ళు కంపుకొడుతూ రహదారి వెంట ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. నిన్నటి వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నేరేడుచర్లను ప్రస్తుతం మున్సిపాలిటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాక ప్రస్తుతమున్న కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిని ప్రస్తుతం జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడో రేపో జాతీయ రహదారి పనులు చేపట్టనున్నారు. అయినప్పటికీ నేటికీ నేరేడుచర్లలో చెత్త డంపింగ్ యార్డు లేకపోవడం విచారించదగ్గ విషయం. అసలే వర్షాకాలం కావడంతో చెత్త కుళ్ళి అంటువ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొనే వారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. ప్రతి సారి మండల సర్వసభ్య సమావేశంలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలని గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు కోరినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. తహసీల్దార్ ఆధ్వర్యంలో రెండు మూడు చోట్ల డంపింగ్ యార్డుకు ప్రభుత్వ స్థలం ప్రతిపాదించినప్పటికీ ఆయా ప్రాంతాలు జనావాసాలకు దగ్గరలో ఉండడం, లేదా వ్యవసాయ భూములకు ప్రక్కనే ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుండి వ్యతిరేకతలు వ్యక్తం కావడంతో అధికారులు చేసేది లేక చేతులు దులుపుకున్నారు. చెత్త డంపింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో గ్రామ పంచాయతీ వాహనం సేకరించిన చెత్తతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా చెత్తను కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారి వెంటే పోస్తున్నారు. ఆ చెత్తను కాల్చడానికి నిప్పు పెట్టడంతో దాని నుండి వచ్చే దుర్గంధంతో పాటు, వచ్చే పొగతో రహదారి వెంట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులు ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాక ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న కాలనీవాసులు నిత్యం వివిధ రకాల వ్యాధులు, రోగాలబారిన పడుతున్నారు. ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందుల దృష్టా అధికారులు చొరవ తీసుకొని వెంటనే చెత్త డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
స్థలం కేటాయించాం
డంపింగ్ యార్డుకు పట్టణంలోని శాంతి నగర్ వద్ద స్థలం కేటాయించాం. అయి తే ఇంకా గ్రామ పంచాయతీకి ఆ స్థలాన్ని అప్పగించలేదు. త్వరలోనే స్థలాన్ని సర్వే చే యించి గ్రామ పంచాయతీకి అప్పగిస్తాం.
-తహసీల్దార్ కృష్ణానాయక్
నేరేడుచర్ల

Comments

comments