Home తాజా వార్తలు చేతికి చెల్లు

చేతికి చెల్లు

congress

కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ గుడ్‌బై

రాహుల్, ఉత్తమ్, కుంటియాలకు రాజీనామా లేఖలు
న్యూ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో మంత్రి తలసానితో నాగేందర్ సమావేశం
బుజ్జగించడానికి ఇంటికి వెళ్లిన పిసిసి చీఫ్ : దొరకని దానం
జానా ఇంట్లో నేతల భేటీ

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన బాటలో మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. నగర శివారు ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎలు కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. వీరంతా టి ఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో మాజీమంత్రి ఎం.ముఖేష్ గౌడ్, ఆయన తనయుడు, జిహెచ్‌ఎంసి ఎన్నిక ల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామాకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలకు దానం నాగేందర్ ఫ్యాక్స్, ఈ మెయిల్ ద్వారా శుక్రవారం ఉదయం రాజీనామా లేఖలు పంపారు. అలాగే పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ కుంటియాకు కూడా వాటి ప్రతులను పంపించారు. తన రాజీనామాకు కారాణాలు వివరించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దానం నాగందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఎల్‌సి కె.దామోదర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. నెల రోజులు కూడా కాకముందే దానం వంటి కీలక నేత కాంగ్రెస్‌ను వీడనుండడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. దానం రాజీనామా చేసిన కొద్దిసేపటికే టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళారు. అయితే, అప్పటికే ఆయన బైటికి వెళ్ళిపోవడంతో దానంను కలవలేకపోయారు. అదే సమయంలో మంత్రి తలసాని యాదవ్‌తో ఆదర్శనగర్‌లోని న్యూ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో దానం నాగేందర్ అరగంట పాటు సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బిసిలను పట్టించుకోవడం లేదు : దానం
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమం గురించి పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదని దానం నాగేందర్ అన్నారు. తన రాజీనామాకు సంబంధించిన వివరాలతో ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర పార్టీలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు ప్రాధాన్యతనివ్వకపోవడంతో వారు పార్టీకి దూరమవుతున్నారని, అంతే కాకుండా ఆ వర్గాల్లో అభద్రత, అసంతృప్తి భావనలు నెలకొన్నాయన్నారు. దీనికి తోడు సమన్వయం, క్యాడర్‌తో మాట్లాడకపోవడం, క్షేత్రస్థాయి నాయకులను నిర్లక్షం చేయంతో పార్టీకి దిశా నిర్దేశం, నాయకత్వం లేకుండా పోయిందన్నారు. పార్టీలో అంతర్గత తగాదాలు, నాయకత్వలేమి, నిరాశకు గురైన క్యాడర్‌తో మానసికస్థైయిర్యం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. అనేక సార్లు పార్టీ పునర్వవస్థీకరణకు, బిసిల సంక్షేమానికి సంబంధించి తన అభి ప్రాయాలు చెప్పినా పార్టీ పట్టించుకోలేదన్నారు. తాను 24 శాసనసభ నియోజకవర్గాల పరిధి గల జిహెచ్‌ఎంసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు తన పాత్రను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో పరిసర ప్రాంతాలను కూడా నగర అధ్యక్షుని పరిధిలో ఉంచినా, హైదరాబాద్‌లో మాత్రం చిన్న చిన్న ప్రయోజనాల కోసం అలా చేయకుండా అయోమయం సృష్టించారని పేర్కొన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
జానారెడ్డి ఇంట్లో సీనియర్‌ల భేటీ : దానం నాగేందర్ రాజీనామా నేపథ్యంలో సిఎల్‌పి నేత జానారెడ్డి నివాసంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు అత్యవసరంగా సమావేశమయ్యారు. వీరంతా కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. దానం రాజీనామాతో పాటు మరికొంత మంది పార్టీ వీడితే పడే ప్రభావం నుండి ఎలా బైటపడాలనే అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. మూడు రోజుల క్రితమే టిపిసిసి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్తమ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కాంగ్రెస్‌లో అసమ్మతి ఛాయలు బైటపడ్డాయి. మరుసటి రోజే హైదరాబాద్‌లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్.సి.కుంటియా ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా పిసిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి దానిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అది జరిగి 24 గంటలు గడవక ముందే దానం నాగేందర్ రూపంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది.
దానంను వంద శాతం తీసుకుంటాం: మంత్రి తలసాని
దానం నాగేందర్‌ను నూటికి నూరు శాతం టిఆర్‌ఎస్‌లోకి తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము 30 సంవత్సరాల నుండి పార్టీలు ఏదైనప్పటికీ మిత్రులుగానే ఉన్నామన్నారు. తన నివాసానికి దానం వచ్చి భేటీ అయిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ లాంటి వ్యక్తికి వ్యక్తిగత ఇమేజి, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నదని, ఒక బిసి నేత అని, కాబట్టి ఆయనను నూటికి నూరుపాళ్ళు టిఆర్‌ఎస్‌లోకి తీసుకుంటామని చెప్పారు. అయితే, చాలా మంది వస్తామంటున్నప్పటికీ అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనే టిఆర్‌ఎస్ సత్తా చూశారని, ఎక్కడా చూసినా నగరంలో వేరే పార్టీ నేతలకు అవకాశాలు లేవని చెప్పారు. దానం బైటికి వెళ్ళేటప్పుడు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఒక బిసి నాయకుడు కాబట్టే తలసానిని కలిసేందుకు వచ్చానని,అన్ని వివరాలు శనివారమే చెబుతానన్నారు.
దానం పార్టీ వీడితే నష్టమే విహెచ్ : ఒక నాయకుడు పార్టీని వీడితో కొంత నష్టం ఉంటుందని, అలాంటిది దానం నాగేందర్ మంత్రిగా కూడా చేశారని పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నారు. పార్టీ బలోపేతమవుతున్న సమయంలో ఇలా పార్టీని వీడిపోవడం బాధాకరమని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.