Search
Friday 16 November 2018
  • :
  • :

ఉ.కొరియాతో ముదిరితే ముప్పే

edit

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సంఘర్షణలకు బీజాలు చల్లుతున్నారు. అఫ్ఘనిస్థాన్‌లో అన్ని బాంబులను మించిన బాంబు పేల్చిన ఆయన మధ్య ప్రాచ్యం లో అన్ని యుద్ధాలను తలదన్నే యుద్ధం రగల్చ డానికి ఉవ్విళ్లూరుతున్నారు. జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించి చిచ్చురగిల్చారు. సౌదీ అరేబియాను యెమెన్‌పై ఉసిగొల్పుతున్నారు. ఇరాన్‌తో ఆమెరికా వైరం వచ్చే ఏడాది మొదట్లో బాగా రగిలే సూచనలు ఉన్నాయి. ఇరాన్‌తో అంతర్జాతీయ అణు సహకార ఒప్పం దాన్ని ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్నది. దానిని ఏకపక్షంగా (కాంగ్రెస్ కార్యాచరణ ఏదీ లేకుండానే) రద్దు చేయడానికి ట్రంప్ సంకల్పించారు. వీటిలో ఏ వైరమూ సాటిరాని తీవ్రతతో ఆయన తాజాగా ఉత్తర కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ దేశంతో అమెరికా ఈ అన్ని సంఘర్షణలను తలదన్నే విధంగా విరుచుకుపడుతోంది. అణ్వాయుధ దాహంలో ఉన్న ఉత్తరకొరియా కూడ తక్కువ తినలేదు. అది కూడా సమంగా అమెరికాతో ప్రకటనల యుద్ధానికి దిగి ఉద్రిక్తతకు తాను కూడా కారణమవుతోంది. వరునగా ఖండాంతర క్షిపణులను పేల్చుతూ అణుపాటవ పరీక్షలు జరుపుతోంది. అమెరికా మూడునెలలు వేచి చూడాలి అని రాజకీయ పండితులు, విధాన నిర్ణేతలు సూచిస్తున్నారు. అమెరికా నగరాలను అణ్వాయుధా లతో ముట్టడించే సామర్థాన్ని ఉత్తరకొరియా అందుకోకుండానే ఈలోగా దానిని ట్రంప్ నిరోధిస్తారని వారు ఆశిస్తున్నారు.
ఈ ప్రతిపాదన గూఢచారి సంస్థ సిఐఎ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాపై అమెరికా ముందస్తు దాడి సాగించాలని జాన్ బోల్టన్ అనే సలహాదారు సూచించినట్లు కూడా తెలుస్తోంది. యుద్ధం అనివార్యం, ఎప్పుడు రగులుతుంది అన్నదే ప్రశ్న అని ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాల తర్వాత ఉత్తర కొరియా కూడా ప్రకటించింది. అమెరికాఉత్తర కొరియా యుద్ధ నివారణకు అంతర్జాతీయ సంస్థలు, దౌత్యవేత్తలు, పౌర సమాజాలు తక్షణమే అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలి. యుద్ధం వల్ల కలిగే మానవ నష్టం, ఆర్థిక పర్యవసానాలు, పర్యావరణ విధ్వంసం అంచనా వేసి ముందస్తు యుద్ధానికి దిగవద్దని, ఇతర మార్గాలు అనుసరించాలని ట్రంప్‌పై అవి ఒత్తిడి తేవడం తథ్యం. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అటువంటి సాహసానికి ట్రంప్ దిగడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది.
ప్రపంచ క్షేమాన్ని, రాబోయే తరాల భద్రతను కాపాడాలంటే యుద్ధాన్ని ఉద్యమ కర్తలందరూ కలిసి నివారించవలసిందే. ఇరాక్‌పై దాడుల వల్ల అయిన ఖర్చు గురించి అమెరికాలో ముందే అంచనాలు తయారయి ఉంటే బుష్ పాలనా యంత్రాంగం ఆ యుద్ధానికి తెర తీయడాన్ని అమెరికన్లు ఒప్పుకొని ఉండేవారు కాదు. యుద్ధం వద్దని అమెరికా కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి ఉండేది. ఇరాక్‌తో యుద్ధంవల్ల అమెరికాకు దాదాపు 700 బిలియన్ డాలర్ల వ్యయం అయినట్లు 2005లో పాలసీ స్టడీస్ ఇనిస్టిట్యూట్ (విధాన అధ్యయనాల సంస్థ) అంచనా వేసింది. తర్వాత ఆ అంచనా 5 ట్రిలియన్ డాలర్లకు పెంచు తూ జోసెఫ్ స్టిగ్‌లిట్జి, లిండా బిల్మ్ అనే ఇద్దరు తమ పుస్తకంలో రాశా రు.
2008లో వచ్చిన ఆ పుస్తకం పేరు ‘ది త్రి ట్రిలియన్ డాలర్ వార్’. ఆ పుస్తకం చెప్పిన దానికి మించి 5 ట్రిలియన్లకు గ్రంథకర్తల అంచనా పెరిగింది. 2008లో అమెరికన్ ఓటర్లు ఈ యుద్ధాన్ని వ్యతిరేకించిన బారక్ ఒబామా అభ్యర్థిత్వాన్ని అధ్యక్ష పదవికి బలపరిచారు. వారిలో చాలామంది ఆ యుద్ధాన్ని బలపరిచినా, యుద్ధం పర్యవసానాలు 2003లోనే తెలిసి ఉంటే సమర్థించేవారం కాదని చెప్పారు. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుయుద్ధం జరిగితే ప్రాణనష్టం అపారంగా ఉంటుంది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయి. ఊహించని స్థాయిలో పర్యావరణ నష్టం కూడా సంభవిస్తుంది. ఉత్తర కొరియాను సాంప్రదాయ ఆయుధాలతో అమెరికా ధ్వంసం చేశాక, ఆ దేశం డజను దాకా అణ్వాయుధాలను అమెరికాపై ప్రయోగిస్తుందని ఆయుధ నియంత్రణ నిపుణుడు జఫ్రీ లూయిస్ వాషింగ్టన్ పోస్టులో రాశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు ఒక్క న్యూయార్క్‌లోనే 10లక్షలమంది దాకా అమెరికన్లను చంపుతాయని హెచ్చరించారు. మరో 30,000 మంది పౌరులు వాషింగ్టన్‌లో ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ యుద్ధం వల్ల చనిపోయే ఉత్తర కొరియన్ల సంఖ్య గురించి పెంటగాన్ చెప్పడం లేదు. అయితే అమెరికన్లు, దక్షిణ కొరియా పౌరులు, జపాన్ పౌరులు మొత్తం 20 లక్షల మంది మరణిస్తారని తాత్కాలికంగా అంచనా వేశారు. కొరియాలకు సమీపంలో అణ్వాయుధాలను ఉత్తర కొరియా వాడితే ఒక్క దక్షిణ కొరియా, జపాన్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని మరో అంచనా.
సాంప్రదాయ ఆయుధాలతో జరిగే యుద్ధంలో రోజుకి 20,000 మంది చనిపోతారని పెంటగాన్ అంచనా వేసింది. అణు యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఎటువంటి అణు యుద్ధమైనా ఆర్థిక నష్టాన్ని అపారంగా కలిగిస్తుంది. దక్షిణ కొరియా సమాజం ఆర్థికంగా పురోగతిలో ఉంది. 2017జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) ప్రకారం ఆ దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రష్యా తర్వాత 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఇటువంటి నేపథ్యంలో కొరియా ప్రాంతంలో యుద్ధం జరిగితే చైనా, జపాన్, తైవాన్ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయి. దక్షణ కొరియా జిడిపిలో 50 శాతం పతనం సంభవిస్తే ప్రపంచ జిడిపిలో ఒక పర్సంటేజ్ పాయిం ట్ తగ్గుతుంది. వాణిజ్య లావాదేవీల మొత్తాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. అణు యుద్ధం వల్ల పర్యావరణ ప్రభావం అపరిమితంగా ఉండగలదు. పరిమిత స్థాయిలో అణ్వాయుధ యుద్ధం జరిగినా ప్రపంచ ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ పతనం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే అణు యుద్ధంలో పోగైన చెత్తాచెదారం, గాలిలోకి వ్యాపించిన ధూళి కణాలు సూర్య కిరణాలను అడ్డుకొంటాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇందువల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తిపడిపోయి తిండికి కరువు ఏర్పడుతుంది. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేయించి, భూగర్భంలో పాతిపెట్టిన అణు సౌకర్యాలను విచ్ఛిన్నం చేయాలంటే కూడా అమెరికాకు సాంప్రదాయక ఆయుధాలతో అంత సులభంగా అయ్యే పని కాదు. అందువల్ల పరిమితంగానైనా అమెరికా అణ్వాయుధాలను ప్రయోగించవలసి వస్తుంది. వైమానిక దళ రిటైర్డ్ జనరల్ సామ్ గార్డినర్ ఈ హెచ్చరిక చేశారు.
   * జాన్ ఫెఫెర్

Comments

comments