Home కలం ఆ చల్లని సముద్ర గర్భం

ఆ చల్లని సముద్ర గర్భం

ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో ॥ ఆ చల్లని॥

భూగోళం పుట్టుకకోసం
రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో… ఆ… ఆ… ఆ
ఒక రాజుని గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు
బలి కాని పవిత్రులెందరో ॥ ఆ చల్లని॥

మానవ కళ్యాణం కోసం
పణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం
రాల్చిన పసి ప్రాణాలెన్నో… ఆ… ఆ… ఆ
కడుపుకోతతో అల్లాడిన
కన్నులలో విషాదమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు
దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ ఆ చల్లని॥

అన్నార్తులు అనాధులుండని
ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ
కనిపించని కాలాలెపుడో… ఆ… ఆ…ఆ
పసిపాపల నిదుర కనులలో
మురిసిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో
రాయబడని కావ్యాలెన్నో ॥ ఆ చల్లని॥

( గాన పాఠం – జనం పాటల నుండి)

– దాశరథి కవిత

DASHARAQDHAదాశరథి దీనిని రాసి 65 సంవత్సరాలకు పైనయింది. 1949లో ముద్రణయిన ‘అగ్నిధార’లో అది ? శీర్షికన ఉంది. అతి స్వల్పమైన మార్పులతో ఈ గేయాన్ని ఇలా పాటగా మార్చారు. అసలు గేయం “భరతావని బలిపరాక్రమం, చెరవీడేదింకెన్నాళ్ళకో” అనే చరణంతో అంతమవుతుంది. అందుచేత 1947కు ముందే రాశారేమోనను కోవాల్సి వస్తోంది. కానీ ఆయన జీవించివుండగా బహుశా ఒక్కసారి కూడా ఆ పాటను దాశరథి విని ఉండరు. ఎందుకంటే ఆయన 1987 నవంబర్‌లో చనిపోయారు. నాకు తెలిసి అప్పటికి ఆ పాటకు బాణీ కట్టి వేదికల మీద పాడటమన్నది మొదలు కాలేదు. నాకు జ్ఞాపకమున్న మేరకు పూర్తి రాగయుక్తంగా నేను మొదటిసారి దాన్ని విన్నది కర్నూలు జిల్లా ఆత్మకూరులో 1991 నవంబర్ 4న. అది పి.వి. నరసింహారావు ప్రధానిగా కొనసాగటానికి పార్లమెంటు సభ్యునిగా నెగ్గేందుకు జరుపుతున్న ఉపఎన్నిక కాలం, పి.వి.కి వ్యతిరేకంగా పోటీ చేసిన మండ్ల సుబ్బారెడ్డి అనే విప్లవ కమ్యూనిస్టు అభ్యర్థికి మద్దతుగా జరుగుతున్న సభలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉండిన ‘అరుణోదయ’ సాంస్కృతిక సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి అయిన రామారావు దాన్ని పాడాడు. అంటే 23 సంవత్సరాల క్రితం అన్నమాట! అయితే రామా రావు దృష్టికాపాట ఎలా వచ్చిందనేది నేను విచారించినంతలో తెలిసినదేమంటే ఖమ్మం పట్టణంలో ఒక ఉన్నత పాఠశాల వేడుకల సందర్భంగా ఒక ఉపాధ్యా యిని దాన్ని గానం చేయగా అరుణోదయ గాయని విమల దాన్ని రాసుకున్న తరువాత వారు దాన్ని సాధన చేశారు. అంటే నేను మొదటిసారి వినడానికి కొంతకాలం ముందు నుండే ఆ పాట గానం రూపంలో నలుగుతోంద నుకోవచ్చు.
సాహిత్యపు సామాజిక నేపథ్యానికొస్తే 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ తదనం తరం నిజాం రాజ్యపు తెలుగు భాష, సాహి త్యం, సంస్కృతుల ఉనికి, వికాసం కోసం ప్రజలు పడుతున్న ఆందోళన పట్టణాల నుండి పల్లెలకు కార్చిచ్చులా వ్యాపించింది. మధ్యతరగతుల (చదువరుల, వ్యాపార వర్గాల) మహాజరుల స్థాయి నుండి రైతు – కూలీ లు పెను వెల్లువలా రంగంలోకొచ్చారు. నాటి దేశము ఖులకు, దొరలకు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన మహోద్యమమై అది సాగింది.
“నీ బాంచన్ దొరా కాల్మొక్తా దొరా” అంటూ లొంగి లొంగి బతుకుతున్నట్టు పైకి చల్లగా మెల్లగా కనిపించే ప్రజలంటే మహాసముద్రం లాంటివారనీ, వారిలోపల దాగిన బడబాగ్నియెంతో ఉందనీ దాశరథికి అర్థమయింది. “ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో” (మూలం – అగ్నిధార) నంటూ అది లావాలా ఎగజిమ్ము తుంద ని తాను విశ్వసిం చారు. పాలకులకు హెచ్చరిక కూడా చేశారు. సామాజిక పరిణామానికే కాకుండా ‘ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో” అనే ప్రశ్న ద్వారా పరిణామవాదాన్ని ఆయన తన తాత్తికతలో భాగం చేసుకున్నారు. తాను జీవిస్తున్న తెలంగాణలో నాటి పరిస్థితుల నుండి ప్రజల స్వేచ్ఛను, విముక్తిని పొందటానికి ‘మార్కిజాన్నే’ ఒక సైద్ధాంతిక శాస్త్రం గా ఆయన స్వీకరించినట్లు ఈ పాట ద్వారా మనకు స్పష్టమవుతుంది.
దాశరథి ఆ పాటకు శీర్షికగా ప్రశ్నార్థకాన్ని (?) యిచ్చారు. పలు ప్రశ్నల ద్వారా ఆలోచింపజేసే శైలిని ఆయన ఈ పాటంతా అనుసరించారు కనుక శీర్షికను కూడా అలాగే (?) వుంచారు. ఆయన 7 చరణాలుగా ఆ పాటను రాస్తే గాయకులు ఒక పల్లవి మూడు చరణాలు (2×3) గా విభజించుకుని పాడుతున్నారు. ప్రతి చరణం మధ్యలో మూడవ కాలంలో ఎత్తుకునే ఆలాపనతో ఆరోహణ, అవరోహణల ఆవృతాన్ని పూర్తి చేసుకొని పాడిన పాదాలను మళ్లీ ఎత్తుకో వటం ద్వారా శ్రోతలను ఆ పాట బలంగా ఆకట్టు కుంటుంది. గాయకుల సమర్థతపైన అది ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. పాటకు దాశరథి యిచ్చిన శీర్షికను అర్థహీనం కాకుండా చెయ్యాలంటే అందులోని ప్రశ్నలకు ఆవేశాన్ని జోడించటం అవసరమ వుతుంది. ఆ ఆవేశాన్ని ప్రదర్శించటంలో ప్రజా కళాకారుల సమాఖ్య కృష్ణవేణి పరిణతి సాధించిందని నా అభిప్రాయం. విమల, రామారావు, అనూరాధ, పిచ్చయ్య ఇంకా అనేక మంది గాయకులు దాన్ని వివిధ వేదికల నుండి అనేకానేక సందర్భాలలో గొప్పగా పాడి వినిపించారు. ఆ విధంగా దాశరథి కృష్ణమాచార్య తన మరణానంతరం ప్రజల నాల్కల మీద జీవిస్తున్నారు.

దివి కుమార్
9440167891