Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సముద్రంలోపల డేటాసెంటర్ ..!

Data-Center

కంప్యూటర్లను నీటి అడుగున ఉంచడం ద్వారా, వాటి కూలింగ్‌కు అయ్యే ఇంధన వ్యయాన్ని తగ్గించవచ్చా? ఇదే అంశంపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది. కంప్యూటర్లతో కూడిన డేటా సెంటర్‌ను ఒక భారీ సిలిండర్‌లో ఏర్పాటు చేసి, ఆ సిలిండర్‌ను తీసుకెళ్లి సముద్రం అడుగున పెట్టింది. స్కాట్లాండ్‌లోని ఓక్నీ దీవుల సముదాయమున్న సముద్ర ప్రాంతంలో ఈ సిలిండర్‌ను ఉంచింది. సిలిండర్ సముద్రం అడుగునే ఐదేళ్లపాటు ఉంటుంది. దీన్ని ప్రత్యేక కేబుల్‌తో ఇంటర్నెట్, భూ ఉపరితలంపై ఉండే ఇతర వ్యవస్థలకు అనుసంధానించారు.

డేటా సెంటర్‌కు బయటి నుంచి ఇదే కేబుల్ విద్యుత్‌ను తీసుకొస్తుంది. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ’ప్రాజెక్ట్ నాటిక్’ అని పేరు పెట్టింది. భూమిపై కంటే నీటి అడుగున కంప్యూటర్లకు కూలింగ్ బాగుంటుందని భావిస్తున్నామని ప్రాజెక్ట్ నాటిక్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న బెన్ కట్లర్ చెప్పారు. డేటా సెంటర్లలో పరికరాలకు వాతావరణంలోని తేమ వల్ల నష్టం కలగొచ్చని ఆయన తెలిపారు. వీటిని సముద్రగర్భంలో ఉంచితే బయటి వాతావరణంలో ఉండేంత తేమ అక్కడ ఉండదు కాబట్టి ఈ నష్టాన్ని బాగా తగ్గించవచ్చని వివరించారు. సముద్ర గర్భంలో ఉంచిన డేటా సెంటర్‌లోని కంప్యూటర్లు చెడిపోతే అక్కడికి వెళ్లి మరమ్మతు చేయడం సాధ్యం కాదు. భూమి ఉపరితలంపై ఉండే కంప్యూటర్లతో పోలిస్తే అక్కడ ఉండే కంప్యూటర్లు చెడిపోయే అవకాశాలు తక్కువని మైక్రోసాఫ్ట్ ఆశాభావంతో ఉంది.

ప్రపంచంలో డేటాను నిక్షిప్తం చేయడానికి ఉపయోగిస్తున్న భారీ డేటా సెంటర్లతో పోలిస్తే ’ప్రాజెక్ట్ నాటిక్’లో వాడుతున్న డేటా సెంటర్ చాలా చిన్నది. ఈ డేటా సెంటర్‌లో 12 ర్యాకులలో సర్వర్లు అమర్చారు. ఇది చిన్నదే అయినప్పటికీ ఐదు లక్షల సినిమాల డేటాను దాయడానికి అవసరమైనంత స్పేస్ ఇందులో ఉంది. మైక్రోసాఫ్ట్ తొలిసారిగా 2015లో ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టింది. అప్పట్లో డేటా సెంటర్‌ను ఐదు నెలలపాటు నీటి అడుగున ఉంచింది. నాటి డేటా సెంటర్‌ను ’లియోనా ఫిలిపట్’ అని పిలుస్తారు. ఇది విజయవంతమైతే ఇలాంటి మరిన్ని సిలిండర్లను నీటి అడుగుకు చేర్చాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

Comments

comments