Home లైఫ్ స్టైల్ తండ్రి ఆస్తిలో ఆడపిల్లకూ సమాన హక్కు

తండ్రి ఆస్తిలో ఆడపిల్లకూ సమాన హక్కు

Couple-Court-Matter

సమస్య : నాకు గత ఏడాది పెళ్లైంది. అయితే అది నాకు ఇష్టం లేని పెళ్లి. మా నాన్న చనిపోతే అమ్మ పుట్టింట్లోనే తన అన్న వద్ద (మా మేనమామ) వుంది. మా మావయ్యే నన్ను చదివించాడు (బి.టెక్). వాళ్ళమ్మాయి గీతని నాకిచ్చి చేయాలని చిన్నతనం నుండే అనుకునేవాళ్లు. గీతకి కూడా నేనంటే ఇష్టం. కానీ నేను బి.ఇ. చదువుతున్నప్పుడు లత అనే అమ్మాయిని ప్రేమించాను. అమ్మతో చాలాసార్లు చెబుదామని చెప్పలేకపోయాను. అమ్మకి గీతంటే చాలా ఇష్టం. లతను మా ఇంటికి తీసుకొచ్చి అమ్మకు చూపిద్దామంటే మేము వుండేది మావయ్య ఇంట్లో.

అందుకని , నేను ప్రేమించిన అమ్మాయికి అన్నీ చెప్పాను. తను అమ్మనూ, మావయ్యనూ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటే అమ్మ అప్పటికే మావయ్యకు మాట ఇచ్చేసింది. లత బాగా చదువుకున్న అమ్మాయి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని లతకు హామీ ఇచ్చి కూడా తప్పాను. నాకు నా మరదలు గీతతో పెళ్లైంది. కానీ నేను గీతతో ఒక ఫ్రెండ్‌లాగానే వున్నాను. సంవత్సరం గడిచినా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదు. గీత నన్ను ఒకరోజు నన్ను నిలదీసింది. పెళ్లికి ముందు కనీసం సరదాగా మాట్లాడే వాడివి. పెళ్లైనాకా పరాయి స్త్రీతో మాట్లాడినట్లుగా, నాకు సరిగ్గా సమాధానం కూడా చెప్పటం లేదని ప్రశ్నిస్తే నేను లత గురించి చెప్పాను. తను నాకు విడాకులు ఇచ్చేసి, లతను పెళ్లి చేసుకో. నాకు అంగీకారమే అని చెప్పింది. నేనేం చేయాలో దయచేసి న్యాయ సలహా ఇవ్వండి.
– తరుణ్, మేడ్చల్

సలహా : నీ సమస్య నాకు అర్థమైంది. ప్రతి మనిషికీ కొన్ని బాధ్యతలు, హక్కులూ వుంటాయి. నీవు చదువుకున్న వాడివి. నీ జీవితం నా హక్కే, కానీ ఆ హక్కుని నీవు పెళ్లికాక ముందు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పెళ్లయ్యాకా మరొకరితో ( నీ మరదల్ని) నీ జీవితం ముడిపడి వుంది. కేవలం ఒక్క సంవత్సరం అయ్యింది. అంటే భార్యాభర్తలుగా మీరు ఒకరిని ఒకరు అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. అయినా నీవు పెళ్లి చేసుకున్నది ఎవరో పరాయి అమ్మాయి కాదు. నీ సొంత మరదలే. ఒక విషయం ఏమిటంటే చిన్నతనం నుండీ మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నప్పుడే నీవు, మీ తల్లి ఆ విషయాన్ని ఖండించాలి.

అలా కాకుండా మీ మావయ్య ఇంట్లోనే వుండి, ఆయన సహాయం పొంది, ఆయనే మీకు అన్ని విధాలా సహకారం అందించినప్పుడు నీవు కూడా వాటికి విధేయుడవై వుండాల్సిన బాధ్యత వుంది. నీవు ప్రేమించిన అమ్మాయికి మరొకర్ని పెళ్లి చేసుకునే అవకాశం వుంది. కానీ నీ మరదలు చిన్నతనం నుండీ నీపై ఆశలు పెంచుకుని, బలంగా నీవే తన భర్త అని నమ్ముకుంది. కనుక నీవు మనసుతో ఆలోచించు, విడాకులనేవి వెంటనే ఇచ్చేవికావు. దానికి తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలి. 1955 హిందూ మ్యారేజ్ యాక్టు ప్రకారం (సెక్షన్.13) విడాకులు కోరేవారు దీర్ఘకాలిక అనారోగ్యం, పిచ్చి లేదా అక్రమ సంబంధం, నయం కాని రోగం (కుష్ఠు), వెన్నుముక సంబంధింత రోగం (నిలబడలేని), వంటి కారణాలు చూపించాలి. నీకు అలాంటి ఏరకమైన ఆధారాలు లేవు. కనుక కుటుంబం గురించి ఆలోచించి సంతోషంగా సంసారం చేసుకో.

తండ్రి ఆస్తిలో ఆడపిల్లకూ సమాన హక్కు

సమస్య : నేనూ, మా అన్నయ్యా మేమిద్దరమే మా తల్లిదండ్రులకు సంతానం. మా నాన్న గారు ఆస్తికి సంబంధించి ఏ రకమైన విల్లు రాయలేదు. మాకున్న ఆస్తులు అన్నీ (ఇల్లూ, పొలాలు) ఆయన పేరు మీదే వున్నాయి. మా నాన్న గారు చనిపోయి సంవత్సరం దాటిపోయింది. అయితే ఆయన నన్ను చాలా ప్రేమగా పెంచారు. కానీ మా నాన్న తనకు నచ్చిన వ్యక్తితో ( మా బంధువులే) నా పెళ్లి ఖాయం చేశారు. నేను నా తోటి విద్యార్థి (రోహిత్)ని ప్రేమించాను. నాన్న నా పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తుంటే, నేను ఇంటి నుండి వెళ్లిపోయి రోహిత్‌ని పెళ్లి చేసుకున్నాను.

మేమిద్దరం మేజర్లమే. అందుకే మా పెళ్లి చట్టరీత్యా కరెక్టే అయ్యింది. కానీ మా నాన్న నాతో మాట్లాడ్డం మానేశారు. అమ్మకు మాత్రం నేనంటే ప్రేమే. మా అన్నయ్య, మా నాన్న చూసిన సంబంధం నేను చేసుకోలేదని నాపైన తను కూడా కక్ష పెంచుకున్నాడు. మా అన్నయ్యకు నాకంటే ముందే పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్యకి. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబుకి 4 సంవత్సరాలు. రెండవ బాబుకి రెండు సంవత్సరాలు. అమ్మకి ఆరోగ్యం బాగలేకపోయినా, నేను చూడడానికి వెళ్లలేని పరిస్థితి. నన్నూ మా ఆయన్ని వాళ్లింటికి రావద్దని చెప్పాడు. నేను ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పా, నాకు మా ఇంట్లో హక్కులు వుండవా? మా నాన్న ఆస్తిలో కూడా నాకు హక్కు లేదని, తనకూ, అమ్మకే హక్కు వుందని మా అన్నయ్య అంటున్నాడు. నిజంగానే ప్రేమ పెళ్లి చేసుకుంటే హక్కులుండవా? దయచేసి తెలియజేయండి.
ప్రవల్లిక, ధన్వాడ

సలహా : ప్రతీ మనిషికీ జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. అవి మనకి అనుకూలం కావచ్చు. లేదా ప్రతికూలం కావచ్చు. కానీ అనుభవించాల్సిందే. నీ విషయం లోకి వస్తే నీవు నీ తోటి విద్యార్థిని ప్రేమించిన సంగతి మీ తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుని వుంటే నీకీ సమస్యలు వచ్చేవికావు. సరే మంచో, చెడో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న గారు నిన్ను ఎంతో ప్రేమగా పెంచి నీ పెళ్లి గ్రాండ్‌గా చేయాలనుకున్నారు. కనుక ఆయనకు కోపం

రావడం సహజం. అయితే ఇక్కడ మీ అన్నయ్య మీ నాన్నకు నచ్చజెప్పి, ఒక్క చెల్లెలివి కనుక తను కూడా నీ ప్రేమను అర్థం చేసుకోవాలి. అలాకాకుండా తను నీ మీద కోపం, ఈర్ష పెంచుకుని బాధించడం చాలా తప్పు. మీ తండ్రి ఎలాగూ చనిపోయారు. మీ అమ్మగార్ని చూసుకోనివ్వకుండా (తనకు అనారోగ్యంగా వుంటే) అడ్డుపడడం మూర్ఖత్వం. నీవు ఈ విషయం పెద్దల సమక్షంలో, లేదా మీ బంధువుల మధ్య కూర్చొని సామరస్యంగా తేల్చుకోవాలి. ఇకపోతే నిన్ను ఇంటికి రావద్దనే హక్కు మీ అన్నకు లేదు. ఎందుకంటే ఆ ఇల్లు, మిగతా ఆస్తులు అన్నీ మీ నాన్న గారి స్వార్జిత్యం కనుక. 1986 హిందూ వారసత్వ చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు అన్ని హక్కులూ వుంటాయి. నీ ప్రేమ పెళ్లి ఆ హక్కులకు ఆటంకం కాదు. మీ తండ్రి గారి ఆస్తిలో మీ
అమ్మగారికి, మీ అన్నకు, నీకు మీ ముగ్గురికీ సమాన హక్కులు (వాటా) వుంటాయి. కనుక నీవు భయపడవలసిన పనిలేదు. చట్టరీత్యా నీకు అన్ని హక్కులూ వుంటాయి.