Home తాజా వార్తలు వార్నర్ మళ్లీ దంచేశాడు

వార్నర్ మళ్లీ దంచేశాడు

David-Warner

నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరును సాధించింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) మరోసారి విధ్వంసక సెంచరీతో కదం తొక్కాడు. ఫించ్ (53), ఖ్వాజా (89)లు కూడా ధాటిగా ఆడడంతో కంగారూలు రికార్డు స్కోరును నమోదు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కూడా అసాధారణ పోరాట పటిమ కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియాకు దీటైన జవాబిచ్చిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసి పోరాడి ఓడింది. స్టార్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం 102 (నాటౌట్) అజేయ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేక పోయాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (62), మహ్మదుల్లా (69)లు కూడా మెరుగ్గా రాణించడంతో బంగ్లాదేశ్ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.
వార్నర్, ఫించ్ జోరు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు శుభారంబం అందించారు. ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ స్కోరును ముందుకు నడపించారు. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్, ఫించ్‌లు బంగ్లాపై కూడా అదే జోరును ప్రదర్శించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన ఫించ్, వార్నర్‌లు కుదురుకున్న తర్వాత బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించారు. ఇద్దరు పోటీ పడి షాట్లు కొట్టడంతో అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న రన్‌రేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 51 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో ఐదు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించాడు. ఫించ్ ఔటైనా వార్నర్ జోరును కొనసాగించాడు. అతనికి ఉస్మాన్ ఖ్వాజా అండగా నిలిచాడు.

ఇద్దరి మధ్య మరో కీలక పార్ట్‌నర్‌షిప్ నమోదైంది. వార్నర్ తన మార్క్ షాట్లతో బంగ్లా బౌలర్లను హడలెత్తించాడు. ఖ్వాజా కూడా వరుస ఫోర్లతో విరుచుకు పడ్డాడు. ఇద్దరు చెలరేగి ఆడడంతో బంగ్లా బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఖ్వాజా 72 బంతుల్లోన పది బౌండరీలతో 89 పరుగులు చేశాడు. ఇక, మెరుపులు మెరిపించిన వార్నర్ మరోసారి కళ్లు చెదిరే శతకం సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 147 బంతుల్లోనే 14 ఫోర్లు, మరో ఐదు భారీ సిక్సర్లతో 166 పరుగులు సాధించాడు. మరోవైపు మాక్స్‌వెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లను హడలెత్తించిన మాక్స్‌వెల్ పది బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, మరో రెండు బౌండరీలతో 32 పరుగులు చేశాడు. స్టోయినిస్ కూడా వేగంగా 17 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరును సాధించింది.

David Warner hits century as Australia return to table top