Home మంచిర్యాల బ్లాక్ మార్కెట్‌కు సబ్సిడీ కిరోసిన్

బ్లాక్ మార్కెట్‌కు సబ్సిడీ కిరోసిన్

Dealers selling illegally merchants

టాస్క్‌ఫోర్స్ దాడుల్లో 300 లీటర్ల కిరోసిన్ పట్టివేత
జోరుగా సాగుతున్న నీలి కిరోసిన్ దందా
అక్రమంగా వ్యాపారులకు అమ్ముతున్న డీలర్లు
లారీలకు ఇంధనంగా ఉపయోగిస్తున్న వైనం
నిద్రావస్థలో నిఘా అధికారులు

మన తెలంగాణ/మంచిర్యాల: నీలి కిరోసిన్ దందా అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతుంది. కొందరు వ్యాపారులు రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన సబ్సిడీ నీలి కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నీలి కిరోసిన్ దందాను అరికట్టాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవలి కాలంలో నీలి కిరోసిన్ దందాపై కన్నేసి విరివిగా పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాలలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, క్యాన్‌లలో గల 300 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కిరోసిన్ విలువ 1500 ఉండగా అక్రమంగా తరలిస్తున్న నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పుప్పాల మల్లేష్‌ను అరెస్టు చేసి, బెల్లంపల్లి పోలీసులకు అప్పటించారు. ఇదిలా ఉండగా ప్రధానంగా నీలి కిరోసిన్‌ను డీజిల్‌కు బదులుగా లారీలలో ఇంధనంగా ఉపయోగించడం వలన డిమాండ్ పెరిగింది. బెల్లంపల్లి పట్టణంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏప్రిల్ మాసంలో ఆస్మిక దాడులు నిర్వహించి, 350 లీటర్‌ల నీలి కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన నరేంద్రుల శ్రీధర్ అనే వ్యక్తి విక్రయించేందుకు సిద్దంగా ఉంచి ఆరు క్యాన్‌లలో గల 350 లీటర్ల కిరోసిన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.16 వేలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా కిరోసిన్‌ను బ్లాక్ చేసే విషయంలో ప్రతి నెల రేషన్ కోటా కింద వచ్చే కిరోసిన్‌ను పంపిణీ చేయకుండా సగానికి సగం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం పేదలకు చెందాల్సిన కిరోసన్‌ను బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో రూ. 17 లభించే లీటర్ కిరోసిన్‌ను పెట్రోల బంక్‌కులలో లారీలకు రు. 45 నుంచి 60 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డు దారులకు ఒక లీటర్ , లేని వారికి 2 లీటర్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాని ఇందులో సగం కోటాకు పైగా మాయం చేసి, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ తతంగం అధికారుల కనుసన్నలలోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసే నీలి కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి వ్యాపారులు కోట్లకు పడగలెత్తున్నారు. ప్రతి నెల 5 నుంచి 10వ తేదీ వరకు కిరోసన్ ఆలాట్ మెంట్ చేసి, 15 నుంచి 25 మధ్యన పంపిణీ చేస్తున్నారు. కిరోసిన్ అలాట్ మెంట్ వచ్చిన తరువాత సంబంధిత డీలర్ డబ్బులు చెల్లించి, రషీద్‌లను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే హోల్‌సేల్ డీలర్లు వారికి సరఫరా చేస్తారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సరఫరా చేసే కిరోసిన్ లీటర్‌కు రూ .17 ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులతోపాటు జిల్లా కేంద్రంలో హాకర్లకు కూడా కిరోసిన్‌ను పంపిణీ చేస్తారు. ఆహార భద్రత కార్డు దారులకు కిరోసిన్‌ను అరకొరగా పంపిణీ చేసి, హాకర్లు చేతులు దులుపుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులకు పంపిణీ చేయాల్సిన కిరోసన్‌లు హాకర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పౌరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే సరుకులు, కిరోసిన్ కార్డు దారులకు క్షేత్రస్థాయిలో అందేలా చూడాల్సిన అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.