Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మృత్యుశకటాల్లా ఆటోలు

మృత్యుశకటాల్లా ఆటోలు

నిబంధనలు పట్టని ఆటో డ్రైవర్లు
పట్టించుకోని ఆర్‌టిఎ అధికారులు

auto

మన తెలంగాణ/సిటీ బ్యూరో : ఒక వైపు 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగుస్తుండగా రోడ్డు ప్రమాదాలు తగ్గక పోవడాన్ని సోమ, మంగళవారం జరిగిన ఆటో ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి. సమాజంలో మార్పు దిశగా రవాణా, ట్రాఫిక్ అధికా రుల ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఆటోల రూపంలో జరు గుతున్న ప్రమాదాలు నగర వాసులను భయకంపితులను చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆటోవాలాలు మరీ ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్షం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ట్రాఫిక్ కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసులు పత్తా లేకుండా పోతున్నారు. పైగా ఇది ట్రాఫిక్ పోలీస్ రహిత కూడలిని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకుంటున్నారు.

ఆటో డ్రైవర్లకు సరైనశిక్షణ, ట్రాఫిక్ నియమ నిబంధనలపై సరైన అవగాహన కల్పించక పోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నగరంలో సమారు 1 లక్షా 30 వేల ఆటోలు ప్రజా రవాణాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో సమారు 15 నుంచి 20 వేల ఆటోలు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉండగా మరో 10 వేలు కాలం చెల్లిన ఆటోలు ఉన్నాయి. వీటిని నియంత్రించే ఇటు ఆర్టిఏ అధికారులు కాని ఇటు ట్రాఫిక్ పోలీసులు కాని పట్టించుకోక పోవడంతో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసి  పోతున్నాయి. అధికారులు వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మామూళ్ళ మత్తులో మగ్గుతూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తుండటంతో ఇటువంటి ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన వాహనాలు పొగతో రోడ్డు మీద వెళ్ళే ఇతర వాహన దారులు కూడా ఇబ్బంది పడటమే కాకుండా వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి.
కనిపించని మీటర్ : నగరంలో ఉన్న ఆటోల్లో ప్రతి రోజు 8 నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు వీటిలో రాక పోకలను సాగిస్తున్నారు.

సామాన్య ,మద్యతరగతి వర్గాలకు అందుబాటులో వుండాల్సిన ఆటోలు చాలా వరకు ప్రయాణికులను నిలువు దోపిడి చేస్తున్నవే.. నగరంలో ఏదో ఒక సందర్భంలో ఆటో లను ఆశ్రయిస్తున ప్రతి ప్రయాణికుడు ఆటో డ్రైవర్ల అదనపు దోపిడిలకు గురయిన వారే. వీరి దోపిడి ప్రధానంగా గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులు, జూబ్లి హిల్స్, మహాత్మాగాంధీ బస్టేషన్, నాంపల్లి, కాచిగూడ, సింకింద్రాబాద్ రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకుని వారు ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున దోచు కుంటున్నారు.ఆటో డ్రైవర్లు ఆటో మీటర్లను వేయడం పూర్తిగా మర్చిపోయారు. కేవలం రెండు మూలు కిలో మీటర్ల దూరానికి రూ.100 డిమాండ్ చేస్తూ ప్రయా ణికుల జేబులను గుల్ల చేస్తున్నారు. రాత్రి సమయం అయ్యిందంటే వీరి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.
పరిమితికి మించినప్రయాణికులు : నగరంలోని ఆటోలకు 1 ప్లస్ 3కి మాత్రమే అనుమతి ఉంది.కాని అధికారులు పట్టించుకోక పొవడంతో పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కించుకుని ప్రమాదరకంగా రాకపోకలను సాగిస్తున్నారు. పాత బస్తీలో జరిగిన ఆటో ప్రమాదంలో ఇది ఒక కారణంగా తెలిసిందే. ఏది ఏమైన ఈ అంశంపై ఆర్టిఏ, ట్రాఫిక్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిబంధలను అతిక్రమించిన వాహాలను మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 83, సెక్షన్ 86 ప్రకారం ఆటోలను జప్తు చేసి,పర్మిట్ రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
మౌనం పాటిస్తున్న యూనియన్ నాయకులు
ఆటో డ్రైవర్లకు ఏదైనా ప్రమాదం జరిగినా.. వారికి ప్రభుత్వం తరపున సాయం కావాలన్నా మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చే ఆటో యూనియన్ నాయకులు వారు చేసే ప్రమాదాల విషయంలో మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.