Home ఎడిటోరియల్ మత కళ్లద్దాలు మానవీయత

మత కళ్లద్దాలు మానవీయత

Death toll nears 400 in India flood hit Kerala

కేరళ రాష్ట్రం జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. వర్షాలు నిలిచిపోయి వరద ప్రవాహం తగ్గుతున్నది. సహాయక బృందాలు మారుమూలలకు వెళ్లగలుగుతున్నాయి. శిథిలమైన గృహాలు, విరిగిపడిన కొండ చరియలు, వొరిగిన వృక్షాలు, నాశనమైన రహదారులు, జంతు కళేబరాలు, పనిచేయని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కూలిపోయిన స్తంభాలు, తెగిన తీగలు దర్శనమిస్తున్నాయి. శిథిలాల్లో కొన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. మొత్తం మీద మృతుల సంఖ్య 400 దాటింది. ఏడున్నర లక్షల మందికిపైగా సహాయక శిబిరాల్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించే సహాయక చర్యలు దాదాపు ముగిశాయి. సైన్యం, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతోపాటు ప్రాణాలకు తెగించి నాటు పడవలతో సహాయక చర్యల్లో పాల్గొన్న మత్సకారులు అభినందలకు పాత్రులు. ప్రకృతికి కుల, మత, ధనిక, పేద వ్యత్యాసం ఉండదు. బాధితుల్లో అందరూ ఉన్నారు. అలాగే సహాయక బృందాల్లో అన్ని సామాజిక తరగతులవారున్నారు. ఇటువంటి ఆపత్సమయంలో  అది ఎక్కడి సంభవించినప్పటికీ సాటి మానవుల్లో వెల్లివిరియాల్సింది మానవత్వం, తోటి మనుషుల దురవస్థలపట్ల సానుభూతి, తమ శక్తి మేరకు ఆర్థిక, పాదార్థిక సహాయం చేయగల దాతృత్వం. కాని ఇంతటి మానవ విషాదాన్ని సైతం మతోన్మాద కళ్లద్దాల నుంచే వీక్షిస్తున్న కరడుగట్టిన కొన్ని మితవాద సంస్థలు, వ్యక్తులు సోషల్ మీడియాను ఉపయోగించుకుని కేరళ ముఖ్యమంత్రి విపత్తుల నిధికి విరాళాలివ్వొద్దని విజ్ఞప్తి చేయటం ఎంతటి అమానుషం! ఇచ్చే విరాళాలు మైనారిటీలకే చేరతాయని వారు బాధపడుతున్నారు.

కులం, మతంతో నిమిత్తం లేకుండా బాధితులందరికీ సహాయం చేరుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా మత విషం గక్కుతున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యునిగా ఇటీవల  నియమించబడిన విద్యావంతుడు, సంఘ్ పరివార్ సన్నిహితుడు ఎస్.గురుమూర్తి ఈ ప్రకృతి విలయంలోకి మతమౌఢ్యాన్ని చొప్పించి  శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించటంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందుకు భగవంతుని ఆగ్రహం కేరళ వరదలని పేర్కొనటం విచారకరం. “కేసుకు శబరిమలలో జరుగుతున్న దానికి (వరదలు) ఏమైనా సంబంధముందేమో సుప్రీంకోర్టు జడ్జీలు చూడవచ్చు. అట్టి సంబంధం ఉండే అవకాశం  పది లక్షల్లో ఒకటిగా ఉన్నా అయ్యప్పన్‌కు వ్యతిరేకంగా కేసు నిర్ణయాన్ని ప్రజలు ఇష్టపడరు” అని ఆయన ట్వీట్ చేశారు. అంటే రాజ్యాంగం కన్నా మత విశ్వాసం మిన్న అని, దాని ప్రకారమే సుప్రీంకోర్డు జడ్జీలు నడుచుకోవాలనే హెచ్చరిక అందులో ఉంది. అటువంటి అమానవీయమైన పోస్టులు, ట్వీట్‌లను ఆ భావజాలానికి చెందిన ముఖ్యులెవరైనా ఖండిస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారు.