Home బిజినెస్ స్థూల గణాంకాలపైనే దృష్టి

స్థూల గణాంకాలపైనే దృష్టి

Decline in crude oil prices led to key indices leading to profitability

న్యూఢిల్లీ: గతవారం మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. భారత్ ఆర్థిక వృద్ధి ఆరోగ్యకరంగా ఉందని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) చెప్పడం, త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు కీలక సూచీలను లాభాల దిశగా నడిపించాయి. అయితే ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. బుధవారం(15న) ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. స్థూల ఆర్థిక ద్రవ్యోల్బణ గణాంకాలు, తొలి త్రైమాసిక ఫలితాలు, విదేశీ నిధుల అవుట్ ఫ్లో, ఇన్‌ఫ్లో వంటివి ఈ వారం మార్కెట్లకు కీలకం కానున్నాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, హై స్టాక్ వాల్యుయేషన్ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి.

ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి), కోల్ ఇండియా, ఎన్‌బిసిసి క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించాయి.సోమవారం(13న)ఆయిల్ ఇండి యా, 14న ఇండియాబుల్స్ రియల్టీ ఫలితాలు రా న్నా యి. దీంతో సోమవారం క్యూ1 ఫలితాల ఆధారంగా ప్రభుత్వ రంగ దిగ్గజ కౌంటర్లు ట్రేడయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఎస్‌ఎంసి ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డికె అగర్వాల్ మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లు మరోసారి వారం మొత్తం ఈవెంట్లతో నిండి ఉండనున్నాయని, మరిన్ని త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్, విదేశీ, దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు చూడాల్సి ఉంటుందని అన్నారు.

ఈవారం క్యూ1 ఫలితాలు
జులై నెలకు గాను సిపిఐ(వినిమయ ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను ఆగస్టు 13న ప్రకటించనున్నారు. డబ్లుపిఐ (టోకు ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు14న వెల్లడించనున్నారు. క్యూ1 ఫలితాలను.. కాడిలా, డిహెచ్‌ఎఫ్‌ఎల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్, సన్ ఫార్మా, కేర్, గ్రీవ్స్ కాటన్, అశోక బిల్డ్‌కాన్, దిలీప్ బిల్డ్‌కాన్ వంటి కంపెనీలు ప్రకటించనున్నాయి. విదేశీ అంశాలను చూస్తే, జులై నెలకు గాను అమెరికా రిటైల్ అమ్మకాల గణాంకాలు 15న విడుదల కానున్నాయి. జూన్‌లో నెలవారీ ప్రాతిపదికన రిటైల్ సేల్స్ 0.5 శాతం పుంజుకున్నాయి. ఇంకా ఈనెల 16న జులై నెలకు గాను జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల కానున్నాయి.

గణాంకాలపై దృష్టి
ఇప్పటికే జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపి) వివరాలను కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించింది. ఐఐపి నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకుని జూన్‌లో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. పండగ సీజన్‌కు ముందు భారీ యంత్రపరికరాల తయారీలో వృద్ధి కారణంగా ఐఐపి వేగవంతమైంది.జిఎస్‌టి అమలు నేపథ్యంలో గతేడాది జూన్ లో ఐఐపి మందగించిందని, దీంతో అధిక వృద్ధికి వీలుకలిగిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మే నెలలో ఐఐపి 2.8 శాతం వృద్ధితో పోలిస్తే జూన్‌లో 6.9 శాతం పెరిగింది. తొలి త్రైమాసికం(ఏప్రిల్‌జూన్)లో ఐఐపి వృద్ధిలో తయారీ రంగం 5.2 శాతం వృద్ధినే నమోదు చేసింది. 23 పరిశ్రమల్లో 19 పరిశ్రమలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వృద్ధి 44 శాతం ఉంది. మంగళవారం జులై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్లుపిఐ) గణాంకాలను విడుదల చేయనుంది.

అంతర్జాతీయ అంశాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలను పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు వంటివి దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని పేర్కొంటున్నారు. ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లు సరికొత్త గరిష్టాలను చేరుకోగా, సూచీలు ఈసారి దిద్దుబాటుకు లోనుకావచ్చని వారు భావిస్తున్నారు.